Foreign Trip: విదేశీ విహార యాత్ర భారం కాకుండా...

కొత్తగా అమల్లోకి వచ్చిన మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) నిబంధన విదేశీ ప్రయాణికులకు భారంగా మారింది. క్రెడిట్‌ కార్డుల ఖర్చుపై గతంలో 5 శాతం ఉన్న ఈ పన్ను ఇప్పుడు 20 శాతానికి చేరింది

Updated : 18 Aug 2023 08:22 IST

కొత్తగా అమల్లోకి వచ్చిన మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) నిబంధన విదేశీ ప్రయాణికులకు భారంగా మారింది. క్రెడిట్‌ కార్డుల ఖర్చుపై గతంలో 5 శాతం ఉన్న ఈ పన్ను ఇప్పుడు 20 శాతానికి చేరింది. ఫలితంగా విదేశీ విహార యాత్రలు చేయాలనుకునే వారికి ఖర్చు అధికంగా అవుతోంది. మరి, దీన్ని తగ్గించుకునేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? తెలుసుకుందాం.

భారతీయుల అంతర్జాతీయ విహార యాత్రలకు చేసే ఖర్చుపై పన్ను భారం పడుతోంది. కొత్తగా జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన 20 శాతం టీసీఎస్‌ నిబంధన వల్ల భారతీయ ప్రయాణికులు విదేశాలకు వెళ్లాలనుకుంటే... అంతర్జాతీయ టూర్‌ బుకింగ్‌ చేసుకోవాలనుకుంటే.. 20 శాతం మూలం వద్ద పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. విదేశీ కరెన్సీ కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డును ఉపయోగించినప్పుడు బ్యాంకు 20 శాతాన్ని టీసీఎస్‌గా సేకరిస్తుంది. ఆ టీసీఎస్‌ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేస్తుంది. ఉదాహరణకు మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగించి, ఏదైనా వస్తువును కొన్నారనుకుందాం. దాని విలువ 100 డాలర్లు ఉంటే.. బ్యాంకు మీ దగ్గర్నుంచి 120 డాలర్లను తీసుకుంటుంది. అంటే.. ఆ వస్తువు కోసం మీరు 120 డాలర్లను చెల్లించాలన్నమాట. క్రెడిట్‌ కార్డును ఉపయోగించి చేసే అన్ని విదేశీ లావాదేవీలకు టీసీఎస్‌ నిబంధన వర్తిస్తుంది. దీని వల్ల భారతీయ ప్రయాణికులకు విదేశీ విహార యాత్రలు ఖరీదైనవిగా మారవచ్చు.  మరి, ఈ ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం...

ట్రావెల్‌ కార్డును వాడండి

మీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు హోటళ్లు, రెస్టరెంట్లలో ఉపయోగించేందుకు, ఏదైనా కొనుగోళ్లు చేసేటప్పుడు ఆఫర్లు, రాయితీలతో ఉండే కొన్ని ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించవచ్చు. క్రెడిట్‌ కార్డు సంస్థలు తమ వినియోగదారులకు పలు రకాల తగ్గింపులను అందించేందుకు పోటీ పడుతుంటాయి. కొన్ని విమానయానయాన సంస్థలతో ఒప్పందాన్నీ కుదుర్చుకుంటాయి. ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి సంబంధిత కొనుగోళ్లపై రివార్డు పాయింట్లనూ అందిస్తాయి. మీరు ఈ రివార్డు పాయింట్లను సేకరించిన తర్వాత, విమానాలు, హోటళ్లను బుక్‌ చేసేటప్పుడు వాటిని వాడుకోవచ్చు. కొన్ని ట్రావెల్‌ కార్డులు ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు, ఇతర ఉత్పత్తులపై వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇలా మీ ప్రయాణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.

నగదు రూపంలో..

కొన్ని దేశాల్లో నగదును విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. మీరు విహార యాత్రకు వెళ్తున్న దేశం గురించి ఇలాంటి సంగతులు ముందే తెలుసుకోండి. మీరు మీ ఖర్చులను నగదు రూపంలో చెల్లించవచ్చు. కొన్ని వ్యాపార సంస్థలు నగదు చెల్లింపులను ఆమోదించేందుకు రుసుమును వసూలు చేస్తాయి. ఇలాంటి విషయాలను గమనించాలి.

ఫారెక్స్‌ కార్డుతో...

విదేశీ ప్రయాణాల కోసం క్రెడిట్‌ కార్డును ఉపయోగించాలని అనుకుంటే.. ఫారెక్స్‌ కార్డును పరిశీలించాలి. ఈ ఫారెక్స్‌ క్రెడిట్‌ కార్డులు సాధారణంగా ఇతర రకాల క్రెడిట్‌ కార్డుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు, ఫీజులు వసూలు చేస్తాయి.

ముందుగానే ప్రణాళిక...

మీ విదేశీ విహార యాత్ర ఖర్చును తగ్గించుకునేందుకు ముఖ్యమైన మార్గాల్లో ఒకటి మీ ప్రయాణాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. విమానం టిక్కెట్లు, హోటళ్లు ఇతర ప్రయాణ ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం ద్వారా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందనే దానిపై ఒక అవగాహన వస్తుంది. ఇది మీ ప్రయాణానికి సంబంధించిన బడ్జెట్‌ను రూపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది. అధిక ఖర్చును నివారించడంలో మీకు సహాయం చేస్తుంది.

కొన్ని దేశాల యాత్రలు ఖరీదైనవిగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో విహారానికి వెళ్లాలి అనుకున్నప్పుడు ఆ మేరకు గమ్య స్థానాన్ని నిర్ణయించుకోవాలి. రద్దీ ఉండని కాలంలో వెళ్తే విమానాలు, హోటళ్లు, ఇతర ప్రయాణ ఖర్చులపై డబ్బు ఆదా అవుతుంది. కొన్ని నగరాల్లో మ్యూజియాలు, ఉద్యానవనాలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. మీరు వెళ్లే చోట ఇలాంటివి ఏమున్నాయన్న సమాచారాన్ని ముందుగానే సేకరించండి. చిన్న చిట్కాలు కొంత డబ్బు ఆదా చేసేందుకు సాయపడతాయని గుర్తుంచుకోండి.
అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని