Nothing Phone 2: మరింత పెద్ద బ్యాటరీతో నథింగ్‌ ఫోన్‌ 2.. ఎప్పుడొస్తుందంటే?

Nothing Phone 2: నథింగ్‌ ఫోన్‌ 2ను ఎప్పుడు విడుదల చేయనున్నారో కంపెనీ సీఈఓ వెల్లడించారు. అలాగే కొన్ని ఫీచర్లను కూడా బహిర్గతం చేశారు.

Published : 26 May 2023 13:30 IST

Nothing Phone 2 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆకర్షణీయమైన డిజైన్‌, ఫీచర్లతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది విడుదల చేసిన నథింగ్‌.. రెండో ఫోన్‌ (Nothing Phone 2)ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. నథింగ్‌ ఫోన్‌ 2ను జులైలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ సీఈఓ కార్ల్‌ పే వెల్లడించారు.

నథింగ్‌ ఫోన్‌ 1తో పోలిస్తే ఫోన్‌ 2 (Nothing Phone 2)లో బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్లు కార్ల్‌ పే తెలిపారు. ఫోన్‌ 1లో 4,500mAh బ్యాటరీని అమర్చగా.. ఫోన్‌ 2ను 4,700mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి అమెరికాలో కూడా ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫోన్‌ 1ను అమెరికా మార్కెట్‌లో ప్రవేశపెట్టని విషయం తెలిసిందే. అయితే, ఎంపిక చేసిన యూఎస్‌ కస్టమర్స్‌కు బీటా ప్రోగ్రాం కింద 299 డాలర్లకు 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉన్న బ్లాక్‌ కలర్‌ ఫోన్‌ను అందించారు.

నథింగ్‌ ఫోన్‌ 2 (Nothing Phone 2)లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉంటుందని కార్ల్‌ పే గతంలోనే ప్రకటించారు. ఫోన్‌ 1 మిడ్‌ రేంజ్‌ ఆక్టా కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌తో వచ్చిన విషయం తెలిసిందే.

నథింగ్‌ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 1)ను భారత్‌ సహా పలు దేశాల్లో గత ఏడాది జులైలో ఆవిష్కరించింది. 6.55 అంగుళాల ఓఎల్‌ఈడీ తెర, స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ చిప్‌సెట్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో వెనక వైపు రెండు 50 ఎంపీ, సెన్సార్లతో కూడిన కెమెరాలున్నాయి. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా ఉంది. వెనక వైపు పారదర్శకంగా ఉండడంతో పాటు ఎల్‌ఈడీ లైట్‌ స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. వినియోగదార్లు తమ ఇష్టారీతిన వివిధ నోటిఫికేషన్లకు వీటిని ఉపయోగించుకోవచ్చు. 8జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజీ మోడల్‌ ధరను రూ.32,999గా విడుదల సమయంలో ప్రకటించింది. అయితే, ఆఫర్లు, డిస్కౌంట్ల కింద ఈ ఫోన్ల ధరలు తర్వాతి రోజుల్లో కొంత దిగొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని