Banking: ఇంటి వద్దకే ఎస్‌బీఐ సేవలు

ఎస్‌బీఐ డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌(డీఎస్‌బీ) సేవను ఉపయోగించి నగదును ఎలా ఉపసంహరించుకోవాలో ఇప్పుడు చూద్దాం

Published : 17 Jan 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్హత ఉన్న ఖాతాదారులకు ఎస్‌బీఐ (SBI) ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను అందిస్తోంది. నగదును స్వీకరించడానికి, డిపాజిట్‌ చేయడానికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బ్యాంకులు తమ ఖాతాదారులకు అందుబాటులో ఉన్న సేవలను బట్టి ఛార్జీలు వసూలు చేస్తాయి. అలాగే, ఈ ఛార్జీలు ఖాతాదారుడి వ్యక్తిగత స్థితిపై ఆధారపడి ఉంటాయి. డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ అనేది బ్యాంకులు అందించే అత్యుత్తమ సేవల్లో ఒకటి. ఇది సీనియర్‌ సిటిజన్‌లు, ప్రత్యేక అవసరాలు కలిగిన ఖాతాదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎస్‌బీఐ ఇప్పుడు వికలాంగ ఖాతాదారులకు ఛార్జీ లేకుండా ప్రతి నెలా మూడు సార్లు డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవడానికి అనుమతిస్తోంది. ఆర్థిక, ఆర్థికేతర సేవలకు బ్యాంకు రూ.75+జీఎస్‌టీని వసూలు చేస్తుంది.

నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని పొందేందుకు డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ కోసం ఎలా నమోదు చేసుకోవాలి?

  • డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలను పొందడానికి డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఖాతాదారుడు ఐఫోన్‌ వినియోగదారుడు అయితే..యాప్‌ స్టోర్‌ నుంచి, అండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు అయితే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ (డీఎస్‌బీ) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • యాప్‌ విజయవంతంగా డౌన్‌లోడ్‌ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్‌ చేసుకొని తమను తాము నమోదు చేసుకోవడానికి మొబైల్‌ నంబర్‌ను తెలుపాల్సి ఉంటుంది.
  • సిస్టమ్‌ నుంచి ఓటీపీ జనరేట్ అయ్యి ఖాతాదారుని మొబైల్‌కు వస్తుంది.
  • డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో ఈ ఓటిపీని నమోదు చేయాలి.
  • పాస్‌వర్డ్‌ (పిన్‌) నిబంధనలు, షరతులను అంగీకరించాలి.
  • రిజిస్ట్రేషన్‌ అయ్యాక డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ వెల్‌కమ్‌ ఎస్‌ఎంఎస్‌ను పంపుతుంది.
  • ఖాతాదారుడు అదనపు సమాచారాన్ని నమోదు చేయడానికి పిన్‌తో యాప్‌లో లాగిన్‌ అవ్వాలి.
  • ఖాతాదారుడు అడ్రస్‌ను ఎంపిక చేసుకుని, ఆ వివరాలను నమోదు చేయాలి.

డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎస్‌బీఐ నుంచి నగదు ఉపసంహరణను ఎలా అభ్యర్థించాలి?

  • డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో సేవ అభ్యర్థనను ప్రారంభించడానికి 'ఎస్‌బీఐ'ను ఎంచుకోవాలి.
  • ఖాతా నంబర్‌లోని చివరి ఆరు అంకెలను టైప్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.
  • ఖాతా ధ్రువీకరణకు వినియోగదారుడికి ఓటీపీ వస్తుంది.
  • ఖాతారుడు ఓటీపీని నమోదు చేసి కన్‌ఫర్మ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. బ్యాంకు పేరు, ఖాతాదారుని పేరు, ఖాతా సంఖ్య, బ్రాంచ్‌ పేరు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • లావాదేవీ మొత్తాన్ని నమోదు చేసి, లావాదేవీ రకాన్ని(కార్డు) ఎంచుకుని సబ్మిట్‌ చేయాలి.
  • వినియోగదారుని ఖాతా నుంచి ఛార్జీలు డెబిట్‌ అవుతాయి.
  • సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ జనరేట్‌ అవుతుంది.
  • వినియోగదారుడు.. ఏజెంట్‌ పేరు సహా ఏజెంట్‌ గురించి ఎస్‌ఎంఎస్‌ ద్వారా నోటిఫికేషన్‌ను అందుకుంటారు.

ఈ సేవలకు అర్హత

ఎస్‌బీఐలో 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు లేదా బలహీన వ్యక్తుల (వైద్యపరంగా దీర్ఘకాలిక అనారోగ్యం లేదా వైకల్యం ఉన్నవారు)కు సేవలు లభిస్తాయి. పూర్తి కేవైసీ నిబంధనలు పాటించిన ఖాతాదారులు అయి ఉండాలి. మొబైల్‌ నంబరు ఖాతాతో అనుసంధానం అయి ఉండాలి.

డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవల కింద నగదు లావాదేవీలకు పరిమితి

ఈ సేవ రోజుకు ఒకసారి మాత్రమే. నగదును డిపాజిట్‌ చేయడానికి ఒక లావాదేవీలో కనీసం రూ.1,000, గరిష్ఠంగా రూ.20 వేల వరకు పరిమితి ఉంది. అదే విధంగా స్వీకరించడానికి కూడా ఇదే మొత్తానికి పరిమితి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని