Updated : 05 Aug 2022 11:59 IST

Q-A: పసిడిలో మదుపు చేయాలంటే..?

* మా అమ్మాయికి 9 ఏళ్లు. తన పేరుమీద బంగారంలో మదుపు చేయాలనేది మా ఆలోచన. నెలకు రూ.10వేల వరకూ ఇందుకు కేటాయిస్తాం. కనీసం 15 ఏళ్ల వరకూ కొనసాగిస్తాం. దీనికోసం ఏం చేయాలి?

- శ్రావణి

* మొత్తం పెట్టుబడిని బంగారానికే కేటాయించడం సరికాదు. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.5వేలను బంగారం ఫండ్లకు కేటాయించండి. మిగతా రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లించండి. ఇలా 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. సగటున 10 శాతం రాబడితో రూ.38,12,697 అయ్యేందుకు అవకాశం ఉంది. దీనికంటే ముందు మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. కుటుంబ పెద్ద పేరుమీద తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి.


* నా వయసు 62. నెలకు రూ.25వేల చొప్పున 5 ఏళ్లపాటు పెట్టుబడి  పెట్టాలనుకుంటున్నాను. దీనికోసం నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి? ఎంత మొత్తం రావచ్చు?                          

- సీఆర్‌

పెట్టిన పెట్టుబడిపై అధిక రాబడి రావాలంటే.. కాస్త నష్టభయం ఉన్న పథకాలను ఎంచుకోవాలి. దీనికోసం బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. వీటిలో సగటున 9-10 శాతం వరకూ రాబడి అందే అవకాశాలున్నాయి. నెలకు రూ.25 వేల చొప్పున 5 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 9శాతం రాబడితో రూ.17,95,413 చేతికి వచ్చే వీలుంది. అయిదేళ్ల తర్వాత మీకు నెలనెలా క్రమం తప్పని ఆదాయం రావాలంటే ఈ మొత్తం నుంచి సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ద్వారా డబ్బు అందే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు.


* నెలకు రూ.20వేల వరకూ వీపీఎఫ్‌లో జమ చేస్తున్నాను. రూ.2,50,000 దాటితే ఆపై మొత్తానికి వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. కాబట్టి, ఈ మొత్తాన్ని ఇప్పుడు ఏదైనా ఇతర పథకాల్లో మదుపు చేయాలని అనుకుంటున్నాను. పన్ను భారం లేకుండా.. సురక్షితంగా ఉంటూ కనీసం 8 శాతం వరకూ రాబడినిచ్చే పథకాలేమున్నాయి?

- శ్రీనివాసరావు

 ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలను పరిశీలిస్తే సురక్షితంగా ఉంటూ 8 శాతం రాబడినిచ్చేవి ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ మాత్రమే. పన్ను నిబంధనలను అనుసరించి, ప్రత్యామ్నాయం చూడాలి అనుకుంటే.. పోస్టాఫీసులో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇందులో ఏడాదికి రూ.1,50,000 వరకే జమ చేయొచ్చు. అంటే సగటున నెలకు రూ.12,500. ఇందులో ప్రస్తుతం 7.1శాతం పన్ను లేని రాబడి అందుతోంది. జమ చేసిన మొత్తానికి సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్లపాటు కొనసాగించే అవకాశం ఉన్నప్పుడే దీన్ని ఎంచుకోండి. మిగతా రూ.7,500 కొద్దిగా నష్టభయం భరించే శక్తి ఉంటే.. హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి.


*ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవడం మంచిదేనా? దీనివల్ల భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? నా వార్షికాదాయం రూ.15 లక్షలు. నేను ఎంత మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోవాలి?

- పవన్‌

ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దరఖాస్తు పత్రంలో మీ వ్యక్తిగత, ఆదాయం, ఆరోగ్య వివరాలు ఎలాంటి దాపరికం లేకుండా పేర్కొనాలి. గతంలో ఏదైనా శస్త్రచికిత్స జరిగినా, ప్రమాదం బారిన పడినా పేర్కొనాలి. ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడుతుంటే దాని వివరాలు ఇవ్వాలి. కొన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరమూ ఉంటుంది. వీటి ఆధారంగానే బీమా సంస్థలు పాలసీని జారీ చేస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రీమియం లోడింగ్‌ ఉండవచ్చు. లేదా పాలసీని తిరస్కరించే ఆస్కారమూ ఉంది. మీ వార్షికాదాయం రూ.15లక్షలు అంటున్నారు కాబట్టి, కనీసం రూ.కోటిన్నరకు తక్కువ కాకుండా టర్మ్‌ పాలసీని తీసుకోండి. ఈ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి, రెండు వేర్వేరు సంస్థల నుంచి పాలసీలను తీసుకోండి.

-తుమ్మ బాల్ రాజ్ 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని