సంక్షిప్త వార్తలు

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ తమ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ ధరల్ని బుధవారం వెల్లడించింది. వీటి ధరల శ్రేణి రూ.10.48-18.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). 1.5 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌ మేటెడ్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ సాంకేతికతతో రూపొందిన కార్లు

Updated : 29 Sep 2022 03:25 IST

టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌
ధరల శ్రేణి రూ.10.48-18.99 లక్షలు

దిల్లీ: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ తమ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ ధరల్ని బుధవారం వెల్లడించింది. వీటి ధరల శ్రేణి రూ.10.48-18.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). 1.5 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌ మేటెడ్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ సాంకేతికతతో రూపొందిన కార్లు రూ.10.48-17.09 లక్షల మధ్య ఉండగా, ఆల్‌-వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ ధర రూ.17.19 లక్షలుగా ఉంది. బలమైన సెల్ఫ్‌-ఛార్జింగ్‌ హైబ్రిడ్‌ సాంకేతికతతో తయారైన 3 ట్రిమ్‌లు రూ.15.11 లక్షలు, రూ.17.49 లక్షలు, రూ.18.99 లక్షలుగా ఉన్నాయి. బలమైన హైబ్రిడ్‌ ట్రిమ్‌లు లీటర్‌కు 27.97 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.


ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.56-59

ఈనాడు, హైదరాబాద్‌: గృహోపకరణాలను విక్రయించే ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా తొలి పబ్లిక్‌ ఇష్యూ అక్టోబరు 4న ప్రారంభమై 7న ముగియనుంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించే లక్ష్యంతో వస్తున్న ఐపీఓలో, రూ.10 ముఖవిలువ ఉన్న షేరుకు ధరల శ్రేణిగా రూ.56- 59ని నిర్ణయించారు. కనీసం 254 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత 254 చొప్పున పెంచుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.4,349.31 కోట్ల ఆదాయంపై రూ.103.89 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ 30 నాటికి రూ.1,408.45 కోట్ల ఆదాయాన్ని, రూ.40.66 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆగస్టు 31 నాటికి 36 నగరాల్లో ఈ సంస్థకు 112 విక్రయ కేంద్రాలున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, దిల్లీలో ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ పేర్లతో మల్టీ బ్రాండ్‌ స్టోర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. వీటితోపాటు కిచెన్‌ స్టోరీస్‌, ఆడియో అండ్‌ బియాండ్‌ పేర్లతోనూ విక్రయ కేంద్రాలున్నాయి.


1,000 ఉద్యోగాలు: సిలికాన్‌ ల్యాబ్స్‌

హైదరాబాద్‌ (రాయదుర్గం), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌, ఐఓటీ ఆధారిత వైర్‌లెస్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేసే సిలికాన్‌ ల్యాబ్స్‌ హైదరాబాద్‌లో లక్ష చదరపు అడుగుల్లో కార్యాలయాన్ని ప్రారంభించింది. వైర్‌లెస్‌ ఉత్పత్తులు, పారిశ్రామిక, వాణిజ్య, గృహ అవసరాలకు ఉపయోగపడే అప్లికేషన్లు, పరిష్కారాలను ఈ కేంద్రం నుంచి అభివృద్ధి చేయనునున్నట్లు సంస్థ ప్రెసిడెంట్‌, సీఈఓ మ్యాట్‌ జాన్సన్‌ తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఇప్పుడు 500 మంది ఉద్యోగులున్నారని, మూడేళ్లలో వీరి సంఖ్య 1,500కు చేరుకుంటుందని వెల్లడించారు.


చిత్రా రామకృష్ణకు దిల్లీ హైకోర్టు బెయిల్‌
ఆనంద్‌ సుబ్రమణియన్‌కు కూడా

దిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) కోలొకేషన్‌ కేసు వ్యవహారంలో ఆ సంస్థ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ, గ్రూపు మాజీ ఆపరేటింగ్‌ అధికారి ఆనంద్‌ సుబ్రమణియన్‌కు దిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. ఎస్‌ఎస్‌ఈ మాజీ ఉన్నతాధికారులిద్దరికీ ‘బెయిల్‌’ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్‌ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 24న సుబ్రమణియన్‌ను, మార్చి 6న చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్టు చేసింది.

మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ అభిప్రాయం తెలపాలి: సిబ్బంది ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలకు సంబంధించి మనీ ల్యాండరింగ్‌ కేసులో చిత్రా రామకృష్ణ పెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తుపై మీ అభిప్రాయం తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను (ఈడీ) దిల్లీ హైకోర్టు అడిగింది. ఈడీకి న్యాయమూర్తి జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ నోటీసులు జారీ చేశారు. చిత్రా రామకృష్ణపై వచ్చిన ఆరోపణలు మనీ ల్యాండరింగ్‌ నియంత్రణ చట్ట పరిధి కిందకు రావని ఆమె తరపు వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది రెబెక్కా జాన్‌ తెలిపారు.  


గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్‌సీ వాహన రుణాలు
టీఎంఎఫ్‌ఎల్‌, టీఎంఎఫ్‌ఎస్‌ఎల్‌తో జట్టు

దిల్లీ: దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహన రుణాలు అందించేందుకు ప్రభుత్వ ప్రాయోజిత సీఎస్‌సీ (కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌) ఇ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ (టీఎంఎఫ్‌ఎల్‌), టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ సొల్యూషన్స్‌ (టీఎంఎఫ్‌ఎస్‌ఎల్‌)తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామ స్థాయి వ్యాపారవేత్తలు (వీఎల్‌ఈలు) టీఎంఎఫ్‌ఎల్‌, టీఎంఎఫ్‌ఎస్‌ఎల్‌ల వినియోగించిన వాహనాలకు రీఫైనాన్సింగ్‌ సహా అనేక రకాల వాహన రుణ సేవలను అందించనున్నారు. ‘ఈ ఒప్పందం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మందికి పైగా గ్రామ స్థాయి వ్యాపారవేత్తలు ప్రజలకు వాహన రుణ సదుపాయాలు కల్పిస్తార’ని సీఎస్‌సీ వెల్లడించింది. ఈ రుణాలు కావాల్సిన వినియోగదార్లు తమ దగ్గర్లోని సీఎస్‌సీ వద్ద పాన్‌, ఆధార్‌/పాస్‌పోర్ట్‌, ఆదాయ పత్రాలు, స్థిరాస్తి పత్రాలతో సంప్రదించాల్సి ఉంటుంద’ని పేర్కొంది.

 


జనరల్‌ అటామిక్స్‌తో భారత అంకురం ఒప్పందం

వాషింగ్టన్‌: భవిష్యత్‌ తరం కంప్యూటర్‌ చిప్‌లు, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌లు, సెమీకండక్టర్ల సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు అమెరికాకు చెందిన జనరల్‌ అటామిక్స్‌ ఏరోనాటికల్‌ సిస్టమ్స్‌ మన దేశానికి చెందిన అంకుర సంస్థ 3డీటెక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత రక్షణ శాఖ నిర్వహించిన ఐడీఈఎక్స్‌ ప్రోగ్రాంలో విజేతగా నిలిచిన 3డీటెక్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం హర్షణీయమని అటామిక్స్‌ ఏరోనాటికల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వివేక్‌ లాల్‌ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆత్మనిర్భర్‌ భారత్‌, భారత్‌లో తయారీ విధానాలకు మద్దతు ఇవ్వడంలో ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

 


సీఈఎల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ రద్దు

దిల్లీ: సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (సీఈఎల్‌)లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసుకుంది. సీఈఎల్‌ను స్వాధీనం చేసుకునేందుకు విజయవంత బిడ్డర్‌గా అవతరించిన నందల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ సంస్థ, తనపై ఎన్‌సీఎల్‌ఏటీ వద్ద కేసు నడుస్తున్న విషయాన్ని  వెల్లడించక పోవడమే ఇందుకు కారణం. సీఈఎల్‌ను దిల్లీకి చెందిన నందల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌కు రూ.210 కోట్లకు విక్రయించేందుకు గతేడాది నవంబరులో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బిడ్డర్‌పైనా, బిడ్డింగ్‌ ప్రక్రియపైనా కొన్ని ఆరోపణలు రావడంతో.. బిడ్డర్‌కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేయడాన్ని ప్రభుత్వం నిలిపేసింది. ఈ ఆరోపణలు పరిశీలించిన ప్రభుత్వం, ఎన్‌సీఎల్‌ఏటీ వద్ద కేసు పెండింగ్‌లో ఉందనే  ఆరోపణ నిజమని తేల్చింది. ప్రిలిమినరీ ఇన్‌ఫర్మేషన్‌ మెమోరండం, రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ నిబంధనల ప్రకారం ఇది అనర్హత కిందకు వస్తుంద’ని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) వెల్లడించింది. అందుకే సీఈఎల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని పేర్కొంది.


బకాయిలు చెల్లించకుంటే నవంబరు తర్వాత సేవలు ఆపేస్తాం
వొడాఫోన్‌ ఐడియాకు ఇండస్‌ టవర్స్‌ హెచ్చరిక

దిల్లీ: నవంబరు తరవాతా వ్యాపారాన్ని కొనసాగించాలంటే, తమకు బకాయిలు చెల్లించాలని వొడాఫోన్‌ ఐడియాకు ఇండస్‌ టవర్స్‌ తెలియజేసినట్లు ఈ పరిణామంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. వొడాఫోన్‌ ఐడియా బకాయిలు పేరుకుపోవడంపై ఇండస్‌ టవర్స్‌ స్వతంత్ర డైరెక్టర్లు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ‘ఈ నెలలో 80 శాతం బకాయిలను కట్టి.. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెల నుంచి నిర్ణీత సమయంలోగా చెల్లించమని చెప్పింది. లేకుంటే.. నవంబరు నుంచి వొడాఫోన్‌ ఐడియాకు సేవలను ఆపేస్తామని ఇండస్‌ టవర్స్‌ హెచ్చరించింద’ని ఆ వర్గాలు తెలిపాయి. భారత్‌లో 75,000 మొబైల్‌ టవర్లు ఉన్న అమెరికన్‌ టవర్‌ కార్పొరేషన్‌ కూడా బకాయిల వసూళ్ల కోసం ఇదే తరహా చర్యలు చేపట్టే యోచనలో ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలపై వొడాఫోన్‌ ఐడియా, ఇండస్‌ టవర్స్‌, అమెరికా టవర్‌ కార్పొరేషన్‌ (ఏటీసీ) స్పందించలేదు. ఇండస్‌టవర్స్‌కు రూ.6,800 కోట్లు, ఏటీసీకి రూ.2,400 కోట్లు మేర వొడాఫోన్‌ ఐడియా బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా.


లింక్డ్‌ఇన్‌ అత్యుత్తమ అంకురాల్లో స్కైరూట్‌ ఏరోస్పేస్‌

దిల్లీ: ఈ ఏడాదికి సంబంధించిన లింక్డ్‌ఇన్‌ ప్రకటించిన అత్యుత్తమ 10 అంకురాల్లో ఒకటిగా హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ నిలిచింది. 2021 జులై నుంచి 2022 జూన్‌ కాలావధికి ‘ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీతో సభ్యులు-ఉద్యోగుల అనుబంధం, తమ జాబితాలోని అగ్రశ్రేణి సంస్థల నుంచి నిపుణులను ఎలా ఆకర్షించగలిగాయి’ వంటి అంశాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ జాబితాలో అగ్రస్థానాన్ని యూనిఫైడ్‌ చెల్లింపుల సంస్థ క్రెడ్‌ దక్కించుకుంది. ఈ సంస్థ విలువ 6.4 బిలియన్‌ డాలర్లు. రెండో స్థానంలో ఎడ్యుటెక్‌ సంస్థ ‘అప్‌గ్రేడ్‌’, మూడో స్థానంలో ఫిన్‌టెక్‌ అంకురం ‘గ్రో’ నిలిచాయి. తర్వాతి స్థానాల్లో జెప్టో, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ఎంబీఏ చాయ్‌ వాలా, స్పిన్నీ, ద గుడ్‌ గ్లామ్‌ గ్రూప్‌, గ్రోత్‌ స్కూల్‌, బ్లు స్మార్ట్‌ ఉన్నాయి. అత్యుత్తమ 25 అంకురాల్లో 13 బెంగళూరు కేంద్రంగానే ఉన్నాయని లింక్డిన్‌ వెల్లడించింది. స్థిర వృద్ధితో పాటు వ్యాపార స్థాయిని పెంచుకోవడంలో ఈ అంకురాలు ముందున్నాయని లింక్డ్‌ఇన్‌ న్యూస్‌ ఇండియా ఎండీ నిరజిత బెనర్జీ తెలిపారు.


1.5 లక్షల చిన్న ఏటీఎంల ఏర్పాటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల చిన్న (మైక్రో) ఏటీఎంలను దశలవారీగా ఏర్పాటు చేసే ప్రక్రియకు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ శ్రీకారం చుట్టింది. తన వినియోగదారులు నగదు ఉపసంహరించుకునేందుకు తొలుత చిన్న పట్టణాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. అక్కడ నగదు ఉపసంహరణకు అధిక డిమాండు ఉండటం, ఏటీఎంలు పరిమితంగా ఉండటమే కారణంగా పేర్కొంది. దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్‌ పాయింట్ల ద్వారా తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకోనున్నట్లు పేర్కొంది. మైక్రో ఏటీఎం లావాదేవీల సదుపాయాన్ని కల్పించేందుకు ఇప్పటికే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), నేషనల్‌ ఫైనాన్షియల్‌ స్విచ్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌)తోనూ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ అనుసంధానమైంది. మైక్రో ఏటీఎంల ద్వారా వినియోగదారులు ఒక్కసారికి రూ.10,000 వరకు నగదు ఉపసంహరించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని