2023లో పోస్టాఫీసు పథకాల్లో వచ్చిన మార్పులివే..

Post office schemes new rules 2023: పోస్టల్ శాఖ అందిస్తున్న పొదుపు పథకాల్లో ఈ ఏడాదిలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ వివరాలు ఇవీ..

Updated : 29 Dec 2023 14:35 IST

Post office schemes new rules | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో పొదుపును ప్రోత్సహించే ఉద్దేశంతో తపాలా శాఖ (Postal department) అనేక చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పొదుపు పథకాల్లో ఈ ఏడాది కేంద్రం కొన్ని మార్పులు చేపట్టింది. కొన్ని పథకాలపై పెట్టుబడి పరిమితి పెంచడంతో పాటు.. కొత్తగా మరో స్కీమ్‌ను తీసుకొచ్చింది.  ఆ వివరాలు ఇవీ.

మహిళల కోసమే..

మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ (Mahila Samman Savings Certificates) పేరుతో 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉండనుంది. ఈ పథకానికి 7.50 శాతం స్థిర వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. డిపాజిట్‌పై రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి నిర్ణయించింది.

‘మంత్లీ’ లిమిట్‌ పెంపు

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS)లో డిపాజిట్‌ లిమిట్‌ని ఈ ఏడాది బడ్జెట్‌లో భాగంగా పెంచారు. గతంలో వ్యక్తిగత ఖాతాల పరిమితి రూ.4 లక్షలుగా ఉండేది. ఈ ఏడాదిలో దాన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్‌ ఖాతాలకు రూ.9 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15 లక్షలకు చేర్చారు.

‘సీనియర్ల’కు ఊరట

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS)లో ఒక వ్యక్తి ఇప్పటి వరకు రూ.15 లక్షల వరకు గరిష్ఠ డిపాజిట్‌ చేసే అవకాశం ఉండేది. SCSS గరిష్ఠ డిపాజిట్‌ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఈ పథకానికి ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. అలాగే, ఈ పథకం కింద ఖాతా ప్రారంభ గడువును సైతం నెల నుంచి మూడు నెలలకు పెంచారు. అంటే పదవీ విరమణ ప్రయోజనాలను అందుకున్న తేదీ నుంచి మూడు నెలల్లోపు ఈ పథకం కింద ఖాతా తెరవవచ్చన్నమాట. గతంలో ఈ ఖాతాను ఒక సారి మాత్రమే పొడిగించడానికి వీలుండేది. ఇప్పుడు అనేక సార్లు ఖాతాను పొడిగించవచ్చు.

టైమ్‌ డిపాజిట్‌లోనూ మార్పులు

పోస్టాఫీసు అందిస్తున్న మరో పెట్టుబడి పథకం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD). టైమ్‌ డిపాజిట్‌ పేరిట అందిస్తున్న ఈ స్కీమ్‌లో ఈ ఏడాది కొన్ని మార్పులు చేశారు. అయిదేళ్ల కాలావ్యవధి డిపాజిట్‌ను.. ఖాతా తెరిచిన నాలుగేళ్ల తర్వాత మూసివేయాలనుకుంటే పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాకు వర్తించే వడ్డీ (4శాతం) ఇస్తారు. ప్రస్తుతం అయిదేళ్ల టైమ్‌ డిపాజిట్‌ ఖాతాను డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి నాలుగేళ్ల తర్వాత మూసివేస్తే.. మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌ ఖాతాకు వర్తించే వడ్డీని వర్తింపజేస్తూ వచ్చారు.

పీపీఎఫ్‌ ముందస్తు క్లోజింగ్ నిబంధనలూ

పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ నిబంధనలనూ తపాలా శాఖ సవరించింది. గతంలో పీపీఎఫ్‌ ముందస్తు మూసివేతపై 1 శాతం వడ్డీ తక్కువగా చెల్లించేవారు. ఖాతా ప్రారంభం లేదా పొడిగింపు తేదీ (ఎక్స్‌టెన్షన్‌) నుంచి ఈ మినహాయింపు వర్తింపజేసేవారు. తాజాగా నిబంధనను ఐదేళ్ల బ్లాక్‌గా మార్చారు. అంటే ఖాతాను మూసివేసిన పక్షంలో ఐదేళ్ల బ్లాక్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ కాలానికి మాత్రమే 1 శాతం తక్కువ వడ్డీ చెల్లిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని