Threads: ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్స్‌’ వచ్చేసింది.. 4 గంటల్లోనే 50లక్షల ఖాతాలు

Threads App: ట్విటర్‌కు పోటీగా తయారైన మెటా థ్రెడ్స్‌ యాప్‌ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది.

Updated : 06 Jul 2023 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ‘థ్రెడ్స్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్‌ ఆధారిత యాప్‌ గురువారం ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. కాగా.. థ్రెడ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా.. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50లక్షలకు పెరగడం విశేషం. ఈ విషయాన్ని మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు.

ట్విటర్‌ తరహా ఫీచర్లతో ఉండే ఈ యాప్‌ను మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా తీసుకొచ్చారు. కొత్త యాప్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు తమ యూజర్‌ నేమ్‌ కొనసాగించొచ్చు. అందువల్ల, త్వరలోనే ట్విటర్‌ ఖాతాదారుల సంఖ్యను ‘థ్రెడ్స్‌’ మించిపోయే అవకాశాలున్నాయి. ఇక ఇన్‌స్టాలో అనుసరిస్తున్న ఖాతాలను, కొత్త యాప్‌పైనా అనుసరించే సౌలభ్యం ఉంది. టెక్ట్స్‌ రూపంలో ఉన్న పోస్టులను లైక్‌ చేయొచ్చు. కామెంట్‌ చేయడంతో పాటు ఇతరులతో పంచుకునే అవకాశం లభిస్తుంది.

థ్రెడ్స్‌ను పరిచయం చేస్తూ మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌.. ‘‘సంభాషణలు జరిపేందుకు స్నేహపూర్వమైన పబ్లిక్‌ స్పేస్‌ ఇది. టెక్స్ట్‌ సంభాషణలు చేసుకునేవారికి ఇదో కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి ఇలాంటి స్నేహపూర్వక కమ్యూనిటీ అవసరం ఉంది. థ్రెడ్స్‌ ఆ సౌలభ్యాన్ని కల్పిస్తుంది’’ అని తెలిపారు. ఇక ఖాతాదారుల సంఖ్యలో ట్విటర్‌ను ‘థ్రెడ్స్‌’ మించిపోనుందనే వార్తలపై జుకర్‌బర్గ్‌ స్పందించారు. ‘‘దీనికి కొంత సమయం పట్టొచ్చు. అయితే, వంద కోట్ల మంది ఖాతాదారులతో ఓ పబ్లిక్‌ కన్వర్జేషన్‌ యాప్‌ ఉండాలని నేను భావిస్తున్నా. ట్విటర్‌కు ఆ అవకాశం వచ్చినా.. అది సద్వినియోగం చేసుకోలేకపోయింది. మేం ఆ ఘనత సాధిస్తామని నమ్ముతున్నాం’’ అని మెటా సీఈఓ స్పష్టం చేశారు.

మస్క్‌ కౌంటర్‌..

ట్విటర్‌కు ప్రత్యర్థిగా తీసుకొచ్చిన ఈ యాప్‌పై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. పూర్తిగా ట్విటర్‌ను పోలినట్లుగా ఈ యాప్‌ను తీసుకురావడంతో ఓ నెటిజన్‌ మెటాపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘థ్రెడ్స్‌ను తీసుకొచ్చేందుకు మెటా కేవలం కీబోర్డులోని Ctrl+C+V (కాపీ పేస్ట్‌) మాత్రమే ఉపయోగించింది’’ అని ఆ నెటిజన్‌ ట్వీట్ చేశాడు. దీనికి ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశారు.

11 ఏళ్ల తర్వాత ట్విటర్‌లోకి జుకర్‌బర్గ్‌..

ఇదిలా ఉండగా.. థ్రెడ్స్‌ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా మెటా అధినేత జుకర్‌బర్గ్‌ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉదయం ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. 1967 నాటి స్పైడర్‌మ్యాన్‌ కార్టూన్‌ అది. అందులో విలన్‌.. హీరో మాదిరిగా ఒకే డ్రెస్సులో కన్పిస్తాడు. మస్క్‌ను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్‌ షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 2012 జనవరి 18న జుకర్‌ చివరిసారిగా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన ట్విటర్‌ను ఉపయోగించడం మళ్లీ ఇప్పుడే.

ఐరోపాలో థ్రెడ్స్‌కు సమస్యలు..

సరికొత్త థ్రెడ్స్‌ యాప్‌ ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. రెగ్యులేటరీ సమస్యల కారణంగా గురువారం దీన్ని యూరోపియన్‌ యూనియన్‌లో ప్రారంభించలేకపోయినట్లు తెలుస్తోంది. ఈయూలో వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న డిజిటల్‌ మార్కెట్స్‌ చట్టం కారణంగానే ఈ యాప్‌ను ప్రారంభించలేదని సమాచారం. అయితే, దీనిపై మెటా ఇంకా స్పందించలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని