Q-A: క్రెడిట్ స్కోరు పడిపోతే మళ్లీ పెంచుకోవచ్చా?

క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందని చింతించాల్సిన అవసరం లేదు. బ్యాంకులు పలు అంశాల ఆధారంగా రుణం అందిస్తాయి. అందులో క్రెడిట్ స్కోరు కేవలం ఒక అంశం మాత్రమే.

Updated : 08 Oct 2022 14:03 IST

నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నెలకు రూ. 26,000 జీతం. నా దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉండేవి. గతంలో జీతం సరైన సమయానికి పడకపోవడంతో నా క్రెడిట్ కార్డు బిల్లు సరైన సమయానికి చెల్లించలేకపోయా. దీంతో సిబిల్ స్కోరు పడిపోయింది. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేశాను. ఎలాంటి రుణాలూ లేవు. ఇప్పుడు మళ్లీ సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా? త్వరలో ఇంటి లోన్ తీసుకోవాలనుకుంటున్నాను.

- రాఘవేంద్ర

ఇంటి రుణం కోసం మంచి క్రెడిట్ స్కోరు తప్పనిసరి. క్రెడిట్ స్కోరును మరింతగా మెరుగుపరుచుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దరఖాస్తు చేయగానే రుణం రావడం అంత సులభం కాదు. రుణ దరఖాస్తును బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ప్రస్తుతం క్రెడిట్‌ బ్యూరోల వద్ద అందరి రుణ చరిత్ర ఉంటోంది. అందులో ఇంతకుముందు ఆ వ్యక్తి చేసిన రుణ దరఖాస్తులు, రుణ చెల్లింపుల్లో తప్పులు వంటివి ఉంటాయి. దాని ఆధారంగానే బ్యాంకులు ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఒక్కోసారి తెలియకుండానే రుణ చరిత్ర మీద చెడు ప్రభావం ఉంటుంది. అప్పుడు ఒక క్రమ పద్ధతిలో రుణ చరిత్ర నివేదికను మార్చుకుని, క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. 

ఒక్కోసారి రుణ సంస్థలు అప్పు మొత్తం తీర్చేసిన తర్వాత కూడా దాని గురించి క్రెడిట్ బ్యూరోలకు సమాచారం అందించి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని రుణ చరిత్ర నివేదికలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. మీ విషయంలోనూ ఇదే జరిగి ఉంటే.. ఆ విషయాన్ని రుణ సంస్థ ద్వారా క్రెడిట్ బ్యూరోకు చెప్పించి అప్‌డేట్‌ చేయించాలి. ఒక్కోసారి వేరే ఎవరో ఖాతాను మన నివేదికతో అనుసంధానించి ఉండొచ్చు. అలాంటప్పుడు క్రెడిట్ బ్యూరోకు అన్ని ఆధారాలూ అందజేసి మీ నివేదికలో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడుతున్నట్లయితే బిల్లులను సకాలంలో చెల్లించడంలో జాప్యం జరగొచ్చు. ఇలాంటి చిన్న చిన్న లోపాల కారణంగా క్రెడిట్ స్కోరు తగ్గుతుంటుంది. బిల్లులు సకాలంలో చెల్లించడానికి వీలుగా ఒక క్రెడిట్ కార్డు వాడడం మంచిది. బిల్లు చెల్లింపులను గడువు తేదీ లోపు చెల్లించాలి.

క్రెడిట్ స్కోరు సరిగ్గా లేదని భావించేవారు దాన్ని మెరుగుపరుచుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వ్యక్తిగత రుణం తీసుకుని దాన్ని త్వరగా చెల్లించేయడం వల్ల క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చని ఎవరో ఇచ్చే సలహాతో రుణం తీసుకుని, అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. మీ సంపాదన, ఆర్థిక సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా బ్యాంకులు రుణం ఇవ్వడం గురించి ఆలోచిస్తాయి. అందులో క్రెడిట్ స్కోరు కేవలం ఒక అంశం మాత్రమే. అందుకే అనవసరంగా రుణం తీసుకోకపోవడమే మంచిది.

క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందని చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో చెల్లించకుండా ఉండిపోయిన క్రెడిట్ కార్డు బిల్లులను, ఈఎంఐలను వీలైనంత తొందరగా చెల్లించేయాలి. చెల్లింపు గడువులోపే ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒక్కోసారి గడువులోపు రుణం చెల్లించనందువల్ల మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు కొత్త రుణాలను తీసుకోకపోవడం మంచిది. ప్రస్తుత బాకీలను తీర్చడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.


ఇటీవలే మ్యూచువల్ ఫండ్స్ గురించి విన్నాను. వీటి గురించి తెలపండి. అలాగే ఎలా మదుపు చేయాలో కూడా వివరించండి.

- పుష్ప కుమారి

నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక రిస్క్ ఉంటుంది. కాబట్టి, మ్యూచువల్ ఫండ్ల ద్వారా పరోక్షంగా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో అనుభవం కలిగిన ఫండ్ మేనేజర్స్ ఉంటారు. కాబట్టి రిస్క్ కొంత వరకు తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా (ఆఫ్‌లైన్‌ పద్ధతి లేదా వారి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అయినా) మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్ల (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ యాప్‌ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ పథకాలు వందల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త‌గా పెట్టుబ‌డి ప్రారంభించాల‌నుకుంటున్నారు కాబట్టి సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇందుకోసం పరిశీలించండి.


వ్యక్తిగత రుణాల మీద పన్ను మినహాయింపులు ఉంటాయా?

- నివాన్

గృహ, విద్యా రుణాల్లో మాత్రమే పన్ను ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత రుణానికి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉండదు. ఈ రుణాల అధిక వడ్డీ వల్ల మీపై భారం పడుతుంది. వీలైనంత వరకు ఇలాంటి రుణాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అధిక ఈఎంలు ఉన్నప్పుడు మీ ఇతర లక్ష్యాల కోసం పెట్టుబడి చేయడం కూడా కష్టతరం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని