ICICI Bank loan case: బాంబే హైకోర్టులో కొచ్చర్‌ దంపతులకు దక్కని ఊరట

ICICI Bank loan case: సీబీఐ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ చందాకొచ్చర్‌ దంపతులు దాఖలు చేసిన అత్యవసర విచారణ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.

Published : 27 Dec 2022 13:57 IST

దిల్లీ: వీడియోకాన్‌ (Videocon )రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ (ICICI bank) మాజీ సీఈఓ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టులో నిరాశ ఎదురైంది. సీబీఐ (CBI) అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అత్యవసర విచారణ జరపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. జనవరి 2న సాధారణ విచారణ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం కేసులో చందాకొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ ఈ నెల 23న అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరికి ప్రత్యేక కోర్టు మూడు రోజుల రిమాండ్‌ విధించింది. అదనపు గడువు కోరుతూ సీబీఐ అప్పీల్‌ చేసింది. దీంతో కొచ్చర్‌ దంపతులకు 28 వరకు రిమాండ్‌ పొడిగించింది. అయితే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సీబీఐ అరెస్ట్‌ అక్రమమని పేర్కొంటూ చందా కొచ్చర్‌ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. 

మరోవైపు ఈ కేసులో వీడియోకాన్‌ గ్రూపు వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌ను సైతం సీబీఐ సోమవారం అరెస్ట్‌ చేసింది. ఉదయం కొంతసేపు విచారించాక, ముంబయిలో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. కొచ్చర్‌ దంపతులతో పాటు వేణుగోపాల్‌ ధూత్‌ను డిసెంబరు 28 వరకు సీబీఐ కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. బ్యాంక్‌ రుణ విధానానికి విరుద్ధంగా, ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి ధూత్‌ ప్రమోట్‌ చేసిన వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు రూ.3,250 కోట్ల రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ మంజూరు చేసిందన్నది సీబీఐ ఆరోపణ. ‘నీకిది-నాకది’లో భాగంగా దీపక్‌ కొచ్చర్‌ సంస్థల్లో రూ.64 కోట్లను ధూత్‌ పెట్టుబడులు పెట్టారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని