ITR Filing: ఐటీ రిట‌ర్నులు గడువులోగా ఎందుకు ఫైల్ చేయాలి?

పన్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు చివ‌రి నిమిషం వ‌ర‌కు వేచి ఉండొద్ద‌ని ఆదాయపు పన్ను శాఖ ప‌న్ను చెల్లింపుదారుల‌ను కోరింది. ఈ మేర‌కు త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ విడుద‌ల చేసింది.

Published : 18 Jul 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పన్ను రిట‌ర్నులు (ITR Filing) దాఖ‌లు చేసేందుకు చివ‌రి నిమిషం వ‌ర‌కు వేచి ఉండొద్ద‌ని ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ చెప్పే మాట. తాజాగా ట్విటర్‌ వేదికగా పన్ను చెల్లింపుదారులకు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మదింపు సంవ‌త్స‌రం 2022-23కి సంబంధించి రిట‌ర్నుల దాఖ‌లు గ‌డువు ఈ నెలాఖ‌రుతో (2022 జులై 31) ముగియ‌నుంది. అందువ‌ల్ల ప‌న్ను చెల్లింపుదారులు వెంటనే ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాలని ఐటీ శాఖ సూచించింది. అయితే, చివ‌రి తేదీ వరకు వేచి చూడకుండా సత్వరమే రిటర్నులు దాఖలు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం...

‘ట్రాఫిక్‌’లో చిక్కుకోకుండా: గ‌తేడాది జూన్‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ ప్రారంభించింది. అప్ప‌టి నుంచి ప‌న్ను చెల్లింపుదారులు రిట‌ర్నులు, ఇత‌ర అవ‌స‌రాల‌కు ఈ-పోర్ట‌ల్ వినియోగిస్తున్నారు. అయితే, ఈ ఏడాది కాలంలో పోర్ట‌ల్‌లో అనేక సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం చూశాం. వాటన్నింటిని ఐటీ శాఖ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తూనే ఉంది. అయితే, రిట‌ర్నుల దాఖ‌లుకు చివ‌రి వ‌ర‌కు వేచి ఉండడం వ‌ల్ల చివరి రోజుల్లో వెబ్‌సైట్‌కి వ‌చ్చే ట్రాఫిక్ ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తి రిట‌ర్నుల ప్ర‌క్రియ పూర్తిచేసేందుకు ఆల‌స్యం కావ‌చ్చు. అందువ‌ల్ల ముందుగానే ఫైల్ చేయ‌డం మంచిది.

త‌ప్పులు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు: చివ‌రి నిమిషంలో హాడావిడిగా రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం వ‌ల్ల త‌ప్పులు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. ఈ కార‌ణంతో ఒక్కోసారి ఐటీ శాఖ మీ రిట‌ర్నుల‌ను తిర‌స్క‌రించ‌వ‌చ్చు. ఐటీఆర్ ఫారంను త‌ప్పుగా ఎంచుకోవ‌డం, మ‌దింపు సంవ‌త్స‌రం ఎంపిక‌లో పొర‌పాటు చేయ‌టం, పేరు, పుట్టిన తేదీ, పాన్‌, బ్యాంకు ఖాతా వివ‌రాలు త‌ప్పుగా న‌మోదు చేయ‌డం, ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయాన్ని త‌ప్పుగా లెక్కించ‌డం, ఆదాయాన్ని త‌ప్పుగా పేర్కొనడం, ఇత‌ర మార్గాల నుంచి వ‌చ్చిన ఆదాయాన్ని తెలుప‌క‌పోవ‌డం, పెట్టుబ‌డుల గురించిన అన్ని వివ‌రాల‌ను ఇవ్వడంలో విఫ‌లం అవ్వడం వంటివి ప‌న్ను చెల్లింపుదారులు సాధార‌ణంగా చేసే కొన్ని త‌ప్పులు.

చివ‌రి నిమిషంలో హడావుడి ప‌డ‌కుండా ముందుగానే పైలింగ్‌కి కావాల్సిన అన్ని ప‌త్రాలూ సిద్ధం చేసుకుని, ముందుగా పూరించిన‌ ఐటీ ఫారంలోని వివ‌రాల‌ను త‌నిఖీ చేసుకుని, పొరపాట్లు ఉంటే స‌రిదిద్దుకోవ‌చ్చు. ఒక‌వేళ ఐటీ రిట‌ర్నులు స‌మ‌ర్పించిన త‌ర్వాత ఏదైనా పొర‌పాట్లు (ప‌న్ను బాధ్య‌త‌ను తెలియ‌జేయ‌డంలో గానీ, స్థూల ఆదాయాన్ని లెక్కించ‌డంలో గానీ, త‌గ్గింపుల విష‌యంలో గానీ, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ఇవ్వ‌డంలో గానీ..) చేసిన‌ట్లు గుర్తిస్తే.. స‌రిదిద్దుకునేందుకు అభ్యర్థనను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమర్పించవచ్చు. సెక్ష‌న్ 143 (1), సెక్ష‌న్ 154 కింద సీపీసీ (సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌) లేదా అసెసింగ్ అధికారికి ఇవ్వ‌చ్చు. సీపీసీ ద్వారా ఇప్ప‌టికే ప్రాసెస్ అయిన రిట‌ర్నుల కోసం మాత్ర‌మే రెక్టిఫికేష‌న్ రిక్వెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.

పెనాల్టీల నుంచి దూరంగా: గ‌డువులోపు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌క‌పోతే పెనాల్టీ పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ఏం చెబుతుందంటే.. సెక్షన్ 139 కింద ఒక వ్యక్తి ఆదాయపు రిటర్నుల‌ను సమర్పించాల్సిన అవసరం ఉన్నట్లయితే, సబ్-సెక్షన్ (1)లో నిర్దేశించిన సమయంలోగా రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి. లేదంటే ఆల‌స్య‌ రుసుము చెల్లించాలి. డిసెంబ‌రు 31లోపు దాఖ‌లు చేసేవారు రూ.5 వేల పెనాల్టీ, ఆ త‌ర్వాత అయితే రూ.10 వేల పెనాల్టీ చెల్లించాలి.

న‌ష్టాల‌ను స‌ర్దుబాటు చేసేందుకు: ఆదాయపు పన్ను రిట‌ర్నుల‌ను సకాలంలో ఫైల్ చేయ‌డం వ‌ల్ల న‌ష్టాల‌ను తదుపరి సంవత్సరాలకు స‌ర్దుబాటు చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. నష్టాలను రెండు రకాలుగా సర్దుబాటు చేసుకోవ‌చ్చు.

  • మొద‌టిది.. ఐటీ చట్టం ప్రకారం, ఏదైనా ఆర్థిక‌ సంవత్సరంలో పన్ను చెల్లింపుదారునికి నిర్దిష్ట హెడ్ కింద‌కి వ‌చ్చే మూలం నుంచి న‌ష్టం వ‌చ్చిన‌ట్ల‌యితే, అతడు/ఆమె అదే హెడ్ కిందకు వచ్చే ఇతర మూలాల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ న‌ష్టాన్ని సర్దుబాటు చేసుకునేందుకు అనుమ‌తిస్తారు. ఈ ప్రక్రియను ఇంట్రా-హెడ్ సర్దుబాటు అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు వ్యాపారం B నుంచి వ‌చ్చిన‌ లాభాన్ని వ్యాపారం A లో వ‌చ్చిన‌ నష్టంతో సర్దుబాటు చేయడం.
  • రెండోది.. ఏదైనా ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌న్ను చెల్లింపుదారుడు ఒక ఆదాయ హెడ్ కింద న‌ష్టాన్ని.. మ‌రొక హెడ్ కింద ఆదాయాన్ని పొందిన‌ట్ల‌యితే.. అత‌డు/ఆమె ఒక హెడ్ కింద వ‌చ్చిన న‌ష్టాన్ని మ‌రొక హెడ్ కింద‌కి వ‌చ్చే లాభంతో స‌ర్దుబాటు చేయ‌వ‌చ్చు. దీన్ని ఇంటర్-హెడ్ సర్దుబాటు అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఇంటి ఆస్తి నుంచి వ‌చ్చిన న‌ష్టాన్ని జీతం ఆదాయంతో స‌ర్దుబాటు చేయ‌డం. అయితే సెక్ష‌న్ 139(1) ప్ర‌కారం నిర్దేశించిన గ‌డువులోపు ఐటీఆర్ ఫైల్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే ఈ ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది.

టీడీఎస్ క్లెయిమ్ చేసేందుకు: జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వారు, ఇత‌ర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారికి టీడీఎస్ (మూలం వ‌ద్ద ప‌న్ను) డిడ‌క్ష‌న్‌ స‌ర్వ‌సాధార‌ణంగా ఉంటుంది. అయితే, ఐటీఆర్ ఫైల్ చేయ‌డం వ‌ల్ల‌.. త‌గ్గించిన టీడీఎస్‌ను వాప‌సు పొందొచ్చు. ప‌న్ను చెల్లింపుదారులు, వివిధ మార్గాల నుంచే త‌మ‌కు వ‌చ్చే ఆదాయ‌న్ని, ప‌న్ను బాధ్య‌త‌ను లెక్కించి.. దాని నుంచి ఇప్ప‌టికే త‌గ్గించిన టీడీఎస్‌ను తీసివేయాలి. ఒక‌వేళ చెల్లించాల్సిన ప‌న్ను బాధ్య‌త కంటే చెల్లించిన టీడీఎస్ ఎక్కువ‌గా ఉంటే.. అద‌న‌పు మొత్తాన్ని తిరిగి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. జీతం ద్వారా ఆదాయం పొందే వ్య‌క్తులు టీడీఎస్ కోసం ఫారం 16ని స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు ప‌నిచేసే సంస్థ నుంచి పొందొచ్చు. స‌మ‌యానికి ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం ద్వారా మీరు టీడీఎస్ రీఫండ్‌ను నెల‌రోజుల్లో బ్యాంకు ఖాతాలో పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని