Maruti Suzuki: ఎర్రసముద్రం అలజడితో వ్యయాలు పెరగొచ్చు: మారుతీ సుజుకీ

Maruti Suzuki: ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీల దాడుల వల్ల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది.

Published : 11 Feb 2024 12:55 IST

దిల్లీ: ఎర్ర సముద్రంలో సంక్షోభం నేపథ్యంలో తమ కంపెనీకి వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ (Maruti Suzuki) తెలిపింది. అయితే, విదేశాలకు చేసే వాహన ఎగుమతులపై మాత్రం పెద్ద ప్రభావం ఉండదని పేర్కొంది. క్రితం ఏడాది కంపెనీ 2.7 లక్షల కార్లను ఎగుమతి చేసింది. ఈ దశాబ్దం చివరకు 7.5 లక్షల కార్లను ఎగుమతి చేయాలని గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది.

‘‘ఎర్ర సముద్రంలో అలజడి వల్ల కొన్ని లాజిస్టిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. రవాణా మార్గాలను మార్చాల్సి వస్తోంది. అయితే, ఎగుమతి-దిగుమతి వ్యాపారంలో ఇది సాధారణం. నౌకల రాకలో అనిశ్చితి వల్ల కార్ల సరఫరా ఆలస్యమవ్వొచ్చు. ఆఫ్రికా విపణిలో మాకు అవకాశాలు మెరుగవుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఇటీవల పశ్చిమాసియాలోనూ మా అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రభుత్వం వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. దీని వల్ల మాకు సుంకాలపరంగా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది’’ అని మారుతీ సుజుకీ (Maruti Suzuki) కార్పొరేట్‌ వ్యవహారాల కార్యనిర్వహక అధికారి రాహుల్‌ భారతీ తెలిపారు.

ఈ ఏడాదే బ్యాటరీ ఆధారిత వాహనాల తయారీని ప్రారంభించనున్నట్లు రాహుల్‌ వెల్లడించారు. ఈ విభాగంలో రానున్న తొలి మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీని దేశీయ విపణితో పాటు ఐరోపా, జపాన్‌ మార్కెట్లకు ఎగుమతి చేస్తామని చెప్పారు. దాని పరిమాణం గ్రాండ్‌ విటారా కంటే పెద్దగా ఉంటుందని వెల్లడించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పారు. దీన్ని కస్టమర్లు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై యెమెన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన ఈ ప్రాంతంలో తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా అనేక నౌకలు తమ మార్గాన్ని మార్చుకుంటున్నాయి. ఫలితంగా రవాణా వ్యయం భారీగా పెరుగుతోంది.

ఆడీ సైతం ఆందోళన..

జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడీ (Audi) సైతం ఎర్ర సముద్రంలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాల వల్ల భారత్‌లో కార్ల డెలివరీలు ఆలస్యమవుతున్నాయని పేర్కొంది. అయితే, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు విద్యుత్‌ కార్లను భారత్‌లో అసెంబుల్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆడీ ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని