Credit card: క్రెడిట్‌ కార్డు ఇలా వాడితే ఓకే.. ‘మినిమమ్‌’ కడితే మోతే..!

Credit card: క్రెడిట్ కార్డు బిల్లులు తిరిగి చెల్లించాల్సిన సమయంలో కనీస మొత్తాన్ని చెల్లించి కొందరు చేతులు దులిపేసుకుంటారు. అలా చెల్లిస్తే వడ్డీ, పెనాల్టీల మోత మోగడం గ్యారెంటీ.  అలా కాకుండా ఉండాలంటే?

Updated : 07 Aug 2023 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు క్రెడిట్‌ కార్డ్‌ (Credit card) తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యాంకులు చాలా సులువుగా వీటిని జారీ చేస్తున్నాయి. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే సులువుగా క్రెడిట్ కార్డును అందించడంతో పాటు, కొన్ని ప్రయోజనాలనూ అందిస్తున్నాయి.  దీంతో క్రెడిట్‌ కార్డు వినియోగం బాగా పెరిగింది. అదే సమయంలో కార్డు వినియోగదారులు బ్యాంక్‌కు చెల్లించాల్సిన బకాయిలూ బాగా పెరుగుతున్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ తరహా బకాయిలు రూ.2 లక్షల కోట్లు దాటాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా పేరుకుపోవడానికి ప్రధాన కారణం. మినిమమ్‌ బిల్లులు చెల్లించడం. దీనివల్ల  పెద్ద మొత్తంలో పెనాల్టీలతో పాటు వడ్డీ సైతం చెల్లించాల్సి వస్తుంది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే?

క్రెడిట్‌ కార్డులో ఉండే ప్రధాన సదుపాయం వడ్డీ రహిత కాలం. ఏదైనా కొనుగోళ్లు జరిపాక 50 రోజుల పాటు (బిల్లింగ్‌ తేదీని బట్టి) ఎలాంటి వడ్డీ చెల్లించకుండానే తిరిగి చెల్లింపులు చేయొచ్చు. ఒకవేళ ఏదైనా నెల డబ్బులు లేకపోతే క‌నీస మొత్తం చెల్లించి మిగ‌లిన మొత్తాన్ని త‌రువాతి నెల‌కు బ‌దిలీ చేసే వెసులుబాటూ ఉంది. ఒక విధంగా ఇది ఉపయోకరమే అయినా చాలా మంది ఇక్కడే అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుకే క్రెడిట్‌ కార్డును తగిన ప్రణాళికతో వినియోగించాలి.

ఛార్జీలు ఇలా..

చాలా మంది కార్డు హోల్డర్లు తమ కొనుగోలు శక్తికి మించి క్రెడిట్ కార్డుతో ఖర్చు చేస్తుంటారు. తీరా గడువు ముగిసే సమయానికి డబ్బులు చెల్లించలేక చేతులెత్తేస్తుంటారు.  కనీస మొత్తం కూడా చెల్లించరు. ఇది ఏ మాత్రం సరికాదు. గడువులోగా క్రెడిట్‌ కార్డు కనీస బిల్లు చెల్లించకపోతే ఆలస్య రుసుములు భరించాల్సి ఉంటుంది. బకాయిపై 20 శాతం నుంచి 44 శాతం వరకు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కనీస మొత్తం చెల్లిస్తే లేట్‌ పేమెంట్‌ ఛార్జీలు తప్పించుకోవచ్చు. అయితే, కనీస మొత్తం చెల్లించాక మరుసటి బిల్లింగ్‌లో ఏదైనా కొనుగోళ్లు జరిపితే ఆ మొత్తంపైనా వడ్డీ భారం పడుతుంది. దీనివల్ల క్రెడిట్‌ కార్డు వల్ల ఉండే అసలు ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో బిల్లు చెల్లింపుల కోసం కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అదనపు ఛార్జీలు పడకుండా క్రెడిట్ కార్డును ఎలా తెలివిగా ఉపయోగించాలో చూద్దాం.

  • క్రెడిట్‌ కార్డు వినియోగించే వారు ఎవరైనా సరే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసి ముందడుగు వేయటం ఉత్తమం. లేదా రుణ ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంటుంది.
  • ఒకవేళ క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఉత్తమం. ఈఎంఐగా మార్చినప్పుడు కూడా వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు భారం ఉంటుంది. కానీ బకాయిపై విధించే వడ్డీతో పోలిస్తే ఈఎంఐ వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది.
  •  క్రెడిట్ లిమిట్‌ మొత్తాన్ని ఖర్చు చేస్తే అది మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుందన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్‌ లిమిట్‌లో 30 శాతానికి మించి ఖర్చు చేయకపోవడం ఉత్తమం. ఇది తెలిస్తే ఖర్చు చేసే విషయంలో కాస్త వెనుకాడతారు.
  • అలాగే, మీ అవసరాలకు తగిన కార్డులను ఎంచుకోవడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, ట్రావెల్‌ కార్డులను ఎంచుకోవడం ద్వారా ఎంతో కొంత ఆదా చేసుకోగలుగుతారు.
  • క్రెడిట్‌ కార్డుతో పొరపాటున కూడా డబ్బులు విత్‌ డ్రా చేయాలన్న ఆలోచన చేయకుండా ఉండడం అనేది ఇంకా తెలివైన పని. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలు పొందాలంటే ఎప్పటికప్పుడు బిల్లు మొత్తాన్ని చెల్లించడం మంచిది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని