ఆ ప్రీమియం వెనక్కి ఇస్తారా?

నా దగ్గర రూ.6 లక్షలు ఉన్నాయి. వీటిని కనీసం 13-14 శాతం రాబడి వచ్చేలా మదుపు చేద్దామని అనుకుంటున్నా. ఎలాంటి పెట్టుబడి పథకాలు ఎంచుకోవాలి?

Published : 27 Jan 2023 00:08 IST

1) నా దగ్గర రూ.6 లక్షలు ఉన్నాయి. వీటిని కనీసం 13-14 శాతం రాబడి వచ్చేలా మదుపు చేద్దామని అనుకుంటున్నా. ఎలాంటి పెట్టుబడి పథకాలు ఎంచుకోవాలి?

శ్రీధర్‌

అధిక మొత్తంలో రాబడి రావాలంటే నష్టభయం ఉన్న ఈక్విటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. కనీసం 5-7 ఏళ్ల పాటు వేచి చూస్తే 12-14 శాతం వరకూ రాబడి వచ్చే వీలుంటుంది. దీనికి మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ఫండ్ల పనితీరును ఏడాదికోసారైనా సమీక్షించుకోండి. మొత్తం డబ్బును ఒకేసారి కాకుండా.. ముందుగా లిక్విడ్‌ ఫండ్లలో జమ చేసి, ఆ తర్వాత క్రమానుగత బదిలీ విధానంలో ఈక్విటీ ఫండ్లలోకి మళ్లించాలి. మీరు 10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. 13 శాతం రాబడితో రూ.20,36,740 అయ్యేందుకు అవకాశం ఉంది.


2) ఏడాది వయసున్న మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.5వేల వరకూ పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. నేను చిన్న వ్యాపారం చేస్తున్నాను. నాకు రూ.50లక్షల జీవిత బీమా పాలసీ ఇస్తారా?

రమణ

మీ పాప ఉన్నత చదువులకోసం మరో 15 ఏళ్లపాటు సమయం ఉంది. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.5వేలను హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేయండి. మీరు రూ.50లక్షల జీవిత బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే టర్మ్‌ పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రూ.50 లక్షల పాలసీకి ఆదాయపు పన్ను రిటర్నులు అవసరం. మీరు రూ.25 లక్షల చొప్పున రెండు కంపెనీల నుంచి పాలసీలు తీసుకునేందుకు ప్రయత్నించండి. బీమా సంస్థల విచక్షణ మేరకు పాలసీ ఇచ్చే అవకాశం ఉంది.


3) మేమిద్దరమూ నాలుగేళ్లగా చెరో రూ.లక్ష ప్రీమియంతో ఎండోమెంట్‌ బీమా పాలసీలు తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం చెల్లించడం కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?

పద్మ

ఎండోమెంట్‌ పాలసీకి నాలుగేళ్ల ప్రీమియం చెల్లించి, ఆ తర్వాత చెల్లించలేని పరిస్థితులు ఉన్నప్పుడు స్వాధీనం చేయడం లేదా పెయిడప్‌ చేసుకోవచ్చు. స్వాధీనం చేసినప్పుడు ఇప్పటి వరకూ చెల్లించిన ప్రీమియంలో 50 శాతం వరకూ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. పెయిడప్‌ చేస్తే.. చెల్లించిన ప్రీమియం మేరకు పాలసీ విలువ సర్దుబాటు అవుతుంది. పాలసీ వ్యవధి తీరాకే డబ్బు మీ చేతికి అందుతుంది. బీమా కంపెనీని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.


4) ఇటీవలే పదవీ విరమణ చేశాను. నెలకు రూ.15వేల వరకూ ఆదాయం వచ్చేలా మదుపు చేయాలని అనుకుంటున్నాను. బీమా సంస్థల యాన్యుటీ పాలసీలు మంచివేనా?

రత్నాకర్‌

మీకు నెలకు రూ.15వేలు రావాలంటే మీరు పెట్టిన పెట్టుబడిపై కనీసం 7 శాతం రాబడి అంచనాతో రూ.26లక్షలు పెట్టుబడి పెట్టాలి. బీమా సంస్థల యాన్యుటీ పథకాల్లో ఇతర ప్రత్యామ్నాయ పథకాలతో పోలిస్తే కాస్త రాబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి యాన్యుటీని నిర్ణయిస్తే వ్యవధి తీరేంత వరకూ అదే కొనసాగుతుంది. వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో సంబంధం ఉండదు. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం, ప్రధానమంత్రి వయ వందన యోజన లాంటి పథకాలనూ పరిశీలించవచ్చు. ఈ రెండింటిలో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకే మదుపు చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు