Snapchat: భారత్‌లో ప్రారంభమైన స్నాప్‌చాట్‌ ప్రీమియం.. అదనపు ఫీచర్లివే!

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సోషల్‌ మీడియా యాప్‌ స్నాప్‌చాట్‌ భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని ప్రవేశపెట్టింది....

Published : 11 Aug 2022 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సోషల్‌ మీడియా యాప్‌ స్నాప్‌చాట్‌ భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని ప్రవేశపెట్టింది. యూజర్లకు మరింత చేరువయ్యేందుకు స్నాప్‌చాట్‌+ పేరిట అదనపు ఫీచర్లను అందించేందుకు సిద్ధమైంది. ధరల విషయంలో ఆచితూచి వ్యవహరించే భారతీయులను దృష్టిలో ఉంచుకొని నామమాత్రపు ధరకే ప్రీమియం సేవలను తీసుకొచ్చింది.

స్నాప్‌చాట్‌+ సబ్‌స్క్రిప్షన్‌ కావాలనుకునేవారు ప్రతినెలా రూ.49 చెల్లిస్తే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధర 3.99 డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.320. ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు స్నాప్‌చాట్‌+ బ్యాడ్జ్‌, కస్టమ్‌ యాప్‌ ఐకాన్స్‌, రీవాచ్‌ ఇండికేటర్‌, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌, ఘోస్ట్‌ ట్రైల్స్‌ ఆన్‌ స్నాప్‌ మ్యాప్‌, సోలార్‌ సిస్టమ్‌.. పేరిట మొత్తం ఆరు ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది.

స్నాప్‌చాట్‌+ బ్యాడ్జ్‌ ద్వారా ఎవరెవరికీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉందో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను కావాల్సినప్పుడు ఆఫ్‌ చేసుకునే అవకాశం ఇచ్చారు. 

కస్టమ్‌ యాప్‌ ఐకాన్స్‌తో మీ మొబైల్‌ థీమ్‌కు సరిపోయే ఐకాన్‌ను యాప్‌నకు సెట్‌ చేసుకోవచ్చు.

ఎంతమంది యూజర్లు తమ స్టోరీలను రీవాచ్‌ చేశారో చూసుకునే వెసులుబాటు రీవాచ్‌ ఇండికేటర్‌ కల్పిస్తుంది. అయితే, ఎవరెవరు రీవాచ్‌ చేశారో మాత్రం తెలుసుకోలేం.

ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందిన వారు వారి ఫ్రెండ్స్‌లో ఒకరిని ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’గా పిన్‌ చేసుకోవచ్చు. అయితే, ఒకసారి ఒకరిని మాత్రమే ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఘోస్ట్‌ ట్రైల్‌ ద్వారా ఫ్రెండ్స్‌ లోకేషన్‌ను స్నాప్‌మ్యాప్‌లో చూడొచ్చు.

చివరగా సోలార్‌ సిస్టమ్‌ ఫీచర్‌తో ఫ్రెండ్స్‌ డీపీ పక్కన బ్లాక్‌ స్టార్‌ బ్యాడ్జ్‌ను ఉంచే అవకాశం ఉంటుంది.

వీటితో పాటు ప్రీమియం సబ్‌స్క్రైబర్లు స్నాప్‌చాట్‌ వెబ్‌వెర్షన్‌ను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు. అలాగే వీడియో కాల్స్‌ ద్వారా చాట్ కూడా చేసే వెసులుబాటు ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని అదనపు ఫీచర్లను తీసుకొస్తామని స్నాప్‌చాట్‌ తెలిపింది. త్వరలో ట్విటర్‌, టెలిగ్రామ్‌ కూడా తమ పెయిడ్‌ వెర్షన్లను విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని