దమానీ నిర్వహణలోకి ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్‌

ఇటీవలే పరమపదించిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తరచూ డిమార్ట్‌ అధినేత  రాధాకిషన్‌ దమానీని తన ‘గురువు’గా పేర్కొనేవారు. ఇపుడా గురువు నిర్వహణలోకి శిష్యుడి ట్రస్ట్‌ బాధ్యతలు వెళుతున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఇతర ట్రస్టీలుగా ఝున్‌ఝున్‌వాలా సన్నిహితులైన కల్పరాజ్‌

Updated : 23 Aug 2022 07:36 IST

కంపెనీ బాధ్యతలు భార్య, సోదరుడికి?

ముందే విల్లు సిద్ధం చేసిన రాకేశ్‌

టీవలే పరమపదించిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తరచూ డిమార్ట్‌ అధినేత  రాధాకిషన్‌ దమానీని తన ‘గురువు’గా పేర్కొనేవారు. ఇపుడా గురువు నిర్వహణలోకి శిష్యుడి ట్రస్ట్‌ బాధ్యతలు వెళుతున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఇతర ట్రస్టీలుగా ఝున్‌ఝున్‌వాలా సన్నిహితులైన కల్పరాజ్‌ ధరమ్షి, అమల్‌ పారీఖ్‌ ఉంటారని తెలిపింది.  రాకేశ్‌కు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మాత్రం ఆయనకు విశ్వసనీయులైన ఉత్పల్‌ సేథ్‌, అమిత్‌ గోయెలా నిర్వహణలోనే కొనసాగుతుంది. గత 8 నెలలుగా ఆరోగ్యం బాగోలేనందున.. ముందుగానే విల్లును రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సిద్ధం చేసినట్లు పేర్కొంది.

అత్యంత సన్నిహితులు వీరు: గత కొన్నేళ్లుగా రాకేశ్‌కు ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల విషయంలో ఉత్పల్‌ సేథ్‌ సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక అమిత్‌ విషయానికొస్తే ట్రేడింగ్‌ విషయంలోనూ; కంపెనీకి చెందిన ట్రేడింగ్‌ పుస్తక నిర్వహణలోనూ కీలకంగా వ్యవహరిస్తుంటారు. అమిత్‌ను ఝున్‌ఝున్‌వాలాకు కుడిభుజంగా పేర్కొంటుంటారు. ఆగస్టు 14న రాకేశ్‌ మరణించినందున, నమోదిత, నమోదు కాని కంపెనీల్లో ఆయనకు చెందిన వాటాల్లో ఎక్కువ భాగం ఆయన భార్య రేఖ, ముగ్గురు పిల్లలకు వెళ్లనున్నాయి. జే సాగర్‌ అసోసియేట్స్‌కు చెందిన మాజీ మేనేజింగ్‌ పార్టనర్‌ బెర్జిస్‌ దేశాయ్‌ ఇందుకు సంబంధించిన విల్లు పనులను చూస్తున్నట్లు తెలుస్తోంది. ‘భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా కూడా వ్యాపార కుటుంబం నుంచే రావడం వల్ల ఆర్థిక అంశాలను బాగా అర్థం చేసుకుంటారు. ఆమె, రాకేశ్‌ సోదరుడు వారి కంపెనీ నిర్వహణలో కీలక పాత్ర పోషించొచ్చ’ని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  

షేర్ల విలువ రూ.30,000 కోట్లకు పైనే

ప్రస్తుత ధరల్లో ఝున్‌ఝున్‌వాలా షేర్ల విలువ రూ.30,000 కోట్ల వరకు ఉండొచ్చు. అధిక భాగం టైటన్‌(రూ.10,946 కోట్లు), స్టార్‌ హెల్త్‌(రూ.7056 కోట్లు), మెట్రో బ్రాండ్స్‌(రూ.3166 కోట్లు), టాటా మోటార్స్‌(రూ.1707 కోట్లు), క్రిసిల్‌(రూ.1308 కోట్లు)లలో ఉన్నాయి. 1986లో రూ.5,000తో మార్కెట్లలో అడుగుపెట్టి 2022 నాటికి 5 బిలియన్‌ డాలర్లకు పైగా.. అంటే 36 ఏళ్లలో ఏటా 55 శాతం సమ్మిళిత వృద్ధి రేటుతో సంపదను పెంచుకుని, స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే ఝున్‌ఝున్‌వాలా అద్భుత విజయాన్ని లిఖించారు. ట్రస్టీగా మారనున్న దమానీ సైతం తన రిటైల్‌ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌(డిమార్ట్‌) నమోదుతో చరిత్ర సృష్టించారు. ఆ కంపెనీలోని తన వాటాతో కలిపి దమానీ సంపద విలువ రూ.1,80,000 కోట్ల పైమాటే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని