నెలకు రూ.10వేలు మదుపు చేస్తే...

మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.25 వేల వరకూ వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నా. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?

Published : 28 Jul 2023 00:46 IST

మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.25 వేల వరకూ వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నా. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?

చంద్ర

* మీకు పదేళ్ల సమయం ఉంది కాబట్టి, మీరు నిశ్చింతగా ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవచ్చు. దీనికోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో మంచి నిధి సమకూరే అవకాశం ఉంది. మీరు నెలకు రూ.25 వేల చొప్పున పదేళ్లపాటు మదుపు చేస్తే 12 శాతం రాబడితో రూ.52,64,620 అయ్యే అవకాశం ఉంది. మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు రెండు మూడేళ్ల ముందుగానే పెట్టుబడిని సురక్షిత పెట్టుబడి పథకాల్లోకి మార్చుకోండి.


నాకు 27 ఏళ్లు. నెలకు రూ.35 వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10 వేలను ఏదైనా పెట్టుబడికి కేటాయించాలని అనుకుంటున్నాను. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

రవి

* ముందుగా మీరు తగినంత మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ ఇది ఉండాలి. అదే విధంగా ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలనూ తీసుకోండి. మీరు దీర్ఘకాలం మదుపు చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి, మంచి మొత్తం జమ అయ్యే అవకాశం ఉంది. నెలకు రూ.10వేల చొప్పున మీకు 60 ఏళ్లు వచ్చే వరకూ మదుపు చేస్తే.. దాదాపు 12 శాతం రాబడితో సుమారు రూ.4,10,91,000 అయ్యే అవకాశం ఉంది.


మరో నాలుగేళ్లలో పదవీ విరమణ చేస్తాను. అప్పటి నుంచి నాకు నెలకు రూ.50 వేల వరకూ పింఛను వచ్చే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం నేను ఇప్పటి నుంచి ఎంత మొత్తాన్ని జమ చేయాలి.

వినోద్‌

* మీకు డబ్బు కావాల్సిన సమయం చాలా తక్కువగా ఉంది. మీకు నెలకు రూ.50 వేల పింఛను రావాలంటే.. ఏడాదికి రూ.6 లక్షలు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. మీ దగ్గరైన జమైన డబ్బు పైన 7 శాతం వస్తుందనే అంచనాతో మీ దగ్గర రూ.86 లక్షలు ఉండాలి. ఈ నాలుగేళ్లలో ఈ మొత్తం జమ చేయాలంటే.. 10 శాతం రాబడి అంచనాతో.. నెలకు రూ.1,55,000 మదుపు చేయాల్సి ఉంటుంది.


మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు రూ.6 వేల వరకూ మదుపు చేస్తున్నాను. మరో రూ.6,000 పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఈ మొత్తాన్ని సురక్షిత పథకాల్లో మదుపు చేయాలా? ఇప్పటికే ఉన్న ఫండ్లనే ఎంచుకోవాలా?

సురేశ్‌

* మీరు ఇప్పటికే మదుపు చేస్తున్న ఫండ్‌ పథకాల పనితీరు బాగుంటే వాటిని కొనసాగించండి. మీరు అదనంగా మదుపు చేయాలనుకుంటున్న రూ.6వేలలో రూ.2,400 పాత ఫండ్లకు మళ్లించండి. మిగతా రూ.3,600 పీపీఎఫ్‌ ఖాతా ప్రారంభించి, నెలనెలా అందులో జమ చేయండి.


నేను చిరు వ్యాపారిని. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో వీలున్నప్పుడల్లా కొంత మొత్తం జమ చేయొచ్చా? దీనికన్నా మెరుగైన పథకాలేమైనా అందుబాటులో ఉన్నాయా?

నవీన్‌

* మీరు పీపీఎఫ్‌లో ఏడాదికి 12 సార్ల వరకూ జమ చేసుకోవచ్చు. మొత్తం డబ్బును ఒకే చోట కాకుండా మీరు జమ చేయాలనుకున్న మొత్తంలో 50 శాతం పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మీకు వీలున్నప్పుడు అని కాకుండా, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించండి.


తుమ్మ బాల్‌రాజ్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని