Physical inactivity: మీరు శ్రమించకపోతే.. ప్రపంచానికి రూ.25 లక్షల కోట్ల ఖర్చు!

శారీరక శ్రమ చేయకపోవడం వల్ల అసాంక్రమిక వ్యాధులు ప్రబలుతాయని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. దాదాపు 50 కోట్ల మంది దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావొచ్చని తెలిపింది.

Updated : 19 Oct 2022 14:48 IST

వాషింగ్టన్‌: రోజంతా పడక లేదా సోఫాకే పరిమితమవుతున్నారా? ఉదయం వ్యాయామానికి బద్ధకిస్తున్నారా? శరీరాన్ని ఏమాత్రం శ్రమ పెట్టడం లేదా ?ఇది మీ వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు.. మొత్తం సమాజానికి, ఆర్థిక వ్యవస్థకే ముప్పు! మీ ఆరోగ్యంపై మీరు వహిస్తున్న అలసత్వం వల్ల ప్రపంచానికి రూ.25 లక్షల కోట్ల ఖర్చు. అదెలా అనుకుంటున్నారా? అయితే, డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన ఈ నివేదికను చూడాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది 2020-2030 మధ్య దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక తెలిపింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల రానున్న కొన్నేళ్లలో గుండె సంబంధిత, ఊబకాయం సహా ఇతర అసాంక్రమిక వ్యాధులు (ఒకరి నుంచి మరొకరికి వ్యాపించనివి) ప్రబలనున్నాయని అంచనా వేసింది. ఇందుకోసం ప్రభుత్వాలు ఏటా దాదాపు 27 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2.22 లక్షల కోట్లు) ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపింది. ఫలితంగా 2030 నాటికి ఈ వ్యయం 300 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.25 లక్షల కోట్లు)కు చేరుతుందని హెచ్చరించింది.

ప్రజల్లో శారీరక శ్రమ పెంచాలంటూ డబ్ల్యూహెచ్‌ఓ 2019లో ‘గ్లోబల్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను విడుదల చేసింది. అందులో చేసిన సిఫార్సులను ప్రభుత్వాలు ఏ మేరకు అమలు చేస్తున్నాయనే అంశంపై 194 దేశాల్లో ఇటీవల సర్వే నిర్వహించింది. ప్రజల్లో శారీరక శ్రమ లోపించడం- ప్రభుత్వాలకు పెద్ద ఖర్చుగా పరిణమించనుందని సర్వే నివేదిక హెచ్చరించింది. ‘‘నడక, సైక్లింగ్‌, ఆటలు సహా ప్రజల్లో ఇతర శారీరక శ్రమ కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహించే విధానాల అమలును ఇంకా పెంచాల్సి ఉంది. దీని వల్ల వ్యక్తులు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు సమాజానికీ, ఆర్థిక వ్యవస్థకు మేలు జరగుతుంది’’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు.

యాభై శాతం కంటే తక్కువ దేశాల్లో మాత్రమే జాతీయ స్థాయిలో ప్రజల భౌతిక కార్యకలాపాలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి. దీంట్లో మళ్లీ కేవలం 40 శాతం మాత్రమే వాటిని అమలు చేస్తున్నాయి.

అన్ని వయసుల వారికి సంబంధించి కేవలం 30 శాతం దేశాల్లో మాత్రమే జాతీయ భౌతిక కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.

దాదాపు అన్ని దేశాల్లో వయోజనుల వ్యాయామాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. కానీ, 75 శాతం మాత్రమే దాన్ని అమల్లో పెడుతున్నాయి. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలపై కేవలం 30 శాతం దేశాలే దృష్టి సారిస్తున్నాయి.

రోడ్డు పక్కన నడక, సైక్లింగ్‌కు సంబంధించిన భద్రతతో కూడిన ఏర్పాట్లను రవాణా వ్యవస్థలో భాగం చేయాలని సిఫార్సు చేయగా.. కేవలం 40 శాతం దేశాలు మాత్రమే దీన్ని అమలు చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని