Personal Finance: మీ వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి?

జీవితంలో వివిధ దశలలో అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇక్కడ చూడండి..

Published : 12 Mar 2024 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక ప్రణాళిక అనేది జీవిత లక్ష్యాలను క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా సాధించడానికి ఉపయోగపడే ప్రక్రియ. ఆర్థిక వనరులను సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకోవడం ఇందులో ఒక ముఖ్య భాగం. ముఖ్యంగా యువకులలో ఆర్థిక ప్రణాళికను అలవాటు చేయడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ, వారు తమ ఆర్థిక విషయాల గురించి స్వచ్ఛందంగా ప్లాన్‌ చేసినప్పుడు ఎక్కడ, ఎలా ప్రారంభించాలో చాలా మందికి తెలియదు. ఇక్కడ ఆర్థిక ప్రణాళికను బాగా ప్లాన్‌ చేసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

పొదుపు

ఒకరు తమ డబ్బును సరిగ్గా ప్లాన్‌ చేసి నిర్వహించడానికి గొప్ప ఆర్థిక నేపథ్యం నుంచి రావలసిన అవసరం లేదు. కొంచెం నిబద్ధత చూపిస్తే సరిపోతుంది. పొదుపు చేయాలని నిర్ణయించుకోవడం డబ్బు నిర్వహణలో మొదటి అడుగు. మెరుగైన ఆర్థిక స్వాతంత్రం కోసం డబ్బు ఆదా చేయడం ఎవరికైనా చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితిలో అప్పు కూడా దొరకని పరిస్థితిని ఊహించుకోండి. డబ్బు పొదుపు అవసరం ఏంటో మీకే తెలుస్తుంది. మీకు స్మార్ట్‌ ఫోన్‌, వాహన కొనుగోలు లాంటి కొన్ని కనీస అవసరాలు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో మీకు డబ్బు అవసరం. కానీ అది ఎక్కడ నుంచి వస్తుంది? వీటన్నింటికి సరైన సమాధానం పొదుపు. డబ్బును ఆదా చేయడం వల్ల రుణాల ఉచ్చులో పడకుండా ఉంటారు. అంతేకాకుండా క్రమం తప్పని పొదుపు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక లక్ష్యాలను సకాలంలో సాధించవచ్చు. యువకుడిగా ఉన్నప్పుడు మీ పొదుపును ప్రతి నెలా సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. 

బడ్జెట్‌

జీతం మీద జీవించే వారి ఖర్చులు వారి శక్తికి మించే ఉంటాయి. ముఖ్యంగా అనుకోని ఖర్చులు చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ బడ్జెట్‌ సిద్ధం చేయడానికి ప్రయత్నించండి. తగిన బడ్జెట్‌ను సిద్ధం చేసుకోకపోతే మీ నగదు ప్రవాహాలను నియంత్రించలేరు. బడ్జెట్‌.. మీకు ఎంత డబ్బు వస్తోంది? ఆ నిధులు ఎలా ఖర్చు చేయాలో చూపిస్తుంది. మీ ఖర్చులను వర్గీకరించండి. అత్యవసర అవసరాలు, లగ్జరీ, నివారించదగినవి.. ఈ విధంగా ఖర్చుల పూర్తి జాబితాను తయారు చేసుకోండి. దీనివల్ల దేనికి ముందుగా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. పరిమిత వనరులు, అపరిమిత కోరికలు చాలా మందికి ఉంటాయి. కానీ మీరు మీ వనరులను సరిగ్గా నిర్వహించాలి. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే నివారించదగిన ఖర్చుల పట్ల మీరు అంత మెరుగ్గా నియంత్రించుకోగలుగుతారు. సరిగ్గా ప్లాన్‌ చేస్తే కొంత డబ్బును వినోదం, విశ్రాంతి కోసం కేటాయించొచ్చు.

బ్యాలెన్స్‌ షీట్‌

ప్రతి ఏడాది మీ ఆస్తులు, రుణాల జాబితాను తయారుచేయండి. బ్యాంక్‌ బ్యాలెన్స్‌, పెట్టుబడులు, ఇంటి విలువ, ఇతర ఆస్తుల విలువను లెక్క కట్టండి. కారు రుణం, ఇంటి రుణం, క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌లతో పాటు ఇతర రుణాల జాబితాను తయారు చేయండి. ఈ వ్యక్తిగత బ్యాలెన్స్‌ షీట్‌ ఆర్థికపరంగా మీ నికర విలువను చూపుతుంది. మీ ఆర్థిక స్థితిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 

మిగులు నగదు

మీ దగ్గర ఉన్న మిగులు నగదుతో ఎలా వ్యవహరిస్తారనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ వద్ద ఉన్న నగదును సరైన చోట పెట్టుబడి పెట్టకపోతే ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ క్షీణించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు అనుకున్న విధంగా పదవీ విరమణ చేయలేరు. కాబట్టి, పెట్టుబడిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. మీ మిగులు మొత్తాన్ని రుణాలను తీర్చడానికి వాడొచ్చు. 

పదవీ విరమణ నిధి

పదవీ విరమణ ప్రణాళిక ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. అంతేకుండా ప్రతి సంవత్సరం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఖర్చులన్నింటికీ నిధులు సమకూర్చడానికి మీరు సొంత నిధులను కలిగి ఉండాలి. పదవీ విరమణ ప్లాన్‌ చేస్తున్నప్పుడు విరమణ వయసును నిర్ణయించుకోవాలి. అలాగే, మీకు ప్రతి నెలా ఎంత డబ్బు అవసరమో అంచనా వేయాలి. పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం ఎన్పీఎస్ మంచి పథకం.

రుణాలు

ఆర్థిక ప్రణాళికలో రుణ నిర్వహణ చాలా కీలకం. మీకు ఎక్కువ అప్పులు ఉన్నట్లయితే, ముందుగా ఎక్కువ వడ్డీ ఉన్న రుణాన్ని తీర్చివేయండి. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు రుణాలు అత్యంత ఖరీదైనవి. ప్రతి నెలా మీ జీతం క్రెడిట్‌ అయిన వెంటనే, క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించండి. ‘మినిమం బ్యాలెన్స్‌’ చెల్లించడానికి అవకాశమున్నా సరే దాన్ని వినియోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఎల్లప్పుడూ రుణాన్ని చివరి ప్రయత్నంగా ఉంచండి. వీలైనంత వరకు మీ కొనుగోళ్లకు నగదు రూపంలో చెల్లింపులు చేయండి. దీనివల్ల దుబారా ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇంటి రుణం వంటి పెద్ద రుణాన్ని తీసుకున్నప్పుడు బ్యాలెన్న్‌ బదిలీ ఎంపిక కోసం చూడండి. తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో మీకు డబ్బు ఆదా అయ్యే అవకాశముంది. మీ ఆదాయం తక్కువ ఉన్నప్పుడు, విలువ తగ్గే మోటారు వాహన రుణాల కోసం ప్రయత్నించకపోవడమే మంచిది.

ఎస్టేట్‌ ప్లాన్‌

చాలా మందికి ఆస్తులు ఉంటాయి. అవి వాహనం, ఇల్లు, సేవింగ్స్‌ ఖాతాలో నగదు ఏమైనా కావచ్చు. సమయం వచ్చినప్పుడు మీ అనంతరం వీటిని ఏం చేయాలో నిర్ణయించడం మీ బాధ్యత. సరైనా పద్ధతిలో ఆస్తుల కేటాయింపులు జరిగేలా జీవించి ఉన్నప్పుడే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఎస్టేట్‌ ప్లానింగ్‌ అనేది సంపన్నులకు మాత్రమే అని చాలామంది భావిస్తారు. కానీ, వాస్తవం కాదు. చాలామంది ఎస్టేట్ ప్లానింగ్‌ వాయిదా వేస్తారు. మీరు ఆస్తులను కూడబెట్టుకోవడం ప్రారంభించిన వెంటనే ఎస్టేట్‌ ప్లానింగ్‌ను ప్రారంభించవచ్చు. లబ్ధిదారుల జాబితా, ప్రతి ఒక్కరికీ కేటాయించాలనుకుంటున్న ఆస్తుల నిష్పత్తిని నిర్ణయించాలి. వీటి కోసం అనుభవజ్ఞుడైన న్యాయవాదిని సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని