Credit Report: క్రెడిట్‌ నివేదికను తరచూ చెక్‌ చేసుకోవాలి.. ఎందుకంటే?

చాలా మంది క్రెడిట్‌ నివేదికను లోన్‌ అవసరమైనప్పుడో లేక క్రెడిట్‌ కార్డు తీసుకోవాలనుకున్నప్పుడో చెక్‌ చేసుకుంటుంటారు. కానీ, రెగ్యులర్‌గా చూసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు 

Updated : 16 Dec 2022 12:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ స్కోరు (Credit Score), నివేదిక ప్రాముఖ్యతపై ఇటీవల భారతీయుల్లో అవగాహన పెరిగింది. 2021 అక్టోబరు నుంచి 2022 సెప్టెంబరు మధ్య కొత్తగా 2.38 కోట్ల మంది తమ వద్ద రిజిస్టర్‌ చేసుకున్నట్లు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ ఇటీవల తెలిపింది. క్రితం ఏడాది వ్యవధితో పోలిస్తే ఇది 83 శాతం అధికం. అంటే వీరంతా తమ క్రెడిట్‌ స్కోరు (Credit Score), నివేదిక (Credit Report)ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడానికి సిద్ధమయ్యారని అర్థం.

తరచూ తనిఖీ చేసుకోవాలి..

చాలా మంది లోన్‌ (Loan) తీసుకుందామనుకున్నప్పుడే క్రెడిట్‌ నివేదిక (Credit Report)ను తనిఖీ చేసుకుంటూ ఉంటారు. కానీ, కనీసం త్రైమాసికానికి ఒకసారైనా ఆ పని చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నివేదిక (Credit Report)ను ఇలా ఎప్పటికప్పుడు చూసుకుంటే చాలా అంశాలు అవగతమవుతాయి. ఒకవేళ ఎవరైనా మీకు తెలియకుండా మీ పేరు మీద రుణం తీసుకుంటే తెలిసిపోతుంది. తరచూ చెక్‌ చేసుకుంటేనే దీన్ని గుర్తించగలుగుతారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది.

ఒక్కోసారి మనం మన క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) బాగానే ఉండొచ్చన్న భావనలో ఉండిపోతాం. కానీ, ఏదైనా అవసరమొచ్చి చూసుకున్నప్పుడు కావాల్సిన స్థాయిలో లేకపోతే సమస్యలు రావొచ్చు. అందుకే తరచూ చెక్‌ చేసుకుంటే ఎక్కడ లోపం ఉందో వెంటనే గుర్తించవచ్చు. దానిని మెరుగుపర్చుకోవడానికి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. స్కోరును తిరిగి గాడిలో పెట్టుకోవడానికి కనీసం మూడు త్రైమాసికాలైనా పడుతుంది.

ఈ మధ్య ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. కంప్యూటర్‌, ఫోన్‌ వాడుతున్న సమయంలో పొరబాటున ఎక్కడైనా క్లిక్‌ చేస్తే అది రుణ మంజూరు వరకు దారితీస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఒక్కోసారి మనకు తెలియకుండానే గబగబా క్లిక్‌ చేస్తూ అన్నింటికీ అనుమతులిచ్చేస్తూ ఉంటాం. ఇది మన క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇలా ఏవైనా పొరపాట్లు జరిగినా అది మన క్రెడిట్‌ నివేదిక (Credit Report)లో తెలిసిపోతుంది. అందుకే తరచూ చెక్‌ చేసుకుంటే ఏ సమస్యా ఉండదు. పైగా గతంలో ఏవైనా చెల్లింపులు మర్చిపోయినా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది.

ఈ అంశాలను పరిశీలించాలి..

మీ క్రెడిట్‌ నివేదిక (Credit Report)లో మీరు మొట్టమొదట పరిశీలించాల్సిన అంశం క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score). అది బలంగా ఉంటే ఇబ్బంది లేదు. ఏ క్షణంలోనైనా మీకు రుణం అవసరమైతే వెంటనే ధైర్యంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పైగా తక్కువ వడ్డీరేటు కోసం అభ్యర్థించొచ్చు. తర్వాత మీ రుణాలు, చెల్లింపులను పరిశీలించాలి. సాంకేతిక సమస్యల వల్ల ఒక్కోసారి మన చెల్లింపులు క్రెడిట్‌ నివేదిక (Credit Report)లో కనిపించవు. వెంటనే బ్యాంకును సంప్రదించి ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ బ్యాంకులోనే అప్‌డేట్‌ కాకపోతే తగు చర్యలు తీసుకోవాలి. తర్వాత మీ వివరాలను కూడా ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. శాశ్వత ఖాతా సంఖ్య, పేరు, ఆధార్‌ సంఖ్య, పేరు, చిరునామా వంటి వివరాలను సరిచూసుకోవాలి. ఏమైనా మార్పులు ఉంటే చేయించుకోవాలి.

లోన్‌ (Loan) కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ బ్యాంకులు మీ క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)ను పరిశీలిస్తాయి. అలా ఎవరెవరు మీ స్కోర్‌ గురించి ఆరా తీశారో అది క్రెడిట్‌ నివేదికలో తెలిసిపోతుంది. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా స్కోర్‌ను తనిఖీ చేసినట్లు మీరు గమనిస్తే అది మీకు ఓ హెచ్చరిక. మీ వివరాలను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

తర్వాత క్రెడిట్‌ నివేదిక (Credit Report)లోని మీ రుణ బకాయిలకు సంబంధించిన వివరాలు, మీ సొంత రికార్డులతో సరిపోల్చుకోవాలి. ఏదైనా వ్యత్యాసం ఉంటే బ్యాంకును సంప్రదించి కారణం తెలుసుకోవాలి. ఒక్కోసారి రుణరేటు పెరగడం వల్ల వడ్డీ మొత్తం పెరగొచ్చు. లేదా ఏదైనా జరిమానా పడి ఉండొచ్చు.

తప్పులుంటే..

ముందుగా క్రెడిట్‌ బ్యూరోకు మీరు గమనించిన వ్యత్యాసాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. నివేదిక (Credit Report)ను సరిచేయాల్సిందిగా కోరవచ్చు. తప్పులు దొర్లినప్పుడు ఆయా వివరాలకు సంబంధించిన ఆధారాలను క్రెడిట్‌ బ్యూరోలకు అందిస్తే చాలా సందర్భాల్లో మార్పులు చేస్తాయి. కొన్నిసార్లు బ్యాంకు లేదా క్రెడిట్‌ కార్డు (Credit Card) సంస్థను సంప్రదించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు (Credit Card) బిల్లుల చెల్లింపు తదితర సమాచారాలను సరి చేయాలంటే.. బ్యాంకులకే సాధ్యం. మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే.. ఆయా క్రెడిట్‌ బ్యూరోల వెబ్‌సైటులోనే ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా ఈ వ్యత్యాసాలను సరిచేసేందుకు 30-45 రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ వ్యవధే పడుతుంది. క్రెడిట్‌ బ్యూరోలు చూపించిన పరిష్కారంతో మీరు సంతృప్తి  చెందకపోతే, మరోసారి ఫిర్యాదు చేయొచ్చు.

ఆధారాలతో బ్యాంకులను సంప్రదించినప్పుడు మీ వివరాలు సరైనవే అని తేలితే, వెంటనే వారు క్రెడిట్‌ బ్యూరోలకు సమాచారం ఇస్తారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతరుల గుర్తింపు ధ్రువీకరణలతో మోసగాళ్లు క్రెడిట్‌ కార్డు (Credit Card)లు, రుణాలు తీసుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. కాబట్టి, మనం అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. క్రెడిట్‌ నివేదికలో పొరపాట్లు దొర్లకుండా ఆపలేం. కానీ, వాటిని వీలైనంత త్వరగా సరిదిద్దుకోవడంలో మాత్రం ఆలస్యం చేయొద్దు.

ఇవీ చదవండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని