రీఫండ్ కావాలంటూ నెటిజన్‌ ట్వీట్‌.. జెట్ ఎయిర్‌వేస్‌ సీఈఓ ఘాటు రిప్లయ్‌!

రద్దయిన టికెట్‌కు రీఫండ్‌ ఇవ్వాలని ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో కాస్త ఘాటుగానే స్పందించారు. అప్పుడు తాను ఈ కంపెనీలోనే లేనని చెప్పారు.

Updated : 12 Nov 2022 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడేళ్ల క్రితం రద్దయిన ఓ విమాన టికెట్‌కు సంబంధించి రీఫండ్‌ కోరుతూ జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సంజీవ్‌ కపూర్‌కు ఓ నెటిజన్‌ వ్యంగ్య ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సీఈవో కాస్త ఘాటుగానే బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..

ఇటీవల ట్విటర్‌లో తీసుకొచ్చిన బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్ గురించి స్పందిస్తూ జెట్ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) ఓ ట్వీట్‌ చేశారు. ‘‘డబ్బులు చెల్లించిన వారికి బ్లూటిక్‌ అనేదాంట్లో అర్థం లేదనిపిస్తోంది. అలాంటి చందాదారులకు డాలర్‌ లేదా మరేదైనా గుర్తు కేటాయించొచ్చు కదా. అప్పుడు వెరిఫైడ్‌ ఖాతాలకు బ్లూటిక్ అలాగే కొనసాగించొచ్చు. దీనికి పెద్ద విజ్ఞానం ఏమీ అవసరం లేదు’’అని కపూర్‌ రాసుకొచ్చారు.

అయితే ఈ ట్వీట్‌కు పీయూష్‌ త్రివేది అనే నెటిజన్‌ రిప్లయ్‌ ఇస్తూ.. ‘‘జ్ఞానబోధలు అవసరం లేదు. ముందు 2019లో రద్దయిన విమానానికి సంబంధించి నా టికెట్‌కు రీఫండ్‌ చేయండి’’ అని అడిగాడు. దీనికి స్పందించిన కపూర్‌.. ఆ నెటిజన్‌కు కాస్త ఘాటుగానే బదులిచ్చారు. ‘‘థాంక్యూ. వ్యక్తిగతంగా మీకు ఏవిధంగానూ రుణపడి లేను. అంతేగాక, జెట్‌ 1.0లో నేను భాగం కాదు. జెట్‌ 1.0 తన కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌) నిర్దేశించిన ప్రకారం ఓ రీఫండ్‌ ప్రక్రియ (దాని ప్రకారం ఆ టికెట్‌కు ఎలాంటి రీఫండ్‌ రాదు) ఉంది. దాన్ని మీరు ఫాలో అయ్యారా?’’ అని జెట్‌ సీఈవో ప్రశ్నించారు.

అయితే ప్రస్తుతం, కపూర్‌ ఈ ట్వీట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. కానీ, అప్పటికే ఆయన రిప్లయ్‌ వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు కపూర్‌కు మద్దతుగా నిలిచారు. మూడేళ్ల పాటు కార్యాకలాపాలు నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌.. ఈ ఏడాదే తన సేవలను పునరుద్ధరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సంజీవ్‌ కపూర్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవోగా నియమితులయ్యారు.  అంతకుముందు ఆయన స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, విస్తారా సంస్థల్లో పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని