Credit Cards: క్రెడిట్‌ కార్డ్ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ గురించి తెలుసా?

క్రెడిట్‌ కార్డును ఉపయోగించి అనేక ఖర్చులు చేస్తుంటాం. క్రెడిట్‌ కార్డు బకాయిలను, రుణాలను మరో క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేయొచ్చని తెలుసా? ఆ వివరాలు ఇవీ..

Published : 18 Dec 2023 16:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రెడిట్‌ కార్డుల వినియోగం ఒకప్పటితో పోలిస్తే పెరిగింది. క్రెడిట్‌ కార్డు అనేది కొనుగోళ్లు, వివిధ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వారికి అనుకూలమైన సాధనం. కానీ, క్రెడిట్‌ కార్డుతో వ్యవహరించేటప్పుడు మంచి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మెరుగైన క్రెడిట్‌ స్కోరు పొందడానికి క్రెడిట్‌ ఖర్చులను ట్రాక్‌ చేయడం, బిల్లులను సరిగ్గా చెల్లించడం చాలా అవసరం. కానీ, ఈ కార్డులను ఉపయోగించి గడువులోగా బిల్లులు చెల్లించకుండా డిఫాల్ట్‌ అయినవారు ఉంటారు. వీరు క్రెడిట్‌ కార్డు బిల్లును గడువులోగా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బిల్లును వేరే క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు రుణ నిర్వహణలో బ్యాలెన్స్‌ బదిలీ ఒక రక్షణ ఆయుధంగా ఉంటుంది.

క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ

క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌. .పేరులో ఉన్నట్టుగానే బిల్లు బ్యాలెన్స్‌ను బదిలీ చేయడం. ఉదాహరణకు మీ వద్ద రెండు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయనుకుందాం. అందులో మొదటి క్రెడిట్‌ కార్డుపై బిల్లు బకాయి ఉంది. మీ దగ్గర చెల్లించడానికి నగదు లేదు. అప్పుడు మీ వద్ద ఉన్న మొదటి క్రెడిట్‌ కార్డులోని బిల్లు బ్యాలెన్స్‌ను రెండో క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేసి ఆ సమయానికి బిల్లు చెల్లించేయొచ్చు. దీన్నే క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ అంటారు. కొన్నిసార్లు, కార్డు వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డు రుణాలను ఒకేసారి చెల్లించలేకపోవచ్చు. ఈ పరిస్థితిలో వారు అన్ని క్రెడిట్‌ కార్డు ఖాతాల నుంచి బకాయి ఉన్న రుణాలను ఒకే ఖాతాలోకి ఏకీకృతం చేయొచ్చు. అనేక బ్యాంకులు క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. కార్డు జారీ సంస్థ ఈ సేవను అందిస్తేనే ఈ సదుపాయాన్ని పొందగలరు. అయితే బహుళ క్రెడిట్‌ కార్డులను కలిగి ఉన్నవారు ఈ అవకాశాన్ని సులభంగా వినియోగించుకోవచ్చు.

బ్యాలెన్స్‌ బదిలీ ఎలా చేయాలి?

క్రెడిట్‌ కార్డు వినియోగదారులు బ్యాలెన్స్‌ బదిలీ కోసం నెట్‌ బ్యాంకింగ్‌, ఆయా క్రెడిట్‌ కార్డుల కస్టమర్‌ కేర్‌ను సంప్రదించొచ్చు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాలెన్స్‌ బదిలీ అర్హత, కార్డులో క్రెడిట్‌ పరిమితి ఎక్కువగా ఉండడం. పరిమితి తక్కువగా ఉన్నట్లయితే మీ బకాయి మొత్తాన్ని బదిలీ చేయలేకపోవచ్చు. భారత్‌లోని చాలా ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులను ఒక క్రెడిట్‌ కార్డు నుంచి మరొక బ్యాంకు క్రెడిట్‌ కార్డుకు బ్యాలెన్స్‌ బదిలీ చేయడానికి అనుమతిస్తాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌, హెచ్‌ఎస్‌బీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు బ్యాలెన్స్‌ బదిలీని ఆమోదిస్తున్నాయి.

బ్యాలెన్స్‌ బదిలీ ప్రయోజనం

గడువులోగా క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించనప్పుడు డిఫాల్ట్ అంటారు. దీనివల్ల జరిమానా, వడ్డీ కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. క్రెడిట్‌ స్కోరుపై కూడా దీని ప్రభావం ఎక్కువే. కానీ, ఆ సమయంలో బ్యాలెన్స్‌ బదిలీ అవకాశాన్ని ఎంచుకుంటే ఈ పరిస్థితి నుంచి కొన్ని రోజుల పాటు గట్టెక్కొచ్చు. మొదటి కార్డు బిల్లు బ్యాలెన్స్‌ రెండో కార్డుకు బదిలీ అవుతుంది కాబట్టి, డబ్బులు కొన్ని రోజుల్లో సర్దుబాటు చేసి రెండో కార్డుపై బదిలీ అయిన అప్పును తీర్చేయొచ్చు. దీనివల్ల డిఫాల్ట్‌ అవ్వకుండా తాత్కాలికంగా బయటపడొచ్చు. మీరు క్రెడిట్‌ కార్డు బిల్లులను చెల్లించలేనప్పుడు క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ బదిలీ మీకు రక్షణగా ఉంటుంది. బకాయి చెల్లింపుల చరిత్ర, లావాదేవీ విధానాలు, ఖర్చులకు సంబంధించి మంచి చరిత్ర ఉంటే, మీరు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్‌ బదిలీకి అర్హులు అవుతారు.

రుసుములు, వడ్డీ

బ్యాలెన్స్‌ బదిలీ సేవలపై రుసుములు, వడ్డీ అమలవుతాయి. ఈ సేవలపై 1-5% వరకు ప్రాసెసింగ్‌ రుసుము ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ ఫీజు (రుసుము)ను కూడా వసూలు చేస్తాయి. నిర్దేశిత కాలానికి బ్యాలెన్స్ బదిలీపై వడ్డీ వర్తించదు. కానీ, నిర్దేశిత కాలపరిమితి దాటిన తర్వాత వడ్డీ రేటు సాధారణంగా నెలకు 1% నుంచి ప్రారంభమవుతుంది. బ్యాలెన్స్‌ బదిలీ దరఖాస్తును సమర్పించే ముందు బ్యాంకుతో అన్ని నిబంధనలు, వడ్డీ రేట్లు నిర్ధారించడం చాలా ముఖ్యం. ఇవి బ్యాంకును బట్టి మారతాయి.

ఎవరికి ప్రయోజనం?

తక్కువ సమయంలో రుణం లభించలేని పరిస్థితుల్లో ఉన్నవారు, ఇప్పటికే అధిక వడ్డీలతో రుణ భారం ఉన్న కార్డు వినియోగదారులు తమ బకాయిలను చెల్లించడానికి బ్యాలెన్స్‌ బదిలీని ఎంచుకోవచ్చు. బకాయి మొత్తాన్ని పరిమిత నెలల లోపు చెల్లించగలిగినప్పుడు ఈ బ్యాలెన్స్‌ బదిలీ అనువైనది.

ఇబ్బందులు

తరచుగా బ్యాలెన్స్‌ బదిలీ అవకాశాన్ని ఎంచుకుంటే క్రెడిట్‌ స్కోరు తగ్గే అవకాశం ఉంది. కొత్త క్రెడిట్‌ కార్డుల ఆమోదం కష్టమౌతుంది. బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి కొత్త క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తే, బ్యాంకు మీ క్రెడిట్‌ నివేదికపై కఠినమైన క్రెడిట్‌ విచారణను నిర్వహిస్తుంది. ప్రతి విచారణ మీ క్రెడిట్‌ స్కోరును కొన్ని పాయింట్లు తగ్గేలా చేస్తుంది.

బ్యాలెన్స్‌ బదిలీకి ప్రత్యామ్నాయాలు

బ్యాలెన్స్‌ బదిలీ మీకు రుణం నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. కానీ, అది ఒక్కటే సమాధానం కాదు. బ్యాలన్స్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యక్తిగత రుణాన్ని పరిశీలించొచ్చు. ఇందులో రుణం తీర్చే కాలవ్యవధి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వక్తిగత రుణం మీ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి (సీయూఆర్‌)ని ప్రభావితం చేయని రుణ చెల్లింపు ప్రణాళికను అందిస్తుంది. ఇంకా ఎక్కువ రుణం కావాలనుకునేవారు టాప్‌-అప్‌ హోమ్‌ లోన్‌కు ప్రయత్నించవచ్చు. వ్యక్తిగత రుణం కన్నా వడ్డీ ఇందులో తక్కువ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని