Updated : 22 Jul 2022 03:31 IST

రాబడి హామీ పాలసీ తీసుకోవచ్చా?

- వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. పదవీ విరమణ ప్రయోజనాలను కనీసం మూడేళ్లపాటు ఏదైనా పథకంలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. అప్పటి వరకూ దీనిపై వచ్చిన రాబడితోనూ నాకు అవసరం లేదు. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- విజయ్‌

* మీకు వచ్చిన పదవీ విరమణ ప్రయోజనాలను పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో జమ చేసుకోవచ్చు. ఇందులో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తారు. ఇది పూర్తిగా సురక్షితం. వార్షిక వడ్డీ 7.4 శాతం. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్లారు. సాధారణంగా రెండేళ్ల తర్వాత పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంటుంది. అప్పుడు పెట్టుబడిలో ఒక శాతం తగ్గించి, మిగతా మొత్తం ఇస్తారు. మీరు మూడేళ్ల వరకూ కొనసాగిస్తాను అంటున్నారు కాబట్టి, అప్పుడు వెనక్కి తీసుకుంటే మీకు వర్తించే నికర వడ్డీ రేటు దాదాపు 7 శాతం ఉంటుందని అనుకోవచ్చు. ఇక మూడు నెలలకోసారి వచ్చే వడ్డీని రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. లేదా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో సిప్‌ చేసుకునే వీలునూ పరిశీలించవచ్చు. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ రాబడి బాగుంటుంది. మీ దగ్గర రూ.15లక్షలకు మించి ఉంటే.. మిగతా మొత్తాన్ని బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో కనీసం ఆరు నెలల పాటు మదుపు చేయండి. ఈ పథకాల్లో కాస్త నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు.


- రెండేళ్ల క్రితం ఎండోమెంట్‌ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.54,000 ప్రీమియం చెల్లిస్తున్నాను. దీన్ని రద్దు చేసుకొని, కొత్తగా వచ్చిన ఒక రాబడి హామీ పథకాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. దీనివల్ల లాభమేనా? ఏం చేయాలి?

- రమేశ్‌

* ముందుగా మీరు కుటుంబ అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించేలా మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. సాధారణంగా ఎండోమెంట్‌ పాలసీల్లో మూడేళ్ల ప్రీమియం చెల్లిస్తేనే స్వాధీన విలువ వస్తుంది. అప్పుడూ మీరు చెల్లించిన ప్రీమియంలో 30-50 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. మీరు ఈ పాలసీని రద్దు చేసుకోకుండా కొనసాగించడమే మంచిది. ఎండోమెంట్‌ పాలసీలకంటే మంచి రాబడి రావాలంటే.. ముందుగా టర్మ్‌ పాలసీ తీసుకొని, మిగతా ప్రీమియాన్ని హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి.


- మా అమ్మాయి ఇటీవలే అమెరికా వెళ్లింది. తన పేరుమీద ఇక్కడ కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలున్నాయి. వీటిలో ఇప్పుడూ పెట్టుబడి కొనసాగించేందుకు వీలుందా? పాత వాటిని అమ్మి, మళ్లీ కొత్తగా పెట్టుబడులు ప్రారంభించాలని అంటున్నారు. నిజమేనా?

- ప్రభాకర్‌

* అమెరికా, కెనడా దేశాల్లోని ప్రవాస భారతీయుల నుంచి కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలే కొన్ని నిబంధనలకు లోబడి పెట్టుబడులను అనుమతిస్తున్నాయి. మీ అమ్మాయి పెట్టుబడి పెట్టిన సంస్థలు అమెరికా, కెనడాల నుంచి పెట్టుబడులు అంగీకరిస్తున్నాయా చూసుకోండి. అనుమతిస్తే మదుపు కొనసాగించండి. లేదంటే పెట్టుబడిని వెనక్కి తీసుకోండి. ముందుగా తన కేవైసీని ఎన్‌ఆర్‌ఐ హోదాతో అప్‌డేట్‌ చేయాలి. అదే విధంగా ఇప్పుడున్న మ్యూచువల్‌ ఫండ్లలో ఎన్‌ఆర్‌ఓ బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలి. ఇవన్నీ పూర్తయితేనే పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు వీలవుతుంది. అదే విధంగా తాను అమెరికాలో పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు భారత్‌లో ఉన్న పెట్టుబడులను ప్రస్తావించాలి.


- నెలకు రూ.8వేలను మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 10 ఏళ్ల వరకూ ఈ మొత్తంతో నాకు అవసరం లేదు. రాబడి అధికంగా వచ్చేలా షేర్లలో నెలనెలా మదుపు చేసేందుకు వీలుంటుందా?

- మధు

* మీకు పదేళ్ల వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, కాస్త నష్టభయం ఉన్న పథకాలను పరిశీలించవచ్చు. మీకు స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉంటే, సిస్టమేటిక్‌ ఈక్విటీ ప్లాన్‌ ద్వారా మదుపు చేసుకోవచ్చు. లేకపోతే.. మ్యూచువల్‌ ఫండ్లలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోండి. మీరు 10 ఏళ్లపాటు నెలకు రూ.8 వేలు మదుపు చేస్తే.. 12 శాతం రాబడితో రూ.16,84,678 అయ్యేందుకు అవకాశం ఉంది.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని