61,900 వద్ద తక్షణ మద్దతు!

సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. ముడిచమురు ధరలు తగ్గడం, ఎఫ్‌ఐఐ కొనుగోళ్లకు తోడు రూపాయి బలపడటంతో మదుపర్ల సెంటిమెంట్‌ మెరుగైంది.

Published : 05 Dec 2022 04:07 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. ముడిచమురు ధరలు తగ్గడం, ఎఫ్‌ఐఐ కొనుగోళ్లకు తోడు రూపాయి బలపడటంతో మదుపర్ల సెంటిమెంట్‌ మెరుగైంది. దేశీయంగా చూస్తే.. నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతానికి నెమ్మదించింది. నవంబరులో తయారీ పీఎంఐ 55.7కు చేరింది. అక్టోబరులో మౌలిక రంగ వృద్ధి 0.1 శాతానికి పరిమితమైంది. ఏప్రిల్‌-అక్టోబరులో ద్రవ్యలోటు రూ.7.58 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23లో భారత వృద్ధి అంచనాలను ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ 7 శాతానికి తగ్గించింది. బ్యారెల్‌ ముడిచమురు 3.7 శాతం లాభపడి 86.8 డాలర్లకు చేరింది. రష్యా చమురుపై ధరల ఆంక్షలు అమల్లోకి రానుండటం ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.68 నుంచి 81.31కు బలపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా లాక్‌డౌన్‌ల నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన గణాంకాలు నమోదుచేసింది. వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తామనేలా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలిచ్చారు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.9 శాతం లాభంతో 62,869 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1 శాతం పెరిగి 18,696 పాయింట్ల దగ్గర స్థిరపడింది. స్థిరాస్తి, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభపడగా.. విద్యుత్‌, బ్యాంకింగ్‌, వాహన స్క్రిప్‌లు డీలాపడ్డాయి.. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.9,837 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1,336 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నవంబరులో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) మొత్తంగా రూ.36,329 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 5:4గా నమోదు కావడం..

ఎంపిక చేసిన పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: జీవనకాల గరిష్టానికి చేరిన సెన్సెక్స్‌కు, గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ ఎదురైంది. స్వల్పకాలంలో మార్కెట్‌ స్థిరీకరణకు అవకాశం ఉంది. 61,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, 60,800 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు లభించొచ్చు. ఈ కీలక మద్దతు స్థాయుల ఎగువన కొనసాగినంత వరకు సానుకూలంగానే కదలాడొచ్చు.

ప్రభావిత అంశాలు: డిసెంబరు 7న వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈసారి రేట్ల పెంపు 25-35 బేసిస్‌ పాయింట్ల మేర ఉండొచ్చని అంచనా. అయితే జీడీపీ వృద్ధి అంచనాలు కీలకం కానున్నాయి. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల నుంచి మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు. 5వ తేదీ సాయంత్రం ఎగ్జిట్‌ పోల్‌, 8న తుది ఫలితాలు వెలువడనున్నాయి. అధికార భాజపాకు వ్యతిరేక ఫలితం వస్తే మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నుంచీ సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. షేరు/రంగం ఆధారిత కదలికలూ ప్రభావం చూపుతాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై ఓ కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. ఆస్ట్రేలియా, కెనడా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నాయి. తయారీ పీఎంఐలు,  యూరో ఏరియా రిటైల్‌ విక్రయాలు, అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్లు, వినియోగదారు సెంటిమెంట్‌, నిరుద్యోగ క్లెయిమ్‌లు, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. ఎఫ్‌ఐఐ, డీఐఐ పెట్టుబడులు నుంచి కూడా సంకేతాలు తీసుకోవచ్చు. విదేశీ పెట్టుబడులు కొనసాగితే మార్కెట్లకు సానుకూలం కానుంది.

తక్షణ మద్దతు స్థాయులు: 62,447, 61,959, 61,442

తక్షణ నిరోధ స్థాయులు: 63,149, 63,584, 64,000

సెన్సెక్స్‌కు 60,800- 61,900 శ్రేణిలో మద్దతు లభించొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని