Retirement Fund: పదవీ విరమణ గురించి ఆలోచిస్తున్నారా?

పదవీ విరమణ గురించి ఆలోచించేవారు సంపాదన ఆరంభంలోనే సరైన పథకాలలో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించాలి. ఆ పథకాలలో కొన్నింటి గురించి ఇక్కడ చూద్దాం.

Published : 05 Jun 2023 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వ్యక్తి చేసే ఆర్థిక ప్రణాళికల్లో పదవీ విరమణకు సరైన విధంగా ప్లాన్‌ (Retirement Plan) చేసుకోవడమే అత్యంత ముఖ్యమైంది. ఎవరికైనా చిన్న వయసు నుంచి మధ్యస్త వయసు వచ్చేవరకు పెద్దగా ఇబ్బందులు లేకుండా జీవితం సాగిపోతూ ఉంటుంది. ఈ వయసులో ఏదైనా పని చేసేటట్లుగా శరీరం, మనసు సహకరిస్తుంది కూడా. అందువల్ల ఈ వయసుల వారికి ఇబ్బందులు తక్కువే అని చెప్పాలి. కానీ, 60 ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఈ వయసులో వారు కష్టపడి డబ్బులు సంపాదించలేరు. ఇలాంటి సరిస్థితుల్లో వారికి ఖర్చే కానీ, ఆదాయం ఉండదు. అందుచేత, ఎవరైనా పదవీ విరమణకు మెరుగైన ఆర్థిక ప్రణాళికను సంపాదించే వయసు నుంచే కలిగి ఉండాలి. చాలా మంది భారతీయ మధ్యతరగతి ప్రజలు పదవీ విరమణ తర్వాత జీవితాన్ని చక్కగా ఆస్వాదించాలని కోరుకుంటారు. కానీ, వీరిలో చాలా మంది ముందు నుంచీ పొదుపునకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా.. మలి వయసులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుచేత, అన్ని పొదుపు ప్రణాళికలతో పోలిస్తే పదవీ విరమణ ప్రణాళికకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 

పదవీ విరమణ ప్రణాళిక ముఖ్యం.. 

ఐక్యరాజ్యసమితి ప్రచురించిన వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ నివేదిక ప్రకారం... 2050 నాటికి దేశ జనాభాలో 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల వారి సంఖ్య 32.30 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ సంఖ్య ప్రస్తుత అమెరికా జనాభాతో దాదాపు సమానం. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై భారత్‌లో కూడా చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. దీనివల్ల 60 ఏళ్లు దాటిన వారిని చూసుకోవడానికి వారి సొంత ఇంట్లోనే సరైన సపోర్ట్‌ ఉండదు. కాబట్టి, ఎవరైనా పదవీ విరమణ కోసం చాలా ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. ఈ కారణంగా పదవీ విరమణ ప్రణాళిక ప్రాముఖ్యత పెరుగుతుందే గానీ తగ్గదు. 

50/30/20 రూల్‌

పదవీ విరమణ ప్రణాళిక అనేది సుదీర్ఘ ఆట లాంటిది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం మీ జీవనశైలిని త్యాగం చేయకుండానే పొదుపు చేయొచ్చు. మీరు జీవన వ్యయానికి ఖర్చు పెట్టేటప్పుడు.. పదవీ విరమణ ప్రణాళిక గురించి ఆలోచించాలి. ఆరోగ్యకరమైన జీవితానికి చక్కని ఆహారం ఎలా ఏర్పాటు చేసుకుంటామో.. అలాగే పదవీ విరమణ కోసం చక్కని వ్యూహాన్ని ఆలోచించాలి. ప్రస్తుత ఖర్చుల మీద తగినంత దృష్టి పెట్టాలి. 50/30/20 నియమం అనేది దీర్ఘకాలిక బడ్జెట్‌ మార్గదర్శకం. ఇంటి అద్దె/ఈఎంఐ, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, పిల్లల విద్య వంటి అవసరాలకు బడ్జెట్‌లో 50% మేరకు ఖర్చు పెట్టాలి. ప్రయాణాలు, షాపింగ్‌ వంటి ఖర్చులకు ఆదాయంలో 30% కేటాయించాలి. మిగిలిన 20% పొదుపు, ఇతర పెట్టుబడులకు ఉపయోగించాలని ఈ నియమం చెబుతుంది.

ఖర్చుల మీద దృష్టి

కాలం గడుస్తున్న కొద్దీ, భారత్‌లో పెరుగుతున్న జీవన వ్యయానికి సంబంధించిన ప్రభావాలను అందరూ చూస్తునే ఉన్నారు. కాబట్టి, వీలైనంత త్వరగా పొదుపు గురించి ఆలోచించాలి. భవిష్యత్‌లో ఉపయోగపడని రుణాలు ఉంటే వాటిని తగ్గించుకోండి. షాపింగ్‌, వినోదం, విహారయాత్ర కోసం చేసే ఖర్చులను సమీక్షించండి. వీటిలో ఎంతవరకు ఖర్చులను తగ్గించుకోవచ్చో చూడండి. మీ పదవీ విరమణ తర్వాత ఎంత డబ్బు అవసరమో తెలుసుకోండి. కెరీర్‌లో వృద్ధి ఉన్నంతకాలం, అంటే మీ ఆదాయం పెరుగుతున్నప్పుడు.. మీ పదవీ విరమణ పెట్టుబడులను కూడా పెంచాలి. ముఖ్యంగా సంపాదన ఆరంభంలోనే పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే, మీ నిధి పెరగడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఒకరి ఆర్థిక ప్రణాళికపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ఈ వాస్తవాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. పదవీ విరమణ ప్రణాళిక కోసం కొన్ని పెట్టుబడి ఎంపికలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని చూడండి.

ఎన్‌పీఎస్‌: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) అనేది రిటైరైన తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని అందించే లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వ పథకం. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. పదవీ విరమణ సమయంలో నిధిలో కొంత భాగం ఉపసంహరణకు అందుబాటులో ఉంటుంది. మిగిలినది సాధారణ పెన్షన్‌ చెల్లింపుగా ఉంటుంది. 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సిలో ఎన్‌పీఎస్‌ విరాళాలకు పన్ను మినహాయింపు కలిగి ఉంది. మీ వయసు ఆధారంగా పెట్టుబడి ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

పీపీఎఫ్‌: ప్రభుత్వ పథకం అయిన పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా.. వార్షికంగా 7.10% వడ్డీ పొందొచ్చు. ఈ పథకం కాలవ్యవధి 15 సంవత్సరాలు. 15 ఏళ్ల అనంతరం ప్రతి 5 సంవత్సరాలకు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. ఇలా అపరిమిత కాలానికి మదుపు చేయొచ్చు. ఏడాదికి ఇందులో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు మదుపు చేసే అవకాశం ఉంది. మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై ఏ విధమైన ఆదాయ పన్నూ లేదు. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి ప్రకారం పన్ను మినహాయింపు ఉంది. రిస్క్‌ పెట్టుబడులకు దూరంగా ఉండేవారు.. రాబడి పన్ను రహితంగా ఉండాలనుకునేవారికి ఈ పీపీఎఫ్‌ మంచి పథకమనే చెప్పాలి.

వీపీఎఫ్‌: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ కింద ప్రతి నెలా బేసిక్‌, డీఏలో 12% కట్‌ అవుతుంది. ఈ 12% కన్నా అదనంగా చెల్లించడాన్నే వీపీఎఫ్‌ అంటారు. అయితే, ఈ వీపీఎఫ్‌లో గరిష్ఠంగా 100% బేసిక్‌, డీఏను పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంటుంది. వీపీఎఫ్‌ ద్వారా మదుపు చేయడం చాలా సులభం. మీ కార్యాలయ అకౌంట్స్‌ సెక్షన్‌లో లెటర్‌ ఇస్తే సరిపోతుంది. ఈపీఎఫ్‌కు ఇచ్చే వడ్డీ మాదిరిగానే దీనికి కూడా ప్రస్తుతం 8.15% రాబడి లభిస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ హామీ ఉండే పథకం కాబట్టి పెట్టుబడికి రిస్క్‌ ఉండదు. ఈ పథకంలో కూడా దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే రిటైర్‌ అయ్యే నాటికి గరిష్ఠ మొత్తాన్ని అందుకోవచ్చు.

మ్యూచువల్‌ ఫండ్స్‌: ఇందులో పెట్టుబడులపై రిస్క్‌ ఉన్నప్పటికీ వచ్చే రాబడిని చాలా మంది ఇన్వెస్టర్లు సానుకూలంశంగా పరిగణిస్తున్నారు. ఈ ఫండ్లు ఈక్విటీ చారిత్రక గణాంకాల ప్రకారం.. దీర్ఘకాలంలో బాగా పనిచేసే ఆస్తి తరగతిగా నిరూపితమైంది. నిఫ్టీ 50 TRI, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం 50 అతి పెద్ద స్టాక్‌ల ఇండెక్స్‌, గత దశాబ్దంలో ఏటా 13% రాబడిని అందించింది. గత 10 ఏళ్లుగా సిప్‌ ద్వారా నిఫ్టీ 50 TRIలో క్రమం తప్పకుండా నెలవారీగా రూ.55 వేలు పెట్టుబడి పెడితే రూ.1.40 కోట్ల నిధి మొత్తాన్ని సేకరించి ఉండొచ్చు. 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.55 వేలు సిప్‌ ద్వారా పొదుపు చేయడం ప్రారంభించినట్లయితే.. రూ.3.40 కోట్లు సంపాదించి ఉండొచ్చు. రిస్క్ తీసుకోగలిగే వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు.

చివరిగా: పదవీ విరమణ గురించి ముందు నుంచి ప్రణాళికతో ఆలోచించినప్పుడే రిటైర్‌మెంట్‌ అనంతరం సౌకర్యవంతమైన జీవనశైలిని ఆస్వాదించగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని