Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్‌, కియా కార్ల రీకాల్‌

Hyundai, Kia Recall: హ్యుందాయ్‌, కియాకు చెందిన కొన్ని మోడల్‌ కార్లలో లోపాన్ని గుర్తించినట్లు కంపెనీలు తెలిపాయి. దీని వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి.

Published : 28 Sep 2023 13:38 IST

డెట్రాయిట్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్‌ (Hyundai), కియా (Kia) అమెరికాలో భారీ సంఖ్యలో కార్లను రీకాల్‌ (Recall) చేస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని మోడళ్లలో అగ్నిప్రమాదాలకు అవకాశం ఉండడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. లోపాన్ని సవరించే వరకు కార్లను బయటే పార్క్‌ చేసి ఉంచాలని వినియోగదారులను కోరాయి.

హ్యుందాయ్‌ శాంటా ఎఫ్‌ఈ ఎస్‌యూవీ, కియా సొరెంటో ఎస్‌యూవీ సహా 2010 నుంచి 2019 మధ్య తయారైన వివిధ మోడల్‌ కార్లలో లోపాన్ని గుర్తించినట్లు కంపెనీలు పేర్కొన్నాయి. దాదాపు 34 లక్షల కార్లను రీకాల్‌ (Recall) చేస్తున్నట్లు వెల్లడించాయి. కార్లలోని యాంటీ-లాక్‌ బ్రేక్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌లో ఫ్లుయిడ్‌ లీకవుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నాయి. ఫలితంగా ఎలక్ట్రిక్‌ షాక్‌ సంభవించే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల వాహన నడుస్తున్న సమయంలో లేదా పార్క్‌ చేసి ఉంచిన సమయంలో మంటలంటుకునే ప్రమాదం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆయా వాహనాలను బయటే పార్క్‌ చేసి ఉంచాలని సూచించింది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ వచ్చేశాయ్‌..

ఎలాంటి ఖర్చులు లేకుండానే డీలర్లు ఆయా కార్లలో యాంటీ-లాక్‌ బ్రేక్‌ ఫ్యూజ్‌ను రీప్లేస్‌ చేస్తారని కంపెనీలు వెల్లడించాయి. నవంబర్‌ 14 నుంచి వాహన యజమానులకు దీనిపై నోటిఫికేషన్‌ పంపుతామని కియా తెలిపింది. అలాగే నవంబర్‌ 21 నుంచి హ్యుందాయ్‌ ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ లోపం వల్ల హ్యుందాయ్‌లో ఇప్పటి వరకు 21 అగ్నిప్రమాద ఘటనలను గుర్తించినట్లు తెలిపింది. మరో 22 ఘటనల్లో పొగలు, భాగాలు కాలిపోవడం  వంటివి నమోదైనట్లు పేర్కొంది. కియాలో 10 ఘటనల్లో మంటలంటుకున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ ప్రమాదాల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని