Jio Cloud PC: తక్కువ ధరకే క్లౌడ్‌ సర్వీస్‌తో జియో కొత్త ల్యాప్‌టాప్‌!

జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను పరిచయం చేయనుంది. ఇది పూర్తిగా క్లౌడ్‌ సర్వీస్‌ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ డివైజ్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Published : 21 Nov 2023 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ జియో (Reliance Jio) తక్కువ ధరకే మరో కొత్త ల్యాప్‌టాప్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థలైన హెచ్‌పీ, లెనోవా, ఏసర్‌లతో చర్చలు జరుపుతోందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది జియో బుక్‌ (Jio Book), జియో బుక్‌ 4జీ (Jio Book 4G) పేరుతో రెండు ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి ధర రూ. 16,000 కాగా, కొత్తగా తీసుకురాబోయే.. జియో క్లౌడ్‌ పీసీ (Jio Cloud PC)ని రూ. 15,000కే అందించాలని కంపెనీ భావిస్తోందట. 

‘‘సాధారణంగా ఒక ల్యాప్‌టాప్ ధరను అందులోని స్టోరేజ్‌, ప్రాసెసర్‌, చిప్‌సెట్‌, బ్యాటరీతోపాటు ఇతర హార్డ్‌వేర్‌ భాగాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటి ధర పెరిగితే దాని ప్రభావం తప్పక ల్యాప్‌టాప్‌ ధరపై ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు జియో క్లౌడ్‌ పీసీని తీసుకొస్తున్నాం. ఇందులో సిస్టమ్‌ ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దీనివల్ల తక్కువ ధరకే వినియోగదారులకు ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి వస్తుంది’’ అని కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. 

వినియోగదారులు కొనుగోలు చేసే జియో క్లౌడ్‌ పీసీ కేవలం ఒక యాక్సెస్‌ డివైజ్‌లానే పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌ను యూజర్ ఉపయోగిస్తున్నప్పుడు జరిగే ప్రాసెస్‌ (స్టోరేజ్‌, ఆన్‌లైన్‌ బ్రౌజింగ్, గేమింగ్, కోడింగ్‌ వంటివి) మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దీనివల్ల యూజర్లు తక్కువ ధరకే వేగవంతమైన క్లౌడ్‌ సర్వీసులు పొందొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పరీక్షలను హెచ్‌పీ క్రోమ్‌ బుక్‌ (HP Chrome Book) (ఇది కూడా గూగుల్ క్రోమ్‌ ఓఎస్‌ ఆధారిత క్లౌడ్‌ సర్వీస్‌తో పనిచేస్తుంది)లో చేస్తున్నారు. 

జియో క్లౌడ్‌ పీసీ కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను కంపెనీ సిద్ధం చేస్తుంది. యూజర్లు అదనంగా ల్యాప్‌టాప్‌ వద్దనుకుంటే.. జియో క్లౌడ్‌ పీసీ సాఫ్ట్‌వేర్‌ను తమ కంప్యూటర్‌, స్మార్ట్‌టీవీల్లో ఇన్‌స్టాల్‌ చేసుకుని కంప్యూటింగ్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా అదనంగా మరిన్ని సర్వీస్‌లను జియో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని