Ford: ఎండీవర్‌తో భారత్‌లోకి ఫోర్డ్ రీఎంట్రీ..!

ఫోర్డ్‌ సంస్థ భారత్‌లో కార్ల ఉత్పత్తిని పునఃప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రీఎంట్రీలో భాగంగా ఎండీవర్‌ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

Published : 26 Jan 2024 13:31 IST

చైన్నై: అమెరికన్‌ ఆటోమొబైల్‌ సంస్థ ఫోర్డ్‌ మోటార్‌ (Ford Motor) భారత్‌లో వాహనాల తయారీని తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. కంపెనీ రెండేళ్ల క్రితం భారత్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. అనంతరం చెన్నై సమీపంలోని మారైమలై నగర్‌లో ఉన్న ప్లాంట్‌ను విక్రయించేందుకు పలు సంస్థలతో చర్చలు జరిపింది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ప్లాంట్‌ను అమ్మేకంటే.. అందులో ఉత్పత్తిని పునః ప్రారంభించడం మేలని కంపెనీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో ఎస్‌యూవీ కార్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. రీఎంట్రీలో భాగంగా ఫోర్డ్‌ ప్రీమియం ఎస్‌యూవీ మోడల్‌ ఎండీవర్‌ (Ford Endeavour)ను తిరిగి మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోందట. గతేడాది అంతర్జాతీయ మార్కెట్‌ కోసం చెన్నై ప్లాంట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయాలన్న ప్రణాళికను కంపెనీ విరమించుకుంది. తాజాగా ఫోర్డ్‌ సీవోవోగా భారత్‌కు చెందిన కుమార్‌ గల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కంపెనీ దేశీయంగా పునరాగమనం చేయనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

భారత ఈ-కామర్స్‌లో 48% మార్కెట్‌ వాటాతో ఫ్లిప్‌కార్ట్‌ ముందంజ!

ఫోర్డ్‌ కంపెనీ 1996లో ఎస్కార్ట్‌ కారుతో భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. తర్వాత ఐకాన్‌, ఫిగో, ఎకోస్పోర్ట్‌, ఎండీవర్‌ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సంస్థకు తమిళనాడు, గుజరాత్‌లలో తయారీ యూనిట్లు ఉన్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌కు ఇక్కడి నుంచి కార్లను ఎగుమతి చేసేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని