Threads: ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌ చేయకుండానే.. థ్రెడ్స్‌లో రెండు కొత్త అప్‌డేట్లు!

Threads: థ్రెడ్స్‌లో మెటా క్రమంగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. యూజర్ల నుంచి అందుతున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మార్పులు చేస్తోంది.

Published : 14 Nov 2023 15:05 IST

Threads | ఇంటర్నెట్‌ డెస్క్‌: బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఎక్స్‌’కు పోటీగా మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్‌ (Threads) తక్కువ సమయంలోనే ఎంతో ఆదరణ పొందింది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) అనుసంధానంతో పనిచేసే ఈ యాప్‌ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకా చాలా ఫీచర్లను ప్రవేశపెట్టాల్సి ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్ మోస్సేరి.. థ్రెడ్స్‌కు సంబంధించిన రెండు కీలక అప్‌డేట్లను వెల్లడించారు. అవేంటో చూద్దాం..

జులైలో అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్‌ (Threads)లో కొన్ని ఫీచర్ల విషయంలో యూజర్లు తొలి నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేయకుండా థ్రెడ్స్‌ ప్రొఫైల్‌ను తొలగించలేకపోవడం అందులో ఒకటి. అయితే, తాత్కాలికంగా డీయాక్టివేట్‌ చేసే ఆప్షన్‌ను మాత్రం ఇచ్చారు. తాజాగా దీనిలో మార్పులు చేసినట్లు ఆడమ్‌ వెల్లడించారు. ఇకపై థ్రెడ్స్‌ ప్రొఫైల్‌ను డిలీట్‌ చేయాలంటే దానితో అనుసంధానమై ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌ను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే డిలీట్‌ లేదా డియాక్టివేట్‌ ఆప్షన్లు కనిపిస్తామని వెల్లడించారు. వీటిలో డిలీట్‌ను ఎంచుకుంటే థ్రెడ్స్‌ అకౌంట్‌ పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు.

థ్రెడ్స్‌ (Threads) పోస్ట్‌లను ఎవరు చూడాలో నియంత్రించుకునే అవకాశం ఇవ్వడం తాజాగా వచ్చిన రెండో అప్‌డేట్‌. ప్రస్తుతం థ్రెడ్స్‌లో చేసే పోస్ట్‌లు మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌లలోనూ కనిపిస్తున్నాయి. తమ కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఎంగేజ్‌మెంట్‌లను పెంచడం కోసమే మెటా ఇలా చేసింది. అయితే, దీనిపై యూజర్ల నుంచి నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. తమ పోస్ట్‌లు ఎక్కడ కనిపించాలో నిర్ణయించుకునే ప్రైవసీ తమకు ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీంతో థ్రెడ్స్‌ ఆ దిశగా మార్పులు చేసింది. సెటింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీలో దీనికి సంబంధించిన మార్పులు చేసుకోవచ్చని వెల్లడించింది.

థ్రెడ్స్‌ (Threads) జులై 6న యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇతర టెక్ట్స్‌ ఆధారిత యాప్‌లతో పోలిస్తే దీంట్లో ఫీచర్లు తక్కువగా ఉన్నట్లు యూజర్లు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో మెటా క్రమంగా ఒక్కో ఫీచర్‌ను అమలు చేస్తూ వస్తోంది. ఆగస్టులో వెబ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చింది. గత నెలలో ఎడిట్‌ బటన్‌ను ప్రవేశపెట్టింది. పోస్ట్‌ చేసిన ఐదు నిమిషాల లోపల కంటెంట్‌ను ఎన్ని సార్లయినా మార్చొచ్చు. అలాగే వాయిస్‌ థ్రెడ్స్‌ ఫీచర్‌తో రికార్డ్‌ చేసిన వాయిస్‌ను పోస్ట్‌ చేసే ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చింది.

జులైలో వచ్చిన థ్రెడ్స్‌ (Threads) అతి తక్కువ సమయంలోనే 10 కోట్ల డౌన్‌లోడ్స్‌తో రికార్డు సృష్టించింది. కానీ, యూజర్లను క్రమంగా కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం యూజర్ల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. 10 కోట్ల మంది సైనప్‌ అయితే, వారిలో సగం మందిని నిలుపుకుంటే చాలని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవల ఉద్యోగులతో ఓ సందర్భంలో అన్నారు. ప్రస్తుతం సంఖ్య అంతకన్నా తక్కువగా ఉందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని