Home Buy: ఇంటిని కొనుగోలు చేయడానికి దశలవారీ గైడ్

ఎవరికైనా వారి జీవితంలో చేసే కోనుగోళ్లలో ఇల్లు అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించాల్సిన విషయాలను తెలుసుకుందాం.

Published : 08 Feb 2024 20:14 IST

జీవితంలో మొదటి ఇల్లు కొనడం అనేది ఎవరికైనా ఒక ప్రధాన మైలురాయి. ఇంటిని పొందే ప్రక్రియకు పరిశీలన, వ్యూహాత్మక ప్రణాళిక అవసరం. మొదటిసారి లేదా రెండోసారి ఇంటిని కొనుగోలు ప్రయత్నం చేస్తున్నా సరే నివాసం కోసం అన్వేషణ చేసేటప్పుడు అనేక ఎంపికలు, చట్టబద్ధమైన వ్యవహారాలు, ముఖ్యంగా ఆర్థికంగా సరైన స్థితిలో ఉండడం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. కారు సహా ఏదైన ఇతర వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత, అవి సరిగ్గా లేకపోతే వాటిని వెంటనే వదిలించుకోవాలని చూస్తాం. ఇంటి విషయంలో అలా కాదు. కాబట్టి లో ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూద్దాం.

బడ్జెట్‌

ఇంటి కొనుగోలు ప్రక్రియలో మొదటి, అతి ముఖ్యమైన దశ బడ్జెట్‌. ఇల్లు కొనాలని నిర్ణయించుకునే ముందు మీ ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా అంచనా వేయండి. ఇంటి కొనుగోలు మాత్రమే కాకుండా దాన్ని సుదీర్ఘంగా నిర్వహించడానికి ఎంత డబ్బు ఖర్చు చేయగలరో గుర్తించండి. ముఖ్యంగా మీ ఆర్థిక స్థోమతను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి నెలా మీ ఖర్చులు పోనూ  ఈఎంఐ తీర్చడానికి ఎంత నగదు మిగిలి ఉంటుందో తెలుసుకోవడానికి సరైన బడ్జెట్‌ను ప్లాన్‌ చేయాలి. ఇల్లు అనేది మీ ఆదాయ బడ్జెట్‌కు లోబడే ఉండాలి. దాటిపోకూడదు.

లోకేషన్‌

ఇంటి నాణ్యత ఎంత ముఖ్యమో, అది ఉండే ప్రదేశం కూడా అంతే ముఖ్యం. మీరు నివసించాలనుకుంటున్న ప్రాంతాన్ని ఖరారు చేసేముందు మీకు, మీ కుటుంబానికి అవసరమైన సౌకర్యాలను పరిగణించండి. ఉదాహరణకు ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఉన్నత పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాంతాల్లో నివసించడం మంచిది. మీరు ఏదైనా వృత్తి నిపుణులైతే.. కీలక వ్యాపార కేంద్రాలకు, నగరంలోని మిగిలిన ప్రదేశాలకు మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలను పరిగణించండి. మీ ఇంటిని కేవలం నివాసిత ప్రదేశంలా మాత్రమే కాకుండా భవిష్యత్‌లో డిమాండ్‌ ఉండే రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిగా కూడా పరిగణించినట్లయితే.. మీ ఇంటి రీసేల్‌ విలువను మెరుగుపరిచడానికి అవకాశమున్న ప్రాంతాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా ప్రైమ్‌ లోకేషన్‌లో ఇల్లు అంటే అందరి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవచ్చు. అందుచేత కీలక ప్రాంతాలకు, శివారు ప్రాంతాలకు మధ్యస్థంగా ఉండే ఏరియాను ఎంపిక చేసుకోవడం మంచిది.

రుణ అర్హత

మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి రుణం తీసుకోవాలనుకుంటే.. తప్పనిసరిగా మీరు ప్రతి నెలా మంచి ఆదాయం సంపాదిస్తున్నవారై ఉండాలి. ఇంటి రుణం దీర్ఘకాలానికి సంబంధించినది కాబట్టి వయసు కూడా మధ్యస్థంగా ఉండాలి. సీనియర్‌ సిటిజన్‌ వయసు దగ్గర్లో ఉండేవారికి ఇంటి రుణం లభించే అవకాశం సాధారణంగా ఉండకపోవచ్చు. రుణ అర్హత అలాగే సహేతుకమైన వడ్డీ రేటును పొందే సామర్థ్యం ఎక్కువగా మీ సిబిల్‌ స్కోరుపై ఆధారపడి ఉంటుంది.

డౌన్‌ పేమెంట్‌, ఇతర ఖర్చులు

ఇంటి రుణాన్ని పొందడానికి రుణ మొత్తంలో 20% డౌన్‌ పేమెంట్‌ మీ వద్ద ఉండాలి. డౌన్‌ పేమెంట్‌ కోసం ముందస్తు పొదుపులను ప్రారంభించడం చాలా అవసరం. డౌన్‌ పేమెంట్‌ శాతం ఎక్కువ ఉంటే.. ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. దీనివల్ల రుణ భారం పెద్దగా అనిపించదు. అదనంగా డెవలపర్‌ విధించే అదనపు ఛార్జీలు, ఇంటీరియర్‌లకు అయ్యే ఖర్చులు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, అంతర్గత సంబంధిత ఖర్చులు పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు తగిన వృత్తి నిపుణుల నుంచి సహాయం పొందడం మంచిదే. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, హోమ్‌ ఇన్‌స్పెక్టర్‌, ల్యాండ్‌ సర్వేయర్‌, లాయర్‌ మొదలైన వారి ద్వారా సేవలను పొందాల్సి ఉంటుంది. వీరి ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటికి బీమా కూడా చేయించాలి.

సమయాన్ని వెచ్చించండి..

మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రాపర్టీని వెంటనే ఎంపిక చేసుకుంటే తక్కువ నాణ్యత గల ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లు అనేది మీ భవిష్యత్‌ అవసరాలకు, మీరు ఊహిస్తున్న జీవనశైలికి సంబంధించిన అంశం. మార్కెట్లో ఇంటి ఆప్షన్లు చాలా ఉంటాయి. ప్రతి వ్యాపారంలో పోటీ ఉన్నట్లే, రియల్‌ ఎస్టేట్‌లో కూడా గట్టి పోటీ ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇంటి అన్వేషణకు క్షేత్రస్థాయిలో బాగా తిరగాలి. మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు అధిక ప్రమాణాలు, నాణ్యతతో కూడినది లభించాలంటే మెరుగైన డెవలపర్లను సెర్చ్‌ చేయడానికి సమయాన్ని వెచ్చించండి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు గ్రేడ్‌ ఏ డెవలపర్‌ను ఎంచుకోవడం వల్ల మీరు కొనుగోలు చేసిన ఇల్లు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండడమే కాకుండా ఇంటికి నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి.

సరైన సమయం

IMARC గ్రూప్‌ అధ్యయనం ప్రకారం.. భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2023-2028 మధ్యకాలంలో 9.2% వృద్ది రేటు (సీఏజీఆర్‌)ను నమోదు చేస్తుందని ఒక అంచనా. గత దశాబ్దంలో రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎకో-ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్‌, ల్యాండ్‌ స్కేప్‌ ప్లానింగ్‌, గేటెడ్‌ కమ్యూనిటీలు, అప్‌గ్రేడ్‌ చేసిన సౌకర్యాలు, తక్కువ వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, ప్రభుత్వ సహాయం వంటివి రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లోని ప్రధాన అంశాలు. ఇలాంటి పరిణామాలతో ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, ఇంటి కొనుగోలుకు సరైన సమయం అంటే ఆర్థికంగా సానుకూలంగా ఉండడమే.

రీసేల్‌

మీరు ఇంటిపై పెట్టుబడి పెట్టడానికి ముందు ముఖ్యంగా రీసేల్‌ విలువను పరిగణించాలి. చాలా మంది ఇంటిని తీసుకునేటప్పుడు రీసేల్‌ను పరిగణనలోకి తీసుకోరు. ఇల్లు అనేది ఉండడానికి కదా రీసేల్‌తో పనేముంది అనుకుంటారు. అది కరెక్ట్‌ కాదు. భవిష్యత్‌లో మీ హోదా మారిపోవచ్చు. ఆర్థికంగా మరింత మెరుగ్గా ఉండొచ్చు. అటువంటి సందర్భంలో పాత ఇంటిని సేల్‌ చేసి కొత్త ఇంటిని కొనుగోలు చేయడం తప్పుకాదు. కాబట్టి, మీరు మొదటి ఇంటిని కొనుగోలు చేసినప్పుడు తప్పుడు ప్రాపర్టీ, లొకేషన్‌ను ఎంచుకుంటే రీసేల్‌ విషయంలో ఇబ్బందవుతుంది.

చివరిగా: భారత్‌లో ఇల్లు కొనడం అనేది ఒక ముఖ్యమైన, లాభదాయకమైన పని. అయితే, దీనికి జాగ్రత్తగా ప్రణాళిక, పరిశీలన అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని