Whatsapp: ‘వాట్సాప్‌ వాడకపోయినా మైక్‌ ఆన్‌’.. ఆరోపణలపై స్పందించిన కేంద్రం!

WhatsApp: ట్విటర్‌లో పనిచేసే ఓ ఉద్యోగి వాట్సాప్‌పై చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా ఈ విషయంపై స్పందించారు.

Updated : 10 May 2023 17:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌పై (Whatsapp) తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. యాప్‌ను వాడని సమయంలోనూ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ పనిచేస్తుందంటూ ట్విటర్‌లో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఈ యాప్‌ నమ్మదగినది కాదంటూ స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌మస్క్‌ ట్వీట్‌ చేయగా.. వాట్సాప్‌పై ఆరోపణలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ భారత ప్రభుత్వం తరఫున స్పందించారు.

ట్విటర్‌ (Twitter)లో పనిచేస్తున్న ఫోడ్‌ డబిరి అనే ఓ ఇంజనీర్‌ ఉద్యోగి ట్వీట్‌తో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ‘నేను నిద్రపోతున్న సమయంలో వాట్సాప్‌ బ్యాగ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోంది. ఉదయం లేవగానే నా ఫోన్‌ను చూసి ఆశ్చర్యపోయా’ అంటూ తన ఆండ్రాయిడ్‌ డ్యాష్‌బోర్డ్‌ స్క్రీన్‌ షాట్‌ను ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘అసలు ఏం జరుగుతోంది’ అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. వాట్సాప్‌ నమ్మదగిన అప్లికేషన్‌ కాదని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత వైరల్‌గా మారింది.

స్పందించిన భారత్‌

వాట్సాప్‌పై వచ్చిన ఆరోపణలపై రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. యూజర్లకు గోప్యతకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు సిద్ధమవుతోందని ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో వాట్సాప్‌ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోయిన సందర్భంలోనూ స్పందించిన భారత్‌.. ఆగిపోవడానికి గల కారణాలను తెలియజేయాలంటూ వాట్సాప్‌ నుంచి వివరణ కోరింది. భారత యూజర్లను అంతర్జాతీయ కాల్స్‌ వేధిస్తున్న వేళ ఈ వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.

అదో బగ్‌..: వాట్సాప్‌

సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో వాట్సాప్‌ స్పందించింది. మైక్రోఫోన్‌ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆండ్రాయిడ్‌లో ఉన్న బగ్‌ కారణంగానే డ్యాష్‌బోర్డులో తప్పుడు సమాచారం చూపిస్తోందని పేర్కొంది. సదరు యూజర్‌ గూగుల్‌ పిక్సల్‌ ఫోన్‌ వాడుతున్నారని, దీనిపై విచారణ జరపాలని గూగుల్‌ను కోరామని పేర్కొంది. మైక్రోఫోన్‌ సెట్టింగ్స్‌పై పూర్తి నియంత్రణ యూజర్ల చేతిలోనే ఉంటుందని స్పష్టంచేసింది. యూజర్‌ ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు, వాయిస్‌, వీడియో రికార్డింగ్‌ చేసినప్పుడు మాత్రమే మైక్రోఫోన్‌ పనిచేస్తుందని తెలిపింది. ఈ సంభాషణలు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ రక్షణ ఉంటుందని, వేటినీ వాట్సాప్‌ వినదంటూ సుదీర్ఘ ట్వీట్‌ను  రాసుకొచ్చింది.

ట్విటర్‌లో వాట్సాప్‌ తరహా ఫీచర్స్‌

వాట్సాప్‌పై ఈ ఆరోపణల వేళ మస్క్‌ మరో కీలక ప్రకటన చేశారు. ట్విటర్‌లో వాట్సాప్‌ తరహా సేవలను పరిచయం చేయనున్నట్లు మస్క్‌ ట్వీట్ చేశారు. దీంతో వాట్సాప్‌ తరహాలో డైరెక్ట్‌ మెసేజులకు రిప్లయ్‌లు ఇవ్వొచ్చని, ఎమోజీలు పంపొచ్చని, వీడియో/ఆడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చని తెలిపారు. ‘‘కొత్త వెర్షన్‌ యాప్‌లో యూజర్లు డైరెక్ట్‌ మెసేజ్‌ ద్వారా ట్విటర్‌ థ్రెడ్‌లో దేనికైనా మెసేజులు పంపొచ్చు. ఎమోజీతో రిప్లయ్‌ ఇవ్వొచ్చు. త్వరలో ఎన్‌క్రిప్షన్‌ భద్రతతో డైరెక్ట్‌ మెసేజ్‌ వెర్షన్‌ 1.0ను తీసుకొస్తాం. దీంతో ట్విటర్‌ మెసేజ్‌లను చూడలేరు. అలానే ఇతరులకు మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్విటర్‌ ద్వారా వీడియో/ఆడియో కాల్స్‌ చేసుకోవచ్చు’’ అని మస్క్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని