Reliance Retail: ఏడాదిలో రిలయన్స్‌ రిటైల్‌లో ₹30 వేల కోట్ల పెట్టుబడులు

2021-22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ రిటైల్‌ విభాగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది...

Published : 08 Aug 2022 17:27 IST

దిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ రిటైల్‌ విభాగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో కొత్తగా 2,500 స్టోర్లు ఏర్పాటయ్యాయి. ఈ లెక్కన గత ఏడాది రిలయన్స్‌ రిటైల్ ఒక్కోరోజు 7 స్టోర్లను జత చేసుకుంటూ వెళ్లింది. అలాగే అదనంగా 11.1 మిలియన్‌ చదరపు అడుగుల వేర్‌హౌసింగ్‌ స్పేస్‌ అందుబాటులోకి రావడంతో కంపెనీ నిల్వ సామర్థ్యం 22.7 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. ఈ వివరాలను కంపెనీ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.

ఇదే సమయంలో రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా అదనంగా 1.50 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. దీంతో మొత్తం సిబ్బంది, ఉద్యోగుల సంఖ్య 3.61 లక్షలకు చేరింది. ఉత్పత్తుల సమీకరణ కోసం ఎంఎస్‌ఎంఈ, సర్వీస్‌ ప్రొవైడర్లు, స్థానిక అంతర్జాతీయ బ్రాండ్లతో కొత్త ఒప్పందాలను కుదుర్చుకొంది. గత ఏడాదిలోనే జస్ట్‌ డయల్‌లో ఈ కంపెనీ మెజారిటీ వాటాలను కొనుగోలు చేసింది. భారత్‌తో పాటు కొన్ని అంతర్జాతీయ బ్రాండ్లతో ఫ్రాంఛైజీలు కుదుర్చుకొంది. వ్యాపార వృద్ధికి అనుగుణంగా సరఫరా వ్యవస్థలు, ఉత్పత్తుల డిజైన్‌ వ్యవస్థలను బలోపేతం చేసింది.

2021-22లో రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపార భాగస్వామ్యాలు మూడు రెట్లు, డిజిటల్‌ కామర్స్‌ 2.5 రెట్లు పెరిగింది. నమోదిత కస్టమర్ల సంఖ్య 24 శాతం చొప్పున వృద్ధి చెంది 19.3 కోట్లకు చేరింది. జియోమార్ట్‌తో క్విక్‌ కామర్స్‌లోనూ రాణిస్తోంది. నిత్యావసర వస్తువుల డెలివరీ సంస్థ మిల్క్‌బాస్కెట్‌, క్విక్‌ కామర్స్‌ డంజోలో కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఆయా రంగాల్లో కంపెనీ సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విక్రయాలు, సేవల విలువ రూ.1,99,749 కోట్లకు చేరడంతో రిలయన్స్‌ రిటైల్ దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువ చేసే సంస్థగా అవతరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని