Insurance: టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

టర్మ్‌ లైఫ్‌ బీమా పాలసీని తీసుకునేటప్పుడు దీర్ఘకాల పరిస్థితులను, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసి పాలసీ తీసుకోవడానికి సిద్ధమవ్వాలి.

Published : 23 Jan 2023 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధారపడ్డ కుటుంబం ఉన్న వ్యక్తికి టర్మ్‌ లైఫ్‌ పాలసీ చాలా అవసరం. ఈ పాలసీని పొందేటప్పుడు తప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉండడం వల్ల సమయం, శ్రమ ఆదా చేసుకోవచ్చు. టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పొందడం అనేది ఆర్థిక ప్రణాళికలో ఒక బలమైన అంతర్భాగం. భవిష్యత్‌లో జరిగే పరిణామాలు, ఆర్థిక బాధ్యతలను ఎవరూ ఊహించలేరు. కాబట్టి, మీ తదనంతరం కుటుంబానికి ఏర్పడే బాధ్యతలను కవర్‌ చేయడానికి ఆర్థిక చేయూత అవసరం. అందుకే ఒకవ్యక్తి మరణించిన దురదృష్టకరమైన సందర్భంలో వారి కుటుంబ భద్రత కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంటే మంచిది. టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బీమా హామీ మొత్తం

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ బీమా పాలసీ తీసుకున్నవారు అకాల మరణం సంభవించినప్పుడు ఆ వ్యక్తి కుటుంబానికి ఈ బీమా వల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. మరణించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడడమే ఈ బీమా ఉద్దేశం. అయినప్పటికీ, బీమా హామీ మొత్తం కుటుంబానికి సరిపోకపోతే, ఆ కుటుంబానికి ఆర్థిక భద్రతా లభించనట్టే. పాలసీని పొందే సమయంలో పాలసీదారులు చేసే అతి సాధారణమైన పొరపాటుల్లో ఇది ఒకటి. అంతేకాకుండా కొంత మంది భవిష్యత్తు బీమా అవసరాలను సరిగ్గా లెక్కించరు. ఉదా: భవిష్యత్తు ద్రవ్యోల్బణం రేటు, బాధ్యతలు, రుణాలు, పిల్లల చదువు మొదలైన వాటిపై ఆధారపడిన అంశాలను గుర్తించకుండా, హామీ మొత్తాన్ని సరిగ్గా అంచనా వేయకపోతే టర్మ్‌ బీమా ఉన్నా కూడా సరైన ఫలితం ఉండదు.

పాలసీ ప్రీమియం

టర్మ్‌ ప్లాన్‌ ఎంచుకునేటప్పుడు బీమా ప్రీమియంను మాత్రమే చూడకూడదు. బీమా కంపెనీ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ నిష్పత్తి, బీమా సంస్థ ఆర్థిక స్థితి, సంస్థ పేరుప్రతిష్టలు ఇవన్నీ బీమా పాలసీకి అనుకూలతలు. దీర్ఘకాల ఆర్థిక ప్రయోజనాలు ఆశించి పాలసీని ఎంచుకోవాలి. పాలసీ ప్రీమియం ఎక్కువైనా సరే..భవిష్యత్తులో చిక్కులు కల్పించని బీమా సంస్థను ఎంచుకోవాలి.

బీమా కొనుగోలు ఎప్పుడు?

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుందన్నది మనకి తెలిసిన విషయమే. కాబట్టి, బీమా కంపెనీలు కూడా అధిక వయసు గల వారికి పాలసీ ఇచ్చేటప్పుడు కొంత రిస్క్ ఉన్నట్టు భావిస్తాయి. అందువల్ల వ్యక్తులు బీమా కొనుగోలు ఆలస్యం చేసే కొద్దీ బీమా ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయసులో రూ.50 లక్షల విలువైన టర్మ్‌ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే.. ప్రీమియం మొత్తం సంవత్సరానికి రూ.4,000-5,000 వరకు ఉండొచ్చు. అయితే, 35 ఏళ్ల వయసులో అదే ప్లాన్‌ను పొందినట్లయితే ప్రీమియం మొత్తం దాదాపు రూ.9,000-10,000 అవుతుంది. అంతేకాకుండా, బీమా పాలసీ ఆలస్యం చేస్తున్నారంటే కుటుంబ ఆర్థిక స్థితిని రిస్క్‌లో పెడుతున్నట్లే.

సమాచార లోపం

సమాచారాన్ని దాచడం లేదా తప్పు సమాచారాన్ని అందించడం అనేది వ్యక్తులు చేసే అత్యంత ప్రాథమిక తప్పుల్లో ఒకటి. మీ వైద్య చరిత్ర, వృత్తి, ఆర్థిక స్థితి మొదలైన వివరాలు మీ బీమా సంస్థకు విలువైన సమాచారం లాంటివి. ఇవి మీ బీమా కేసును అంచనా వేయడంలో బీమా సంస్థకు ఎంతగానో ఉపయోగపడతాయి. బీమా ప్రీమియం ధరను తగ్గించుకోవడానికి వ్యక్తులు ముందస్తు వ్యాధులు, జీవనశైలి వ్యవహారాలు మొదలైన వాటి గురించి సమాచారాన్ని దాచి పెడతారు. ఇది చాలా పెద్ద తప్పు. కాబట్టి కొనుగోలు సమయంలో బీమా సంస్థకు వెల్లడించని ముందస్తు వ్యాధి కారణంగా పాలసీదారు మరణించినట్లయితే, బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంది.

పన్నును ఆదా చేయడానికి

జీవిత బీమా పాలసీల ద్వారా రూ.1.50 లక్షల వరకు సెక్షన్‌ 80సిలో పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాకుండా మెచ్యూరిటీ లేదా పాలసీదారు మరణించిన సందర్భంలో పొందే బోనస్‌లు/హామీ మొత్తం నుంచి మినహాయింపు ఉంటుందని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 10 (10డి) చెబుతోంది. కేవలం ఆదాయపు పన్నును ఆదా చేయడానికి టర్మ్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయడం సరైంది కాదు.

చివరిగా: టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని పొందేటప్పుడు పైన పేర్కొన్న పొరపాట్ల గురించి అప్రమత్తంగా ఉంటే.. సమయం, శ్రమను ఆదా చేసుకోవచ్చు. టర్మ్‌ ప్లాన్‌ను మీకు, మీ కుటుంబ సభ్యులకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చేలా ఆలోచన ఉండాలి. కాబట్టి కొనుగోలు చేయడానికి మీ ప్రాధాన్యతలను జాగ్రత్తగా విశ్లేషించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని