Tax Saving Investments: పన్ను ఆదా పెట్టుబడులను పూర్తి చేశారా? చివరి తేది సమీపిస్తోంది
పాత పన్ను విధానం ప్రకారం రిటర్నులను ఫైల్ చేసే పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా పెట్టుబడులు చేయడం ద్వారా పన్ను చెల్లించాల్సిన బాధ్యతను కొంత వరకు తగ్గించుకోవచ్చు.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాలి. అయితే, పాత పన్ను విధానం ప్రకారం రిటర్నులను ఫైల్ చేసే పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా పెట్టుబడులు చేయడం ద్వారా పన్ను చెల్లించాల్సిన బాధ్యతను కొంత వరకు తగ్గించుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులను ఇప్పటి వరకు పూర్తిచేయకపోతే వెంటనే దానిపై దృష్టి పెట్టండి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులను పూర్తి చేసేందుకు చివరి తేది 2023, మార్చి 31. ఈ తేది లోపు పూర్తి చేయకపోతే మీ వార్షిక ఆదాయాన్ని అనుసరించి పన్ను చెల్లించాల్సిన వస్తుంది.
ఆర్థిక సంవత్సరం 2020-21 నుంచి కొత్త పన్ను విధానం అందుబాటులోకి వచ్చింది. పన్ను చెల్లింపుదారులు పాత/కొత్త పన్ను విధానాలలో తమ అభీష్టానుసారం పన్ను రిటర్నులను ఫైల్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో పన్ను ఆదా పెట్టుబడుల ద్వారా మినహాయింపు పొందే వీలులేదు. అందువల్ల పన్ను ఆదా పెట్టుబడులు చేసే వారికి మాత్రం పాత పన్ను విధానమే అనుకూలంగా ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానాల్లో చెల్లించాల్సిన పన్ను బాధ్యతను లెక్కించి అనుకూలమైన పన్ను విధానంలో రిటర్నులను ఫైల్ చేయవచ్చు.
పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ), ప్రయాణ భత్యం(ఎల్‌టీసీ), ఆదాయపు పన్ను వివిధ సెక్షన్‌ల కింద పన్ను ఆదా చేసేందుకు అర్హలు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షలు, సెక్షన్ 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై, సెక్షన్ 80ఈ కింద విద్యా రుణం వడ్డీ చెల్లింపులపై..ఇలా మినహాయింపులు పొందొచ్చు.
పన్ను ఆదా పెట్టుబడులు చేస్తే..
ఉదాహరణకు, మీ జీతం రూ. 12 లక్షలు అనుకుందాం.
- సెక్షన్ 80సి కింద(ఈపీఎఫ్+పీపీఎఫ్+ఎస్‌ఎస్‌వై+ఎన్‌పీఎస్) కింద రూ.1,50,000, సెక్షన్ 80సీసీడి(1బి) (ఎన్‌పీఎస్ అదనపు పెట్టుబడులు) కింద రూ.50,000, సెక్షన్ 80డి(ఆరోగ్య బీమా ప్రీమియం) రూ.25,000.
- వార్షిక జీతం రూ.12,00,000- రూ.50,000(స్టాండర్డ్ డిడక్షన్) - రూ.2,25,000(పన్ను ఆదా పెట్టుబడులు)= రూ.9,25,000
- రూ.2,50,000 వరకు పన్ను వర్తించదు.
- రూ.2,50,000 నుంచి రూ. 5,00,000 పన్ను 5%..అంటే ((5,00,000-2,50,000)×5%) = రూ.12,500
- రూ.5,00,000 నుంచి రూ.9,25,000 పన్ను 20%..అంటే ((9,25,000-5,00,000)×20%) = రూ.85,000.
- మొత్తం పన్ను = రూ.12,500+ రూ.85,000= రూ.97,500
ఒక వేళ పన్ను ఆదా పెట్టుబడులు చేయకపోతే..
- వార్షిక జీతం రూ.12,00,000- రూ.50,000(స్టాండర్డ్ డిడక్షన్) = రూ.11,50,000
- రూ.2,50,000 వరకు పన్ను వర్తించదు.
- రూ.2,50,000 నుంచి రూ.5,00,000 పన్ను 5%..అంటే ((5,00,000-2,50,000)×5%) = రూ.12,500
- రూ.5,00,000 నుంచి రూ.10,00,000 పన్ను 20%..అంటే ((10,00,000-5,00,000)×20%) = రూ.1,00,000.
- రూ.10,00,000 నుంచి రూ.11,50,000 పన్ను 30%..అంటే ((11,50,000-10,00,000)×30%) = రూ.45,000
- మొత్తం పన్ను = రూ. 12,500+రూ. 1,00,000+రూ.45,000 = రూ.1,57,500
- అంటే, పన్ను ఆదా పెట్టుబడులు పెట్టడం వల్ల రూ.60,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
కొత్త పన్ను విధానం ఎంచుకుంటే..
- వార్షిక ఆదాయం రూ.12,00,000
- రూ.2,50,000 వరకు పన్ను వర్తించదు.
- రూ.2,50,000 నుంచి రూ.5,00,000 పన్ను 5%..అంటే ((5,00,000-2,50,000)×5%)= రూ.12,500
- రూ.5,00,000 నుంచి రూ.7,50,000 పన్ను 15%..అంటే ((7,50,000-5,00,000)×15%) = రూ.37,500.
- రూ.7,50,000 నుంచి రూ. 10,00,000 పన్ను 20%..అంటే ((10,00,000-7,50,000)×20%)= రూ.50,000.
- రూ.10,00,000 నుంచి రూ. 12,00,000 పన్ను 25%..అంటే ((12,00,000-10,00,000)×25%)= రూ. 50,000.
- మొత్తం పన్ను = రూ.12,500+ రూ.37,500+ రూ.50,000+ రూ.50,000= రూ.1,50,000
- కొత్త పన్ను విధానం ద్వారా చెల్లించే పన్నుకు, పన్ను ఆదా పెట్టుబడుల తర్వాత పాత పన్ను విధానం ద్వారా చెల్లించే పన్నుకు రూ.52,500 వ్యత్యాసం కనిపిస్తుంది.
ఒకవేళ మీరు గృహ రుణం తీసుకుని ఉంటే అసలు చెల్లింపులపై సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు వడ్డీ చెల్లింపుల ద్వారా సెక్షన్ 24బి కింద మరో రూ.2 లక్షల మినహాయింపు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు అయిన తల్లిదండ్రులు ఉన్నవారు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై మరో రూ.50 వేల వరకు కూడా మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు.
చివరిగా..
పన్ను చెల్లింపుదారులు..నిర్ణీత పెట్టుబడిని ఎంచుకునే ముందు పెట్టుబడుల లక్ష్యంతో పాటు పన్ను సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలాగని పన్ను ఆదా కోసం మాత్రమే పెట్టుబడులు చేయడం మంచిది కాదు. పన్ను ఆదా పెట్టుబడులకు లాక్-ఇన్ పిరియడ్ ఉండొచ్చు. చివరి వరకు కొనసాగిస్తేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. అందువల్ల మీ లక్ష్యానికి ఉన్న కాలవ్యవధిని అనుసరించి పెట్టుబడులు చేయడమూ ముఖ్యమే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : స్టాక్ మార్కెట్ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
Politics News
Cm Kcr: రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్
-
Movies News
Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: సూర్య కుమార్ యాదవ్‌కు రోహిత్ మద్దతు
-
India News
Karnataka: టిప్పు సుల్తాన్‌పై రగులుకొన్న రాజకీయం