LIC Policy: ఈ రెండు ఎల్‌ఐసీ ప్లాన్లు ఇకపై అందుబాటులో ఉండవు!

ఇప్పటికే ప్లాన్లను కొనుగోలు చేసిన పాలసీదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి పాలసీలు యథావిధిగా కొనసాగుతాయి.

Updated : 23 Nov 2022 16:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) జీవన్‌ అమర్‌, టెక్‌ టెర్మ్‌ పేరుతో ఉన్న రెండు టర్మ్‌ ప్లాన్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. నేటి (నవంబరు 23) నుంచి ఈ రెండు ప్లాన్లు అందుబాటులో ఉండవని తెలిపింది. ఇందులో ఎల్‌ఐసీ టెక్‌ టర్మ్‌ ఆన్‌లైన్‌ పాలసీ కాగా, ఎల్‌ఐసీ జీవన్‌ అమర్‌ ఆఫ్‌లైన్‌ పాలసీ.

జీవన్‌ అమర్‌ ప్లాన్‌ను ఎల్‌ఐసీ 2019 ఆగస్టులో ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబరులో టెక్‌ టర్మ్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ రెండు ప్లాన్లు ప్రారంభించిన నాటి నుంచి ప్రీమియం రేట్లను పెంచలేదు. రీఇన్సురెన్స్‌ రేట్లు పెరగడమే ప్లాన్ల విత్‌డ్రాకు కారణమని, పాలసీల్లో తగిన మార్పులు చేసి త్వరలోనే కొత్త ప్రొడుక్టులను లాంచ్‌ చేస్తామని సంస్థ చెబుతోంది. 

ఈ రెండు ప్లాన్లు కూడా పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తాయి. 10 నుంచి 40 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఎల్‌ఐసీ జీవన్‌ అమర్‌ ప్లాన్‌ను కనీసం రూ.25 లక్షలు, ఎల్‌ఐసీ టెక్‌ టర్మ్‌ ప్లాన్‌ కనీసం రూ. 50 లక్షలు హామీ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఆఫ్‌లైన్‌ జీవన్‌ అమర్‌ ప్లాన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌ టెక్‌ టర్మ్‌ ప్లాన్‌ ధర తక్కువ.

ఇప్పటికే తీసుకుని ఉంటే..

ఇప్పటికే ఈ రెండు ప్లాన్లను కొనుగోలు చేసిన పాలసీదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి పాలసీలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే, ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఈ పాలసీలు అందుబాటులో ఉండవు. నవంబరు 22వ తేదీ వరకు ప్రతిపాదన పత్రం సమర్పించి, డిపాజిట్‌ చెల్లించిన కొనుగోలుదారులు తమ ప్రతిపాదనను నవంబరు 30లోగా ఆమోదించినట్లయితే ఆ ప్లాన్‌ ఇస్తారని సంబంధిత ఎల్‌ఐసీ అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని