Financial Planning: సంపాదించే యువ‌త తెలుసుకోవాల్సిన ఆర్థిక విష‌యాలు!

యువ‌త ముఖ్యంగా ఈ పోటీ ప్ర‌పంచంలో అభివృద్ధి చెంద‌డానికి వారి ఆర్ధిక స్థితిని వారే ప‌ర్య‌వేక్షించుకోవాలి.

Updated : 27 Jul 2022 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త్‌లోని యువ‌త సాధార‌ణంగా త‌మ సంపాద‌న మొదలయ్యేంత వ‌ర‌కు పెద్ద‌ల మీద ఆధార‌ప‌డ‌తారు. సంపాద‌న మొద‌లయ్యాక కూడా కొంత కాలం పాటు ఖ‌ర్చులు, మ‌దుపుల విష‌యంలో అనిశ్చితితో ఉంటారు. యువ‌త‌గా ఉన్న‌ప్పుడే వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక గురించి స‌రైన అవ‌గాహ‌న ఉంటే భ‌విష్య‌త్‌లో చాలా నిశ్చింత‌గా ఉండొచ్చు. ఇందుకోసం ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వ్య‌క్తిగ‌త ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను నియంత్రించ‌డానికి అనుస‌రించాల్సిన కొన్ని ఆర్థిక నియ‌మాలు తెలుసుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వ్య‌క్తిగ‌త ఆర్థిక  వ్య‌వ‌హారాల‌ను నియంత్రించుకోవ‌డానికి అనుస‌రించాల్సిన, తెలుసుకోవాల్సిన‌ కొన్ని ఆర్థిక విష‌యాలు, నియ‌మాలు ఇక్క‌డ ఉన్నాయి..

రెట్టింపు ఆదాయానికి ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంది?
మీ పెట్టుబడి రెట్టింపు చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన కాల వ్య‌వ‌ధిని తెలుసుకోవ‌డానికి 72 నియ‌మాన్ని ఉప‌యోగించండి. మీకు ల‌భించే వార్షిక వ‌డ్డీ రేటుతో 72 సంఖ్య‌ను భాగించాలి. ఉదా: 8% వ‌డ్డీతో మీ డ‌బ్బును రెట్టింపు చేయ‌డానికి మీరు 72ని 8తో భాగిస్తే 9 వ‌స్తుంది. అంటే, 9 సంవ‌త్స‌రాల‌లో సొమ్ము రెట్టింపు అవుతుంది. అదే 6% వ‌డ్డీ రేటు అయితే 12 సంవ‌త్స‌రాలు, 9% వ‌డ్డీ రేటు అయితే 8 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. మీ సంపాద‌న‌తో భ‌విష్య‌త్తులో రాబ‌డి, ఖ‌ర్చులు అంచ‌నా వేసుకోవ‌డానికి ఈ లెక్క‌లు మీకు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

త‌రుగుద‌ల రేటును ఇలా తెలుసుకోవచ్చు: మీ ఆదాయాలు, పెట్టుబ‌డుల‌లో త‌రుగుద‌ల రేటు తెలుసుకోవ‌డానికి 70 నియ‌మాన్ని ఉప‌యోగించండి. వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భ‌విష్య‌త్‌ ఆదాయాల‌ను తెలుసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. మీ పెట్టుబ‌డి త‌రుగుద‌ల విలువ‌ని తెలుసుకోవాలి. త‌ద్వారా ఈ పెట్టుబ‌డి లాభ‌దాయ‌కంగా ఉందా లేదా అని మీరే నిర్ణ‌యించుకోవ‌చ్చు. మీరు ప్ర‌స్తుత ద్ర‌వ్యోల్బ‌ణ రేటుతో 70 సంఖ్య‌ని భాగించాలి. ఉదాహ‌ర‌ణ‌కు, ద్ర‌వ్యోల్బ‌ణ రేటు 7% అనుకుందాం. అప్పుడు 70ని 7తో భాగిస్తే 10 వ‌స్తుంది. అంటే 10 సంవ‌త్స‌రాల‌ తరువాత డబ్బు విలువ ఇప్పటికి సగం అవుతుంది.

మ‌దుపు.. దేనిలో ఎంత?: మీ ఆదాయ‌న్ని మ‌దుపు చేసేట‌ప్పుడు ఉజ్జాయింపుగా 50% స్థిర ఆదాయ పెట్టుబ‌డుల‌కు, 50% ఈక్విటీల్లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. మీ వ‌య‌స్సు, ఆరోగ్యం త‌ట్టుకునే కాలంలోనే ఉంటుంది కాబ‌ట్టి ఈక్విటీల్లో కూడా పెట్టుబ‌డులు పెట్టొచ్చు. దీనికి ఇంకో లెక్క కూడా ఉంది..100 సంఖ్య‌తో మీ వ‌య‌స్సుని తీసివేయాలి. వ‌చ్చిన సంఖ్యను బ‌ట్టి ఈక్విటీ పెట్టుబ‌డులు క‌లిగి ఉండొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు, మీ వ‌య‌స్సు 30 అయితే 100-30 = 70 వ‌స్తుంది. అంటే మీ మ‌దుపులో 70% దాకా ఈక్విటీలో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. అయితే, వ‌య‌స్సు పెరిగే కొద్దీ  ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను నెమ్మ‌దిగా త‌గ్గించుకోవాలి.

అత్య‌వ‌స‌ర నిధి: భ‌విష్య‌త్‌లో ఉపాధి కోల్పోవ‌డం, చిన్న వైద్య‌ప‌ర‌మైన ఖ‌ర్చులు, ముందుగా ఊహించ‌ని ఖ‌ర్చులు రావచ్చు. వీటికి 6 నెల‌ల ఆదాయానికి స‌రిప‌డా మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిలో మ‌దుపు చేయాలి.

ఈఎంఐలు: వ్య‌క్తులు త‌మ ఆదాయంలో 33% ఈఎంఐల‌కు చెల్లించే ప‌రిమితిని ఎప్పుడూ దాట‌కూడ‌దు. ఒక వ్య‌క్తి నెల‌కు రూ.30 వేలు సంపాదిస్తే, రూ.10 వేల కంటే ఎక్కువ ఈఎంఐలు ఉండ‌కూడ‌దు. ఇది రుణాల‌ను మంజూరు చేయ‌డానికి ఆర్థిక సంస్థ‌లు అనుస‌రించే సాధార‌ణ నియమం. కానీ వ్య‌క్తులు కూడా తమ ఆర్థిక నిర్వహణకు దీన్ని ఉపయోగించ్చవచ్చు.

జీవిత బీమా, ఆరోగ్య బీమా: వ్య‌క్తిగ‌త ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో జీవిత బీమా, ఆరోగ్య బీమా చాలా ప్ర‌ధాన‌మైన‌వి. మీ వార్షిక ఆదాయానికి 10-12 రెట్లు ఉండేలా చూసుకోవ‌డం మంచిది. ఉదా: మీ వార్షిక ఆదాయం రూ. 10 ల‌క్ష‌ల‌యితే మీరు రూ. 1.20 కోట్ల విలువ గల టర్మ్ బీమా క‌లిగి ఉండాలి. ఆరోగ్య బీమా అయితే మీ ఒక సంవ‌త్స‌ర‌పు ఆదాయానికి సమానంగా ఉండాలి.

చివ‌రిగా: పై నియ‌మాలు అన్ని ఆర్థిక ప్ర‌ణాళిక‌లో చాలా ముఖ్య‌మే గానీ, మీ ఆదాయంలో హెచ్చు, త‌గ్గుల‌ను బ‌ట్టి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో మార్పులు, చేర్పులు చేసుకోవ‌చ్చు. త‌గిన ఆర్థిక ప్ర‌ణాళిక‌ను మీరు సిద్ధం చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని