Credit Cards: క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో ఎంతుండాలి?

క్రెడిట్‌ కార్డుపై ఖర్చులు పెరిగినప్పుడు క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి(CUR) కూడా పెరుగుతుంది. దీనివల్ల క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. సీయూఆర్‌ను ఎలా నిర్వహించాలో ఇక్కడ చూడండి.

Published : 13 Dec 2023 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చాలా మంది తమ దైనందిన ఆర్థిక కార్యకలాపాల కోసం క్రెడిట్‌ కార్డులను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువ మంది తమ నెలవారీ యుటిలిటీ బిల్లులు చెల్లించడం, ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం, వస్తువుల కొనుగోలు నిమిత్తం క్రెడిట్‌ కార్డును వ్యాపార సంస్థల వద్ద స్వైపింగ్‌ చేయడం ద్వారా క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. వీటి చెల్లింపులు అన్నీ చేసేది క్రెడిట్‌తోనే. కాబట్టి, ఇది రుణంతో సమానం. క్రెడిట్‌ పరిమితి మేరకు దీన్ని ఉపయోగిస్తుంటారు. క్రెడిట్‌ కార్డు పరిమితిలో ఎంత శాతం క్రెడిట్‌ను వాడుకున్నామో దాన్నే క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో(CUR) అంటారు.

సీయూఆర్‌

మీ క్రెడిట్‌ కార్డు ఖర్చులు నియంత్రణలో ఉన్నాయా? లేదా అని చూపించేదే CUR. మంచి క్రెడిట్‌ స్కోరు కోసం ఆరోగ్యకరమైన CURను నిర్వహించడం చాలా కీలకం. మీ కార్డు పరిమితి రూ.1 లక్ష అనుకుందాం. అయితే, కార్డు పరిమితి ఉంది కదా అని పూర్తిగా 100% ఉపయోగించవచ్చా? అలా చేయకూడదు. క్రెడిట్‌ పరిమితి మేరకు 30% వరకు మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు మీరు రూ.1 లక్ష మొత్తం క్రెడిట్‌ పరిమితిని కలిగి ఉన్నప్పుడు, క్రెడిట్‌ (బకాయిలు) రూ.30 వేలు ఉంటే, మీ క్రెడిట్‌ యూటిలైజేషన్‌ రేషియో(CUR) 30,000/1,00,000X100=30%. మీ బకాయి రూ.50 వేలు ఉంటే, అప్పుడు మీ CUR 50% ఉన్నట్టు. అధిక CUR, వినియోగదారుడు తనకు అందుబాటులో ఉన్న క్రెడిట్‌ను ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నారని సూచిస్తుంది.

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం

Cibil, Experian, Equifax, CRIF వంటి క్రెడిట్‌ బ్యూరోలు వివిధ అంశాల ఆధారంగా క్రెడిట్‌ స్కోరును లెక్కిస్తాయి. మీ క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేసే కీలకమైన అంశాల్లో CUR ప్రధానమైంది. మీరు రుణం లేదా మరొక క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణ సంస్థలు మీ CURను వారి అంచనాలో భాగంగా పరిగణిస్తారు. తక్కువ CURలు అనుకూలంగా కనిపిస్తాయి. తక్కువ CURతో బాధ్యతాయుతమైన క్రెడిట్‌ మేనేజ్‌మెంట్‌ కలిగినవారు రుణ ఎగవేతకు పాల్పడరని రుణసంస్థల నమ్మకం. మంచి క్రెడిట్‌ స్కోరును కొనసాగించాలని చూస్తున్న కార్డుదారులకు 30% కంటే తక్కువ CUR ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

CUR పెరగకుండా..

మీ క్రెడిట్‌ కార్డుపై ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు CUR కూడా పెరుగుతుంది. తరచూ CUR పెరుగుతూ ఉంటే, మీరు మీ క్రెడిట్‌ పరిమితిని పెంచాలని రుణ సంస్థను అడగవచ్చు. చాలా సార్లు క్రెడిట్‌ కార్డు సంస్థలు తమ రుణాలను సకాలంలో చెల్లించే వినియోగదారులకు క్రెడిట్‌ పరిమితిని పెంచుతుంటాయి. క్రెడిట్‌ కార్డు పరిమితిని పెంచడానికి బ్యాంకులు ఆఫర్‌ చేసినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. దీనివల్ల కూడా CUR 30%లోపు ఉంచడానికి సాధ్యమవుతుంది. వినియోగాన్ని బట్టి ప్రతి 12-18 నెలలకు ఒకసారి బ్యాంకులు క్రెడిట్‌ కార్డు పరిమితిని సమీక్షిస్తాయి. మంచి పరిమితితో అదనపు క్రెడిట్‌ కార్డును పొందడానికి దరఖాస్తు చేసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. మీ ఖర్చులకు ఒకే క్రెడిట్‌ కార్డు నుంచి కాకుండా 2 కార్డులను ఉపయోగించవచ్చు.

ఉదాహరణకు మీ వద్ద 2 క్రెడిట్‌ కార్డులు.. చెరో రూ.1 లక్ష పరిమితితో ఉంటే.. ఆ కార్డుల ద్వారా ఆ నెల మొత్తం రూ.50 వేలు ఖర్చుచేసినప్పుడు మీ CUR 25% మాత్రమే అవుతుంది. ఇలా CURను మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లు గడువుకు ముందే చెల్లించి కూడా సీయూఆర్‌ను అదుపులో ఉంచవచ్చు. ఉదాహరణకు మీరు 30% క్రెడిట్‌ పరిమితి దాటిపోయారనుకుందాం. 30% దాటిన మొత్తాన్ని గడువుకు ముందే చెల్లించొచ్చు. దీనివల్ల మీ CUR 30% దాటకుండా ఉంటుంది. అంతేకాకుండా క్రెడిట్‌ కార్డు మీద ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఆ నెలలో కొన్ని ఖర్చులను డెబిట్‌ కార్డు ద్వారా భర్తీ చేయడం కూడా మంచిది.

ఎక్కువ క్రెడిట్‌ కార్డులు

బహుళ క్రెడిట్‌ కార్డులు ఉండడం ప్రయోజనమే. వీటివల్ల సాధ్యమైనంత ఎక్కువ క్రెడిట్‌ను పొందడానికి అవకాశం ఉంటుంది. తద్వారా క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి(CUR)ను తగ్గించుకుని క్రెడిట్‌ స్కోరును పెంచుకోవచ్చు. అలాగని చాలా ఎక్కువ క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండడం మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మూడు కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉండడం వల్ల బిల్లు చెల్లింపులు చేసేటప్పుడు ఇబ్బందులు కలగవచ్చు. అంతేకాకుండా మీకు క్రెడిట్‌ అవసరాలు ఎక్కువని క్రెడిట్‌ సంస్థలు భావిస్తాయి. ఒకవేళ కార్డుదారుడు ఒక క్రెడిట్‌ కార్డును రద్దు చేయాలనుకుంటే, ఇతర కార్డులపై పరిమితులు పెరిగేలా చూసుకోవాలి. ఇలా చేయకపోతే ఖర్చులు పెరిగినప్పుడు సీయూఆర్‌ పెరిగిపోతుంది.

మినిమమ్‌ ఛార్జీలు

క్రెడిట్‌ కార్డు బిల్ వచ్చినప్పుడు ‘మినిమం అమౌంట్ డ్యూ’ కూడా చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఇది బిల్లులో 5% ఉంటుంది. దీన్ని అవకాశంగా చూడకూడదు. ‘మినిమం అమౌంట్ డ్యూ’ మాత్రమే చెల్లించడం వల్ల, ఆ తర్వాత నెల కూడా క్రెడిట్‌ను వినియోగిస్తే బకాయి పెరిగిపోతుంది. అప్పుడు సీయూఆర్‌ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, గడువు తేదీ లోపు ప్రతి నెలా పూర్తి బిల్లును చెల్లించడమే మంచిది. ఒకవేళ మొత్తం బిల్లు ఈఎంఐలుగా మార్చుకుంటే, అప్పుడు కూడా ప్రతి నెలా క్రెడిట్‌ను చాలా పరిమితంగా వాడుకోవడం మంచిది. లేకపోతే, సీయూఆర్‌ పెరిగిపోయే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని