నెలకు రూ.30 వేలు వచ్చేలా

మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. అప్పటి నుంచి నాకు నెలకు రూ.30 వేల వరకూ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను.

Updated : 14 Jul 2023 01:07 IST

* మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. అప్పటి నుంచి నాకు నెలకు రూ.30 వేల వరకూ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నా దగ్గర రూ.20 లక్షల వరకూ ఉన్నాయి. నా ప్రణాళిక ఎలా ఉండాలి?

ప్రదీప్‌

* ముందుగా మీరు సొంతంగా ఆరోగ్య బీమా పాలసీని తీసుకునే ప్రయత్నం చేయండి. మీపై ఇంకా బాధ్యతలు ఉంటే కనీసం అయిదేళ్ల వ్యవధికి టర్మ్‌ పాలసీని తీసుకోండి.  మీకు నెలకు రూ.30 వేలు క్రమం తప్పకుండా రావాలంటే.. 7 శాతం రాబడితో రూ.51,50,000 నిధి   అవసరం అవుతుంది.


* మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు రూ.10వేలు మదుపు చేస్తున్నాను. మరో రూ.10వేలను అదనంగా పెట్టుబడి పెట్టాలని ఆలోచన. ఈ మొత్తాన్ని రికరింగ్‌ డిపాజిట్‌ చేయొచ్చా? కనీసం ఆరేళ్లపాటు కొనసాగించేలా ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

శ్రీకాంత్‌

* మీకు ఆరేళ్ల దాకా డబ్బు అవసరం లేదంటున్నారు కాబట్టి, సురక్షిత పథకాలకు బదులుగా కాస్త అధిక రాబడినిచ్చే వాటిని పరిశీలించవచ్చు. ఇందుకోసం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. మీరు ఎంచుకున్న ఫండ్ల పనితీరు బాగుంటే.. అందులోనే ఈ మొత్తాన్నీ మదుపు చేయండి. వచ్చే అయిదేళ్ల కాలంలో స్టాక్‌ మార్కెట్‌ పనితీరు మెరుగ్గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి, మీ పెట్టుబడీ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఏడాదికోసారి మీ పెట్టుబడులను పరిశీలిస్తూ ఉండాలి.


* మా అమ్మాయి వయసు 12. తన పేరుమీద నెలకు రూ.8వేల వరకూ సురక్షిత పథకాల్లో మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

శ్రీవిద్య

* ముందుగా మీ అమ్మాయి ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం కుటుంబ పెద్ద పేరుమీద తగినంత మొత్తానికి జీవిత బీమా పాలసీని తీసుకోండి. పెట్టుబడి ఎక్కడ పెట్టినా విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోవాలి. సురక్షితమైన పథకాల్లో వచ్చే రాబడికి పన్ను వర్తిస్తుంది. పన్ను పోను వచ్చే రాబడితో ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి, మీరు హైబ్రిడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు లేదా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. కనీసం 5-7 ఏళ్లపాటు మదుపు చేస్తే మంచి రాబడికి అవకాశం ఉంటుంది.


* నా వయసు 32. ఏడాది క్రితం ఆన్‌లైన్‌లో రూ.40 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. దీన్ని రద్దు చేసుకొని, కొత్తగా రూ.75 లక్షల పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏం చేయాలి?

ప్రశాంత్‌

* మీరు ఇప్పటికే తీసుకున్న టర్మ్‌ పాలసీ కంపెనీ క్లెయిం చెల్లింపుల తీరు బాగుంటే ఆ పాలసీని కొనసాగించండి. మరో బీమా సంస్థ నుంచి రూ.35 లక్షల బీమా పాలసీ తీసుకోండి. కొత్త పాలసీ తీసుకునేటప్పుడు పాత పాలసీ వివరాలు, మీ ఆరోగ్య, ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నమోదు చేయండి. ఒకవేళ ఒకే పాలసీ రూ.75 లక్షలకు తీసుకోవాలనుకుంటే.. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంచుకోండి. కొత్త పాలసీని తీసుకున్న తర్వాతే పాత పాలసీకి ప్రీమియం చెల్లింపును నిలిపివేయండి.


* ఏడేళ్ల క్రితం గృహరుణం తీసుకున్నాను. అసలు బాకీ రూ.30 లక్షలు ఉంది. దీనిపై మరో రూ.10 లక్షల వరకూ టాపప్‌ ఇస్తామని బ్యాంకు అంటోంది. దీన్ని తీసుకోవచ్చా? మంచి రాబడిని ఇచ్చే పథకాల్లో మదుపు చేస్తే ప్రయోజనమేనా?

విజయ్‌

* పెట్టుబడుల ప్రాథమిక సూత్రం.. మీ దగ్గర ఉన్న మిగులునే మదుపు చేయాలి. అప్పు చేసి, పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ సరికాదు. ప్రస్తుతం గృహరుణాలపై 8.5 శాతం నుంచి 8.75 శాతం వరకూ వడ్డీ ఉంది. మీరు టాపప్‌ తీసుకొని, పెట్టుబడి పెడితే అంతకు మించి రాబడిని ఆర్జించాలి. అన్ని వేళలా ఇది సాధ్యమని చెప్పలేం. కాబట్టి, మీరు సాధ్యమైనంత వరకూ రుణాన్ని తగ్గించుకునే ప్రయత్నమే చేయండి.


తుమ్మ బాల్‌రాజ్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని