రైతులకు, రక్షణకు.. డ్రోన్లు

ఒక డ్రోన్‌ తయారవ్వాలంటే బ్యాటరీ మోటారుతో పాటు 75 రకాల వస్తువులు అవసరమవుతాయి. వీటిలో చాలా వరకు చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నారు.

Updated : 23 Apr 2023 10:53 IST

దేశ చరిత్రలో గతేడాది ఒక ముందడుగు పడింది. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు ‘కిసాన్‌ డ్రోన్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 మంది రైతులకు ప్రయోగాత్మకంగా డ్రోన్‌లను అందించారు. ఆ అధునాతన డ్రోన్‌లను తయారుచేసింది.. చెన్నైకి చెందిన అంకురం ‘గరుడ ఏరోస్పేస్‌’. ఇప్పుడా సంస్థ ఒక్క వ్యవసాయంలోనే కాదు, రక్షణ రంగంలోనూ డ్రోన్‌ తయారీలో రికార్డు సాధించే దిశగా అడుగులు వేసింది.

ఈనాడు-చెన్నై: ఒక డ్రోన్‌ తయారవ్వాలంటే బ్యాటరీ మోటారుతో పాటు 75 రకాల వస్తువులు అవసరమవుతాయి. వీటిలో చాలా వరకు చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దీన్నే ఓ సవాల్‌గా తీసుకుందీ స్టార్టప్‌. తొలిగా 75 శాతం స్వదేశీ పరికరాలు, వస్తువులతో ఉత్పత్తి చేపట్టనుంది. ఆ తర్వాత 100 శాతం ఈ దిశగా సాగేలా ప్రణాళికను ప్రకటించింది. పెట్టుబడులూ వరుసకట్టాయి. ఇప్పటివరకు 250 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.2050 కోట్లు) నిధులు సమకూరాయి. ఈ  ఉత్సాహంతో డ్రోన్ల తయారీని మొదలుపెట్టింది. స్వదేశీ వస్తువులనే వాడేందుకు దేశవ్యాప్తంగా 120 ప్రముఖ సంస్థలతో చేతులు కలిపింది.

25,000 డ్రోన్లు..

రానున్న ఏడాది కాలంలోనే 25,000 స్వదేశీ డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాతి రెండేళ్లలో ఈ సంఖ్య లక్షకు చేరనుంది. ప్రధానంగా వ్యవసాయం, ఆ తర్వాత ఇతరత్రా రంగాల్లోనూ మరింతగా విస్తరించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. పంట దిగుబడులు పెరిగేలా, నష్టాల్ని నివారించేలా, అత్యాధునిక పద్ధతుల్ని వ్యవసాయంలో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా వీటిని తయారుచేస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సైతం ఆసక్తి చూపడంతో.. వారికి కూడా ‘కిసాన్‌ డ్రోన్‌’ పథకంలో భాగంగానే అందిస్తున్నారు. వీరు వ్యవసాయ వృద్ధికి చేస్తున్న కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఈ డ్రోన్ల తయారీపై తొలిసారిగా ప్రత్యేక రాయితీ ప్రకటించింది.

రక్షణ.. రవాణా..

* డ్రోన్ల వినియోగాన్ని ‘గరుడ’ సంస్థ వినూత్నంగా ముందుకు తీసుకెళ్తోంది. దేశ రక్షణరంగానికి పనికొచ్చేలా తయారుచేస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఎయిర్‌షోలో ‘సూరజ్‌’ పేరుతో భారీ డ్రోన్‌ను ఆవిష్కరించారు. అత్యాధునిక లైడార్‌ (లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌) సెన్సార్లు, కెమేరాలతో ఉన్న ఈ డ్రోన్‌ 3,000 అడుగుల ఎత్తుకు వెళ్లి ఏకంగా 12 గంటలపాటు పర్యవేక్షించగలదని అంటున్నారు. ఈ క్రమంలో మరో ప్రయోగానికీ ఈ సంస్థ సాహసం చేసింది. తుర్కియేలో భారీ భూకంపం సంభవించినప్పుడు అక్కడికెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాల సూచన మేరకు రెండు డ్రోన్లను అక్కడికి పంపింది. రక్షణ చర్యలు వేగంగా జరగడానికి ఇవెంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.

* బయో మెడికల్‌ ఉత్పత్తుల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అత్యవసరంగా తరలించేందుకు ఈ స్టార్టప్‌ ‘సంజీవిని డ్రోన్‌’ పేరుతో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న నారాయణ హెల్త్‌సిటీ, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్లో వీటిని ఏర్పాటు చేశారు. ఏడాదిలో 21 ఆసుపత్రుల్లో ఈ సేవల్ని విస్తృతం చేయాలని అనుకుంటున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లోనూ మందులు సరఫరా చేసేందుకూ 26 నగరాల్లో వీటిని ప్రయోగాత్మకంగా వాడారు. తుపాను సమయాల్లోనూ రక్షణ చర్యల్లో వీరికి చెందిన పలు డ్రోన్లు పాల్గొన్నాయి.

ఈత నుంచి మొదలుపెట్టి...

గరుడ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అగ్నీశ్వర్‌ జయప్రకాష్‌ అంతర్జాతీయ స్విమ్మర్‌గా సుపరిచితుడు. పలు రికార్డులు సృష్టించిన ఈయన.. చెన్నైలోని అగ్ని కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థను నిర్వహించేవారు. దీన్నుంచి ఆయన హయాంలో 300 మహిళా స్టార్టప్‌లు వెలుగులోకి వచ్చాయి. అగ్ని ఫౌండేషన్‌ ద్వారా తమిళనాడులో బలహీనవర్గాలకు సాయం చేయడం, ప్రాజెక్ట్‌ ఫ్రీడం పేరుతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య చేరువయ్యేలా చేస్తున్నారు. సాంకేతికత వైపు దృష్టి మళ్లి 2016లో గరుడ ఏరోస్పేస్‌ స్టార్టప్‌ తెచ్చారు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. స్టార్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని ప్రచారకర్తగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని