టాటా మోటార్స్‌ లాభం రూ.3,043 కోట్లు

టాటా మోటార్స్‌ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. రెండేళ్లలోనే తొలిసారిగా నికరలాభాన్ని డిసెంబరు త్రైమాసికంలో నమోదు చేసింది. సంస్థ రూ.3,043 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది.

Published : 26 Jan 2023 02:32 IST

ఆదాయం రూ.88,489 కోట్లు

దిల్లీ: టాటా మోటార్స్‌ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. రెండేళ్లలోనే తొలిసారిగా నికరలాభాన్ని డిసెంబరు త్రైమాసికంలో నమోదు చేసింది. సంస్థ రూ.3,043 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,451 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.72,229 కోట్ల నుంచి రూ.88,489 కోట్లకు పెరిగింది. స్టాండలోన్‌ ప్రాతిపదికనా టాటా మోటార్స్‌ నికర లాభం రూ.176 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.506 కోట్లకు చేరింది.  ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు 33 శాతం పెరగడంతో పాటు, 1,39,000 రిటైల్‌ విక్రయాలు నమోదయ్యాయి.

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఆదాయం 28 శాతం పెరిగి 6 బిలియన్‌ పౌండ్ల (సుమారు రూ.60,286 కోట్ల)కు చేరింది. భిన్న మోడళ్లు, ధరలు పెంచడం, విడిభాగాల సరఫరా మెరుగవ్వడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సంస్థ పేర్కొంది. పన్ను ముందు లాభం 265 మిలియన్‌ పౌండ్లు (రూ.2,663 కోట్లు)గా నమోదైంది. ఏడాది క్రితం ఇదే సమయంలో 9 మి.పౌండ్ల (రూ.90 కోట్ల) నష్టాన్ని జాగ్వార్‌ ప్రకటించింది.

గిరాకీ బాగుంటుంది: అంతర్జాతీయంగా అనిశ్చితులున్నా, గిరాకీపై అప్రమత్తతతో కూడిన ఆశావాదంతో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2022-23 నాలుగో త్రైమాసికంలో సెమీ కండక్టర్ల సరఫరా  మెరుగు పర్చుకుని, లాభాదాయలను పెంచుకుంటామని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల ఎండీ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. వాణిజ్య వాహనాల అమ్మకాలూ బలంగా పుంజుకున్నాయని, ఎంహెచ్‌సీవీ, ప్యాసెంజర్‌ క్యారియర్‌ విభాగాల్లో బలమైన గిరాకీ లభించిందని  సంస్థ పేర్కొంది. కమొడిటీ ధరలు శాంతించడం, వ్యయ నియంత్రణ చర్యలతో మార్జిన్లు మెరుగయ్యాయని తెలిపింది.
* భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను గమనిస్తున్నామని, సరఫరా-గిరాకీలపై వాటి ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ, ముందుకు సాగుతామని టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీశ్‌ వాఘ్‌ వెల్లడించారు.

చైనాలో: చైనాలో లాక్‌డౌన్‌ల వల్ల డిసెంబరు త్రైమాసికంలో టోకు విక్రయాలపై ప్రభావం పడిందని.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నందున, అక్కడా విక్రయాలు బాగుంటాయనే ఆశాభావాన్ని సంస్థ వ్యక్తం చేసింది.  చిప్‌ల కొరత తీరడం వల్లే, ఉత్పత్తి, టోకు విక్రయాలు పెరిగి జేఎల్‌ఆర్‌ లాభాల్లోకి వచ్చిందని సంస్థ తాత్కాలిక సీఈఓ ఆడ్రియన్‌ మార్డెల్‌ వెల్లడించారు.
* బీఎస్‌ఈలో షేరు 0.73 శాతం నష్టంతో రూ.419 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని