KYC: బీమా పాలసీలకు కేవైసీ పూర్తిచేశారా?

2023, జనవరి 1 నుంచి బీమా సంస్థలు కొత్తగా జారీ చేసే పాలసీలతో పాటు, పునరుద్ధరించే పాలసీలకు కేవైసీ పత్రాలను సేకరించాలి.

Published : 30 Jan 2023 23:51 IST

బీమా, భవిష్యత్తులో జరిగే ఊహించని ఆర్థిక నష్టాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది నమ్మకం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి, వివాదాలు లేకుండా పారదర్శకంగా ఉండడం అవసరం. ఈ రంగంలో మరింత స్పష్టత కోసం నియంత్రణ సంస్థ అనేక నియమాలను తీసుకొచ్చింది. అందులో కేవైసీ ఒకటి. 2023, జనవరి 1 నుంచి నో యుర్‌ కస్టమర్‌(కేవైసీ) అనేది వాహన బీమాతో సహా అన్ని రకాల బీమా పాలసీలకు తప్పనిసరి. 

సాధారణంగా, బీమాను స్వచ్ఛందంగా కొనుగోలు చేస్తారు. అయితే మోటారు బీమా చట్టం ప్రకారం వాహనం ఉన్న ప్రతీ ఒక్కరూ థర్డ్‌ పార్టీ ఇన్సురెన్స్‌ను తీసుకోవడం మాత్రం తప్పనిసరి. కాబట్టి, ఐఆర్‌డీఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన నియమావళికి కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. బీమా పాలసీల్లో మోసాలను తగ్గించడం నుంచి క్లెయిం సెటిల్‌మెంట్లు సులభంగా పూర్తి చేసేవరకు కేవైసీ సహాయపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

నియంత్రణ సంస్థ ప్రకారం 2023, జనవరి 1 నుంచి బీమా సంస్థలు కొత్తగా జారీ చేసే పాలసీలతో పాటు, పునరుద్ధరించే పాలసీలకు కేవైసీ పత్రాలను సేకరించాలి. ఇది జీవిత, ఆరోగ్య, ప్రయాణ, వాహన, ఇతర సాధారణ బీమా పాలసీలకు వర్తిస్తుంది. ఇంతకు ముందు కేవైసీ పత్రాలను కొనుగోలు సమయంలో తప్పనిసరిగా ఇవ్వాలి అనే నియమం లేదు. క్లెయిం సెటిల్‌మెంటు సమయంలో ప్రత్యేకించి రూ.1 లక్ష క్లెయిం దాటిన పాలసీలకు మాత్రమే కేవైసీ అడిగేవారు. కానీ, ఇప్పుడు అన్ని రకాల పాలసీలకు కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్లు, రుణాలు వంటి ఆర్థిక ఉత్పత్తులకు ఇప్పటికే కేవైసీ చేయించడం తప్పనిసరి. ఇప్పుడు ఇది బీమాకు విస్తరించింది. 

పాలసీదారులు కేవైసీ పూర్తిచేసేందుకు 3 మార్గాలు..

సి-కేవైసీ..
గత కొన్ని సంవత్సరాల్లో స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్లు వంటి వాటిలో పెట్టుబడిలు పెట్టినా, డి మ్యాట్‌ ఖాతా, వాహన రుణాలు తీసుకున్న వారు సీ-కేవైసీ(సెంట్రల్‌ కేవైసీ)ని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ పాలసీదారుల వద్ద ఇప్పటికే సి-కేవైసీ నంబరు ఉంటే, ఆ నంబరును పాలసీ కొనుగోలు సమయంలో బీమా సంస్థకు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ సి-కేవైసీ నంబరు లేకపోతే పాన్‌ నంబరును ఇచ్చి, బీమా సంస్థ నుంచి సి-కేవైసీ నంబరును పొందొచ్చు. 

ఇ-కేవైసీ..
ఇ-కేవైసీ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రీ-పెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ నంబర్‌ పొందాలన్నా కూడా ఇ-కేవైసీ తప్పనిసరి. ఇది ఆధార్‌ ఆధారిత డిజిటల్‌ ధృవీకరణ ప్రక్రియ, ఓటీపీతో ధ్రువీకరిస్తారు. పాలసీ కొనుగోలు సమయంలో బీమా సంస్థకు ఇ-కేవైసీ నంబరును అందించవచ్చు. 

గుర్తింపు, చిరునామా..
ఒకవేళ పాలసీదారుల వద్ద పైన పేర్కొన్న పత్రాలు ఏవీ లేనట్లయితే..గుర్తింపు, చిరునామా రుజువుల కోసం పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, పాన్‌ వంటి గుర్తింపు పత్రాలను సమర్పించి బీమా సంస్థ నుంచి కేవైసీ నంబరును పొందవచ్చు. 

కేవైసీ వల్ల ప్రయోజనాలు..

  • పరిశ్రమలో మోసాలను తగ్గించవచ్చు. పారదర్శకత పెరుగుతుంది. 
  • బీమా సంస్థలకు మరింత వివరణాత్మకంగా కస్టమర్‌ ప్రొఫైల్‌ అందుబాటులో ఉంటుంది. దీంతో మెరుగైన రిస్క్‌ అసెస్‌మెంట్‌ అవకాశం ఉంటుంది. 
  • క్లెయిం సెటిల్‌మెంట్‌ ప్రక్రియ సులభతరం అవుతుంది. 
  • మోసపూరిత క్లెయింలను అదుపులో ఉంచుతూ, సరైన క్లెయింలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. 

కేవైసీ పత్రాలు ఇవ్వకపోతే..

నియంత్రణ సంస్థ జారీ చేసిన నియమాలు, ప్రస్తుతం కొత్త/పునరుద్ధరణ పాలసీలకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి కేవైసీ ఇచ్చిన తర్వాత మాత్రమే పాలసీలను జారీచేస్తారు. ఇవ్వకపోతే పాలసీలను జారీ చేయకపోవచ్చు. పునరుద్ధరణకు గడువు ఉన్న కస్టమర్లు..గడువులోపు కేవైసీ పూర్తిచేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని