Health Insurance: ఆరోగ్య బీమా... సులువుగా అర్థమయ్యేలా..

పెరుగుతున్న వైద్య పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య బీమా అవసరం ఎంతో ఉంది.  ఎంతోమంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. పూర్తిగా అర్థం చేసుకునే వారు కొందరే.

Updated : 12 Jan 2024 05:40 IST

పెరుగుతున్న వైద్య పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య బీమా అవసరం ఎంతో ఉంది.  ఎంతోమంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. పూర్తిగా అర్థం చేసుకునే వారు కొందరే. తీరా క్లెయిం చేసుకునే సందర్భంలో పాలసీలో ఉండే మినహాయింపులు, ఇతర నిబంధనలు పరిహారం రాకుండా అడ్డుకుంటాయి. ఇలాంటి చిక్కులు ఇక నుంచీ ఉండవు. ఆరోగ్య బీమా పాలసీ తేలిగ్గా అర్థమయ్యేలా స్పష్టమైన సమాచారాన్ని అందించాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) బీమా సంస్థలకు సూచించింది. ఇందులో భాగంగా పాలసీలకు సంబంధించి వినియోగదారుల సమాచార నివేదిక (కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌- సీఐఎస్‌)ను జారీ చేయాలని పేర్కొంది. మరి ఏమిటీ సీఐఎస్‌.. అందులో ఏముంటాయి తెలుసుకుందాం.

రోగ్య బీమా పాలసీలో ఉండే మొత్తం సమాచారాన్ని విశ్లేషించడం చాలా కష్టంతో కూడుకున్న పనే. కొన్నిసార్లు సలహాదారులు వివరాలూ చెప్పినా, పాలసీదారులకు అవి అంత గుర్తుండకపోవచ్చు. ఇలాంటి సమస్య రాకుండా సీఐఎస్‌ తోడ్పడుతుంది. పాలసీ రకం, వేచి ఉండే వ్యవధి, ఉప పరిమితులు, మినహాయింపులు, వేరే సంస్థకు మారేందుకు పోర్టబిలిటీ సూచనలు, క్లెయిం సమర్పణ, క్లెయిం కోసం ఎంత సమయం పడుతుంది, ఫిర్యాదులు చేయడానికి ఎవరిని సంప్రదించాలి ఇలా అన్ని వివరాలూ.. ఈ వినియోగదారుల సమాచార నివేదికలో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ సులభమైన భాషలో, అందరికీ అర్థమయ్యేలా ఉండాలని నియంత్రణ సంస్థ సూచించింది. కొత్త పాలసీ తీసుకునేవారితో పాటు, పాలసీని పునరుద్ధరించుకున్న సందర్భంలో ఈ సీఐఎస్‌ను బీమా సంస్థ పాలసీదారులకు అందించాల్సి ఉంటుంది.

ఇందులో ప్రధానంగా ఏముంటాయంటే...

నియంత్రణ సంస్థ సూచించిన ప్రకారం.. ఈ సీఐఎస్‌లో ఏముంటాయంటే..

  • బీమా సంస్థ అందిస్తున్న పాలసీ పేరు
  • పాలసీ సంఖ్య
  • బీమా పాలసీ రకం
  • బీమా పాలసీ మొత్తం విలువ
  • మినహాయింపులు
  • వేచి ఉండే సమయం
  • ఉప పరిమితులు, సహ చెల్లింపులు, తప్పనిసరి తగ్గింపులు, ఇతర మినహాయింపులు
  • క్లెయిం ఎలా చేసుకోవాలి అనే వివరాలు స్పష్టంగా ఉంటాయి.

వీటితోపాటు..

నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వివరాలు, బీమా సంస్థ సహాయ కేంద్రం నంబరు, బ్లాక్‌లిస్టులో ఉన్న ఆసుపత్రులు, ఫిర్యాదు చేసేందుకు ఎవరిని సంప్రదించాలి అనే అంశాలు ఉంటాయి. పాలసీని తీసుకున్న వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అన్ని వివరాలూ ఈ నివేదికలో అందుబాటులో ఉంటాయి.

అదనంగా..

పాలసీని ఎప్పుడు పునరుద్ధరించుకోవాలి, ప్రీమియం చెల్లింపు తేదీ, పాలసీ విలువలో మార్పు కోసం చేయాల్సిన పనులు ఇలాంటివన్నీ సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
చాలా సందర్భాల్లో ముందస్తు వ్యాధులున్న వారు చికిత్స చేయించుకున్నప్పుడు బీమా కంపెనీలు పరిహారాన్ని నిరాకరిస్తుంటాయి. ఈ నిబంధన గురించి సరిగ్గా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమవుతుంది. ఈ చిక్కులను నివారించేందుకు పాలసీదారులు పేర్కొన్న ముందస్తు వ్యాధుల గురించిన సమాచారమూ, అవి ఎప్పటి నుంచి బీమా పరిధిలోకి వస్తాయనే అంశాలూ ఈ సీఐఎస్‌లో పేర్కొంటారు. దీంతోపాటు పాలసీని పూర్తి పారదర్శకంగా అందించేందుకు అవసరమైన ఇతర వివరాలనూ బీమా సంస్థ పొందుపర్చవచ్చు.

ప్రయోజనం ఉంటుందా?

సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీ పత్రం చాలా విపులంగానే ఉంటుంది. కానీ, నిబంధనలు, షరతులు, ఇతర వివరాలు సులభంగా అర్థం చేసుకునేలా ఉండవు. బీమా సంస్థలు సరళమైన భాషను వాడకుండా, సాంకేతిక పదాలను ఎక్కువగా వినియోగిస్తాయి. పాలసీదారులకు ఇవి ఒక పట్టాన అర్థం కావు. దీనికి భిన్నంగా కొత్తగా తీసుకొచ్చే సీఐఎస్‌ వల్ల పాలసీదారులు తమ పాలసీని సులువుగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. కాబట్టి, పాలసీని మరింత అవగాహనతో తీసుకోవచ్చు. ఆసుపత్రిలో చేరినప్పుడూ దేనికి పరిహారం లభిస్తుంది, వేటికి లభించదు, చేతి నుంచి ఎంత ఖర్చయ్యే అవకాశం ఉందిలాంటివి తేలిగ్గా తెలుసుకోవచ్చు. కాబట్టి, కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్నా, పునరుద్ధరణ చేస్తున్నా.. వినియోగదారుల సమాచార నివేదిక (సీఐఎస్‌)ను అడగడం మర్చిపోకండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని