పీపీఎఫ్‌, SSY కడుతున్నారా? కనీస మొత్తం జమ చేయడానికి డెడ్‌లైన్‌ ఇదే..!

పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై వంటి ప్రభుత్వ పథకాల్లో మార్చి 31లోగా కనీస మొత్తాన్ని జమ చేయకపోతే ఆ ఖాతాలు స్తంభించిపోతాయి.

Published : 06 Mar 2024 12:35 IST

March 31 Deadline | ఇంటర్నెట్‌డెస్క్‌: పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY).. పథకాల్లో మదుపు చేస్తున్నారా? ప్రతీ ఆర్థిక సంవత్సరం కనీస మొత్తాన్ని క్రమం తప్పకుండా జమ చేస్తున్నారా? ఒకవేళ ఈ పథకాల్లో ఈ ఏడాది డిపాజిట్‌ చేయడం మర్చిపోతే మార్చి 31లోగా ఆ పని పూర్తి చేయండి. లేకపోతే ఖాతాలు స్తంభించిపోతాయి. తిరిగి అకౌంట్‌ను పునరుద్ధరించుకోవాలంటే మళ్లీ కొంత జరిమానా కట్టాల్సి ఉంటుంది. పైగా కొన్ని ప్రయోజనాలు కూడా కోల్పోతారు.

PPF: ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో ఏటా క‌నీసం రూ.500 జమ చేయాలి. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. తిరిగి ఖాతా పునరుద్ధరించాలంటే రూ.50 జరిమానా కట్టాలి. పైగా పీపీఎఫ్‌ ఖాతా తెరిచిన మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకునే సదుపాయం.. ఆరో సంవత్సరం నుంచి నగదు ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది. అకౌంట్‌ స్తంభించిపోతే లోన్‌, విత్‌డ్రా సదుపాయం కోల్పోతారు. ఒకవేళ పీపీఎఫ్‌ ఖాతాను పునరుద్ధరించాలంటే.. ఖాతా ఎన్నేళ్లు నిద్రాణ స్థితిలో ఉంటే అన్నేళ్లకు కనీస డిపాజిట్‌, జరిమానా రూ.50 చెల్లించాలి. అంటే ఏడాదికి రూ.550 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. పీపీఎఫ్‌ 16వ ఏడాది మెచ్యూర్‌ అవుతుంది.

SSY: ఆడ‌పిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సుక‌న్య సమృద్ధి యోజన పథకంలో ఏటా కనీసం రూ.250 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయొచ్చు. కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. మళ్లీ రూ.50 జరిమానా కట్టి పునరుద్ధరించుకోవచ్చు. అంటే కనీస డిపాజిట్‌ మొత్తం+ జరిమానా రూ.50 కలిపి చెల్లించాలి. ఏదైనా కారణంతో ఖాతాను పునరుద్ధరించకపోతే అకౌంట్‌లోని మొత్తం డబ్బు మెచ్యూరిటీ సమయంలో మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. ఎస్‌ఎస్‌వై ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత లేదా అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినప్పుడు అకౌంట్‌ మెచ్యూర్‌ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని