మదుపు... పసిడిలో 15 శాతమే

రెండు మూడేళ్ల వ్యవధికి డబ్బును జమ చేయాలనుకుంటే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్‌డీలో వడ్డీ రేట్లు సానుకూలంగానే ఉన్నాయి

Updated : 04 Aug 2023 04:52 IST

వచ్చే నెలలో రికరింగ్‌ డిపాజిట్‌ వ్యవధి ముగుస్తోంది. కనీసం రూ.2.5 లక్షల వరకూ వస్తాయి. వీటిని మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు డెట్‌ పథకాలను ఎంచుకోవచ్చా? మంచి రాబడి కోసం ఏం చేయాలి?

రాజశేఖర్‌
రెండు మూడేళ్ల వ్యవధికి డబ్బును జమ చేయాలనుకుంటే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్‌డీలో వడ్డీ రేట్లు సానుకూలంగానే ఉన్నాయి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో స్వల్పంగా నష్టభయం ఉంటుంది. ఎఫ్‌డీలతో పోలిస్తే రాబడి కొంత ఎక్కువ రావచ్చు. ఒకవేళ అయిదేళ్లకు మించి పెట్టుబడిని కొనసాగిస్తే.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, ఈక్విటీ హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి.


నెలకు రూ.5వేలతో ప్రస్తుతం పెట్టుబడిని ప్రారంభించాలనేది ఆలోచన. తర్వాత దీన్ని కనీసం 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తాను. ఇలా చేయడం మంచిదేనా? 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం రావచ్చు?      

 లక్ష్మణ్‌

దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టినప్పుడు మంచి మొత్తం జమయ్యే అవకాశం ఉంటుంది. 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోండి. నెలకు రూ.5,000 మదుపు చేస్తూ, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్తే.. 15 ఏళ్ల తర్వాత సగటున 12 శాతం రాబడితో రూ.43.55 లక్షల వరకూ చేతికి వచ్చే వీలుంది.



బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. దీనిలో మదుపు చేసేందుకు గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చా? డబ్బులు ఉన్నప్పుడల్లా వీటిని కొనొచ్చా?
ప్రణీత
మొత్తం పెట్టుబడిలో బంగారానికి కేటాయింపు 10-15 శాతం వరకే ఉండాలి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో కనీసం ఒక యూనిట్‌ కొనాల్సి ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయంగా గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లనూ పరిశీలించవచ్చు.


నా వయసు 52. మరో 8 ఏళ్లలో కనీసం రూ.50లక్షలు నా చేతిలో ఉండాలనేది ఆలోచన. ఈపీఎఫ్‌లో రూ.16 లక్షల వరకూ ఉన్నాయి. మిగతా మొత్తం కోసం ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి?
 శ్రీనివాస్‌
ప్రస్తుతం మీ ఈపీఎఫ్‌ ఖాతాలో రూ.16 లక్షలు ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం 8.15 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఇదే వడ్డీ రేటు కొనసాగితే ఈ మొత్తం 8 ఏళ్లలో రూ.30లక్షలు అవుతుంది. ఈ ఎనిమిదేళ్లలో మీ పీఎఫ్‌ జమ పెరుగుతుంది. కాబట్టి, మొత్తంగా రూ.40 లక్షల వరకూ కావొచ్చు. మరో రూ.10 లక్షలు జమ చేయాలంటే.. 12 శాతం రాబడినిచ్చే పథకాల్లో నెలకు రూ.7,000 చొప్పున మదుపు చేయండి. పదవీ విరమణ తర్వాత రూ.50లక్షల నిధి చాలా తక్కువ. వీలైతే పెట్టుబడిని పెంచుకునే ప్రయత్నం చేయండి.


మా పాప పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో రూ.2,000, నా పేరుమీద పీపీఎఫ్‌లో రూ.2,000 చొప్పున జమ చేస్తున్నాను. రూ.4,000 కొత్తగా మదుపు చేయాలనుకుంటున్నాను. వీటిలోనే కొనసాగించాలా?

అనంత్‌
కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.4,000 అధిక రాబడినిచ్చే డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి.
తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని