Gold: దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

Gold buying guide: పండగలు, శుభకార్యాలు మొదలుకానున్నాయి. ఇలాంటి సమయంలోనే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా బంగారు ఆభరణాల్ని కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ కింది విషయాలు గుర్తుంచుకోండి..

Updated : 08 Nov 2023 12:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శుభకార్యాల సీజన్‌ ప్రారంభమైంది. కొన్ని రోజుల్లో దీపావళి కూడా వచ్చేస్తోంది. ఇలాంటి సమయంలోనే చాలా మంది బంగారం కొనేందుకు మక్కువ చూపుతారు. అయితే, బంగారం విషయంలో మేకింగ్‌ ఛార్జీలు, ధర వంటి అంశాల్లో అవగాహన లేకుండానే బంగారం కొనేస్తుంటారు. దీంతో తెలియకుండానే ఆభరణాలపై అధికంగా డబ్బు వెచ్చిస్తుంటారు. పండగనే కాదు ఎలాంటి సందర్భంలోనైనా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్‌ పాటించండి..

క్రాస్ చెక్‌ చేయండి

బంగారం కొనుగోలు చేసేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బంగారం ధర. ఇది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నిత్యం మారుతూనే ఉంటుంది. నగరం, ప్రాంతాల ఆధారంగా కూడా ధరలో వ్యత్యాసం ఉంటుంది. బంగారం స్వచ్ఛతపైనే బంగారు ఆభరణాల ధర ఆధారపడి ఉంటుంది. అందుకనే వీటిని కొనుగోలు సమయంలో ప్రస్తుతం బంగారం ధర ఎంత? స్వచ్ఛత ఎలా ఉంది? ఇలా అన్ని విషయాలూ తెలుసుకోవటం ముఖ్యం.

సరిపోల్చండి

హడావిడిగా బంగారాన్ని కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేముందు వేర్వేరు నగల దుకాణాలకు వెళ్లి ధరల్ని పరిశీలించండి. నాణ్యత ఎలా ఉంది? మేకింగ్‌ ఛార్జీలు ఎంత మొత్తంలో విధిస్తున్నారు? ఇలాంటి అంశాల్ని తెలుసుకొని, ఒకదానితో మరొకటి సరిపోల్చండి. మీకు ఏ దుకాణంలో తక్కువ అనిపిస్తే అక్కడే కొనుగోలు చేయండి.

బేరం..

బంగారం ధరకు, మీరు కొనుగోలు చేసే ఆభరణాల ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణం మేకింగ్‌ ఛార్జీలు అందులో కలుపడమే. సాధారణంగా మేకింగ్ చార్జీలు 6 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటాయి. మెషీన్‌తో తయారు చేసే జువెలరీ, తక్కువ డిజైన్‌ ఉన్న నగలకు మేకింగ్‌ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అందుకే సరళమైన డిజైన్‌ ఎంచుకోవటమే ఉత్తమం. చాలా మంది సేల్‌ సమయంలో మేకింగ్‌ ఛార్జీలపై రాయితీలు, డిస్కౌంట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి సమయాల్లో మేకింగ్ ఛార్జీలపై బేరం ఆడండి.

యాప్‌ ద్వారా బంగారు ఆభరణాల స్వచ్ఛత.. తెలుసుకోండిలా..

బంగారం స్వచ్ఛత

బంగారం కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య అంశం దాని స్వచ్ఛత. బంగారం స్వచ్ఛతను క్యారెట్ల‌లో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కానీ, ప్రస్తుతం మనం కొనుగోలు చేసే బంగారం ఆభరణాలు 22 క్యారెట్లవి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు.

హాల్ మార్కింగ్

ఆభ‌ర‌ణాల‌ను అచ్చంగా బంగారంతోనే త‌యారు చేయ‌డం సాధ్యం కాదు. అందువ‌ల్ల ఇత‌ర లోహాల‌ను బంగారంతో క‌లిపి ఆభ‌ర‌ణాల‌ను త‌యారు చేస్తారు. ఈ లోహాలు ఎంత వ‌ర‌కు క‌లిపారన్న దానిపై ఆ న‌గ స్వచ్ఛత ఆధార‌ప‌డి ఉంటుంది. హాల్‌మార్క్ గుర్తు బంగారు ఆభ‌ర‌ణాల స్వచ్ఛత (22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు)ను తెలియ‌జేస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. ఒకవేళ స్వచ్ఛత విషయంలో అనుమానాలుంటే బీఐఎస్‌ కేర్‌ యాప్‌ ద్వారా మీరే స్వయంగా తనిఖీ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని