Maruti Suzuki: మారుతీసుజుకీ కార్ల విక్రయాల్లో 3 శాతం వృద్ధి..

Maruti Suzuki: సెప్టెంబరు నెలకు సంబంధించిన వాహన విక్రయాల గణాంకాలను ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వెల్లడించింది.

Updated : 01 Oct 2023 19:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ  (Maruti Suzuki Sales) సెప్టెంబరు నెల విక్రయాల గణాంకాలను వెల్లడించింది. 1,81,343 యూనిట్ల కార్ల అమ్మకాలతో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో అర్థ వార్షిక విక్రయాల్లో మొదటి సారి మిలియన్‌ యూనిట్ల మార్కును అధిగమించి కీలక మైలురాయిని చేరుకుంది. ఇక, యుటిలిటీ వాహన అమ్మకాల్లో గతేడాదితో పోలిస్తే 2.8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ ముగిసే నాటికి మొత్తం వాహనాల్లో 10,50,085 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసే నాటికి ప్యాసింజర్ వెహికల్ (PV) విక్రయాల్లో మొదటిసారిగా 3 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. దేశీయ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 1,58,832 యూనిట్ల నుంచి 1,54,903 యూనిట్లకు పెరిగాయి. దీంతో ఈ విభాగంలో 2.5 శాతం వృద్ధి నమోదైంది. ఆల్టో, ఎస్‌-ప్రెసో వంటి చిన్న కార్ల విభాగంలో ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 22,162 నుంచి 12,209 యూనిట్లకు తగ్గాయి. బ్యాలెనో, సెలోరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌ వంటి కంపాక్ట్‌ కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 72,176 యూనిట్ల నుంచి 68,552 యూనిట్లకు చేరాయి. బ్రెజా, గ్రాండ్‌ విటారా, జిమ్నీ, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 వంటి యుటిలిటీ వెహికల్స్‌ విభాగంలో విక్రయాలు 59,271 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబరు ముగిసే సమయంలో 21,403 యూనిట్లగా ఉన్న వాహన ఎగుమతులు ఈ ఏడాది అదే సమయానికి 22,511 యూనిట్లకు పెరిగాయి.

త్వరలో వన్‌ప్లస్‌ దీపావళి సేల్‌.. ఫోన్లు, బడ్స్‌, ట్యాబ్స్‌పై ఆఫర్లివే..!

  • హ్యుందాయ్‌ మోటార్స్ (Hyundai Motor) సెప్టెంబరు నెల టోకు విక్రయాల్లో 71,641 యూనిట్లలతో 13 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలవారి టోకు విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌ ముగిసే సమయానికి 49,700 యూనిట్లుగా ఉన్న దేశీయ విక్రయాలు ఈ ఏడాది అదే సమయానికి 9 శాతం పెరిగి 54,241 యూనిట్లకు చేరినట్లు తెలిపింది.
  • టయోటా (Toyota) మునుపెన్నడూ లేనంతగా సెప్టెంబరులోనే టోకు విక్రయాలు అధికంగా జరిగినట్లు పేర్కొంది. 23,590 యూనిట్లతో 53 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. వాహన ఎగుమతులు1,422 యూనిట్లకు చేరినట్లు పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని