Q-A: అమెరికా ఫండ్లలో మదుపు చేస్తే...?

ఇల్లు కొనాలనే ఆలోచనతో రూ.10 లక్షల వరకూ జమ చేశాను. కానీ, ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. ఇప్పుడు ఈ డబ్బును మరో రెండేళ్ల వరకూ ఎలా జాగ్రత్త చేసుకోవాలి?

Updated : 30 Dec 2022 12:33 IST


* ఇల్లు కొనాలనే ఆలోచనతో రూ.10 లక్షల వరకూ జమ చేశాను. కానీ, ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. ఇప్పుడు ఈ డబ్బును మరో రెండేళ్ల వరకూ ఎలా జాగ్రత్త చేసుకోవాలి? నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి?
 శశిధర్‌
* మీకు రెండేళ్ల వ్యవధే ఉంది కాబట్టి, నష్టభయం ఉన్న పథకాలను ఎంచుకోవద్దు. సురక్షితమైన పథకాల్లోనే మదుపు చేయడమే మంచిది. మీ దగ్గర ఉన్న రూ.10లక్షలను ఇల్లు కొనే వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోండి. నెలకు రూ.10వేలను రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తూ వెళ్లండి. ప్రత్యామ్నాయంగా మంచి క్రెడిట్‌ క్వాలిటీ ఉన్న షార్ట్‌ టర్మ్‌ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. వీటిలో స్వల్పంగా నష్టభయం ఉండే అవకాశం ఉంది.


మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.6వేల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. తనకిప్పుడు 9 ఏళ్లు. ఏడాదికి 10 శాతం చొప్పున పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లడం మంచిదేనా? 13 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం రావచ్చు?

 ఉమ
మీ అమ్మాయి అవసరాల కోసం ఇంకా 13 ఏళ్ల వ్యవధి ఉంది అంటున్నారు కాబట్టి, మంచి రాబడినిచ్చే పథకాల్లో దీర్ఘకాలం పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఎక్కడ మదుపు చేసినా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని ఆర్జించేలా చూసుకోవాలి. ముందుగా అమ్మాయి భవిష్యత్‌కు ఆర్థిక రక్షణ కల్పించేందుకు కుటుంబ పెద్ద పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. పెట్టుబడి కోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోండి. నెలకు రూ.6వేలు మదుపు చేస్తూ.. ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్తే... 11 శాతం రాబడి అంచనాతో 13 ఏళ్లకు రూ.34,44,623 చేతిలో ఉంటాయి. కొంత నష్టభయం ఉన్నప్పటికీ మంచి రాబడికి అవకాశం ఉంటుంది. మూడేళ్ల ముందు నుంచి క్రమానుగతంగా పెట్టుబడి మొత్తాన్ని సురక్షిత పథకాల్లోకి మళ్లించాలి.


* మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు రూ.25వేల వరకూ మదుపు చేయాలనేది ఆలోచన. మరో ఏడేళ్ల తర్వాత అబ్బాయి అమెరికా చదువు కోసం ఈ డబ్బు అవసరం. దీనికోసం నేను ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?      

 సందీప్‌
* డాలరుతో పోలిస్తే రూపాయి ఏటా 2-3 శాతం క్షీణించడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి, ఏడేళ్ల తర్వాత అమెరికా చదువు ఖర్చు పెరిగే అవకాశమే ఉంది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.13వేల వరకూ అమెరికా మార్కెట్లలో మదుపు చేసే మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించండి. దీనివల్ల డాలరు విలువ పెరిగినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా రూ.12 వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. మీరు  ఏడేళ్లపాటు నెలకు రూ.25వేలు మదుపు చేస్తే సగటున 11 శాతం రాబడితో  రూ.29,34,000 అయ్యేందుకు వీలుంది.


* జీవిత బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. నా వయసు 37. నెలకు రూ.58వేల వరకూ వస్తున్నాయి. ఎంత పాలసీ తీసుకుంటే మంచిది? ఏం  జాగ్రత్తలు తీసుకోవాలి?
 ఉదయ్‌
* జీవిత బీమా పాలసీ ఎప్పుడూ కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేలా ఉండాలి. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా పాలసీని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీసుకోండి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీలను ఎంచుకొని, పాలసీని సమాన మొత్తాల్లో తీసుకోండి. దరఖాస్తు పత్రాన్ని నింపేటప్పుడు ఆరోగ్య, ఆర్థిక సమాచారాన్ని జాగ్రత్తగా ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న వ్యాధులు, ఆసుపత్రిలో చేరితే ఆ వివరాలు కచ్చితంగా తెలియజేయాలి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. 


తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని