విద్యా ద్రవ్యోల్బణం అధిగమించేలా...

ముందుగా మీపై ఆధారపడిన వారుంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీని పరిశీలించండి.

Updated : 06 Jul 2023 12:27 IST
నా వయసు 24. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.28 వేల వరకూ చేతికి వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. నా ప్రణాళిక ఎలా ఉండాలి? 
సత్య
- ముందుగా మీపై ఆధారపడిన వారుంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీని పరిశీలించండి. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలను తప్పనిసరిగా తీసుకోండి. మీకు నెలకు ఎంత ఖర్చవుతుందో లెక్క వేసుకొని, కనీసం మూడు నుంచి ఆరు నెలలకు సరిపోయే విధంగా అత్యవసర నిధిని జమ చేసుకోండి. ఇవన్నీ పూర్తయ్యాకే పెట్టుబడుల గురించి ఆలోచించండి. రూ.10వేలలో రూ.3వేలను నెలనెలా ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో జమ చేయండి. మిగతా రూ.7వేలను క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. పీపీఎఫ్‌లో 15 ఏళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. తర్వాత దీన్ని కొనసాగించుకోవచ్చు. ఇలా మొత్తం 25 ఏళ్లపాటు నెలకు రూ.10వేల చొప్పున క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. సగటున 11 శాతం రాబడితో రూ.1,37,29,596 అయ్యేందుకు అవకాశం ఉంది.

మా అబ్బాయి వయసు 13. తన ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకొని, నెలకు రూ.25వేలు మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?
 ప్రభు
-  మీ అబ్బాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపై తగినంత జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీ బాబు ఉన్నత చదువులకు ఇంకా ఏడెనిమిదేళ్ల వ్యవధి ఉంది. కాబట్టి, విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవాలి. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి. ఎనిమిదేళ్లపాటు నెలకు రూ.25వేలు మదుపు చేస్తే.. దాదాపు రూ.36,89,900 అయ్యే వీలుంది. ఎప్పటికప్పుడు పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.

నెలకు రూ.8వేలను బంగారంలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఎలాంటి పథకాలను ఎంచుకోవడం మేలు?
 శ్రీహర్షిత
-  ప్రస్తుతం మీరు చేస్తున్న పెట్టుబడిని భవిష్యత్‌లో బంగారం పెట్టుబడికి ఉపయోగిస్తారా? అలా అనుకుంటే.. గోల్డ్‌ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేసుకోవచ్చు. మీరు సాధారణ పెట్టుబడి గురించి మాత్రమే ఆలోచిస్తే.. రూ.2వేలను గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని ఈక్విటీ హైబ్రిడ్‌, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఇలా కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే మంచిది.

నాలుగేళ్ల క్రితం యూనిట్‌ ఆధారిత పాలసీని తీసుకున్నాను. ఈ ఏడాది మార్చిలో ప్రీమియం చెల్లించలేదు. ఇప్పుడు దీన్ని రద్దు చేసుకోవచ్చా? గడువు తీరేదాకా కొనసాగించుకునే అవకాశం ఉందా? 
శ్రీకాంత్‌
-  సాధారణంగా యూనిట్‌ ఆధారిత పాలసీలకు అయిదేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. ఇది ముగిసేదాకా ప్రీమియం చెల్లించాలి. లేకపోతే పాలసీ రద్దయ్యే ఆస్కారం ఉంటుంది. మరో ఏడాది ప్రీమియం చెల్లిస్తే.. పాలసీకి స్వాధీన విలువ వస్తుంది. కాబట్టి, వీలైతే ప్రీమియం చెల్లించేందుకు ప్రయత్నించండి. అయిదేళ్ల గడువు ముగిసిన తర్వాత పాలసీని స్వాధీనం చేసి, ఫండ్‌ విలువ మేరకు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.
తుమ్మ బాల్‌రాజ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని