ChatGPT: గూగుల్‌ బార్డ్‌, బింగ్‌ కంటే చాట్‌జీటీపీనే టాప్‌!

ChatGPT: కృత్రిమ మేధ ఆధారంగా ఓపెన్‌ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ గత 12 నెలలుగా ఎక్కువగా మంది వినియోగిస్తున్న చాట్‌బాట్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

Updated : 14 Nov 2023 17:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతిక యుగంలో సంచలనంగా మారిన చాట్‌జీపీటీ (ChatGPT) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌బాట్‌లలో అత్యంత జనాదరణ పొందిన యాప్‌గా అవతరించింది. గత 12 నెలలుగా ఎక్కువ మంది వినియోగిస్తున్న చాట్‌బాట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2022 సెప్టెంబరు నుంచి 2023 ఆగస్టు మధ్య కాలంలో మొత్తం 14.6 బిలియన్ల మంది విజిటర్లను చాట్‌జీపీటీ సంపాదించుకుంది. ఇతర యాప్‌లు దీనికి చాలా దూరంలో ఉన్నాయి.

రైట్‌బడ్డీ ఏఐ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఎక్కువ మంది వినియోగిస్తున్న చాట్‌బాట్‌ యాప్‌లలో చాట్‌జీపీటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏఐ ఆధారిత సేవల్ని అందించే టాప్‌- 50 చాట్‌బాట్‌లలో చాట్‌జీపీటీని వినియోగించే వారే 60 శాతంగా ఉన్నారు. నెలకు సగటున 1.5 బిలియన్ల విజిటర్స్‌తో పాపులర్‌ చాట్‌బాట్‌గా చాట్‌జీపీటీ నిలిచింది. ఏడాదికి 3.8 బిలియన్ల మంది యూజర్లతో క్యారెక్టర్‌ ఏఐ (Character AI) రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న చాట్‌జీపీటీకీ రెండో స్థానంలో ఉన్న యాప్‌నకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే, చాట్‌జీపీటీ కంటే క్యారెక్టర్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌పైనే 8 రెట్లు ఎక్కువ సమయాన్ని యూజర్లు గడుపుతున్నారని గతంలో ఓ అధ్యయనం వెల్లడించింది.

రేపే ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు.. జాబితాలో మీ పేరు ఉందా? చెక్‌ చేసుకోండి!

ఇక ప్రముఖ టెక్ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి వచ్చిన ఏఐ టూల్స్‌ బార్డ్‌ (Google Bard), మైక్రోసాఫ్ట్ బింగ్ (Microsoft Bing) వంటి ఇతర ప్రధాన చాట్‌బాట్‌లు చాట్‌జీపీటీకి ఏమాత్రం గట్టి పోటీనివ్వలేకపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్‌ తన బార్ట్‌ని తీసుకొచ్చింది. ఈ చాట్‌బాట్‌ 241 మిలియన్ల యూజర్లతో 6వ స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చిన బింగ్‌ మాత్రం టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది. ఏఐ చాట్‌బాట్‌లకు వినియోగించే వారి సంఖ్య సైతం భారీగా పెరిగింది. 2022 సెప్టెంబర్‌లో కేవలం 241 మిలియన్లగా ఉన్న చాట్‌బాట్‌ యూజర్లు 2023 మే నాటికి 4 బిలియన్లకు చేరారు.

టాప్‌-10 చాట్‌బాట్‌లు ఇవే..

  • చాట్‌జీపీటీ
  • క్యారెక్టర్‌ ఏఐ
  • క్విల్‌బాట్‌
  • మిడ్‌జర్నీ
  • హగ్గింగ్‌ ఫేస్‌
  • గూగుల్‌ బార్డ్‌
  • నోవల్‌ఏఐ
  • క్యాప్‌కట్‌
  • జానిటార్‌ ఏఐ
  • సివిటాయ్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని