కొత్త ఈవీ పాలసీ వైపు భారత్‌ అడుగులు?.. అలా చేస్తే విదేశీ కార్లకు ఈజీ ఎంట్రీ!

EV Policy: కొత్త విద్యుత్‌ వాహన పాలసీని తీసుకొచ్చేందుకు భారత్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏదైనా విదేశీ కంపెనీ దేశీయంగా తయారీ చేపడితే సుంకం తగ్గించాలని ఇందులోని ముఖ్య ప్రతిపాదన.

Updated : 25 Aug 2023 17:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా (Telsa) భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో చూస్తోంది. దిగుమతి సుంకం తగ్గించాలని ఆ కంపెనీ కోరుతుండగా.. దేశీయంగా తయారీ చేపట్టాక ఆలోచన చేస్తామంటూ భారత్‌ షరతులు విధించింది. దీంతో టెస్లా ఇప్పటి వరకు భారత్‌లో అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఇరుపక్షాలకు మేలుచేకూరేలా భారత ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్‌ కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్ పాలసీకి (EV Policy) రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా తయారీ చేపడితే దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించాలన్నది ఇందులోని కీలక ప్రతిపాదన అని సంబంధిత వర్గాలు తెలిపినట్లు పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

ఇతర దేశాల్లో పూర్తిగా తయారై భారత్‌కు దిగుమతి చేసుకుంటున్న కార్లపై ప్రస్తుతం 70-100 శాతం పన్ను వర్తిస్తోంది. ఈ కారణంతోనే టెస్లా సుంకం తగ్గించాలని కోరుతోంది. దేశీయంగా సదరు కంపెనీ కొంతమేర తయారీ చేపడితే దిగుమతి చేసుకునే వాహనాలపై సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం ఆలోచనగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్లా చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తమ ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని బి20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Hero Karizma XMR: హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది.. ఆసక్తిరేపుతున్న టీజర్లు

ప్రస్తుతం దేశీయంగా అమ్ముడవుతున్న మొత్తం కార్లలో 2 శాతం మాత్రమే ఈవీలు ఉంటున్నప్పటికీ.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకవేళ ఈ పాలసీని కనుక తీసుకొస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు అమాంతం తగ్గనున్నాయి. టెస్లాతో పాటు మరిన్ని కార్ల కంపెనీలకు ద్వారాలు తెరిచినట్లు అవుతుంది. అప్పుడు టెస్లా దేశీయంగా తయారు చేయబోయే కార్లతో పాటు ఇతర మోడళ్లూ దేశీయంగా విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే దేశీయ విద్యుత్ కార్లు తయారు చేస్తున్న టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్ మహీంద్రాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? దేశీయ మార్కెట్‌పై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అనే అశాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని