Investments: స్మార్ట్‌గా పెట్టుబ‌డులు పెట్టాలా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

స‌రైన బీమా లేక‌పోతే డ‌బ్బు ఎంత తెలివిగా మ‌దుపు చేసినా లాభం ఉండ‌క‌పోవ‌చ్చు. 

Updated : 12 Aug 2022 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది పెట్టుబ‌డులు పెడతారు. కానీ, విజ‌యం సాధించేవారు మాత్రం కొంద‌రే ఉంటారు. మ‌నం తీసుకునే నిర్ణ‌యాలే మ‌న‌ల్ని స్మార్ట్ పెట్టుబ‌డిదారులుగా నిల‌బెడ‌తాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. సంపద‌ను సృష్టించాలంటే డ‌బ్బును ఆదా చేస్తే స‌రిపోదు. ఒక లక్ష్యంతో, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మ‌దుపు చూస్తూ మీ వంతు కృషి మీరు చేయాలి. అప్పుడే సంప‌ద సృష్టి సాధ్య‌ప‌డుతుంది. వాస్త‌వానికి మార్కెట్లు చాలా అనిశ్చితిగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌దుప‌ర్లు మార్కెట్ స్థితితో సంబంధం లేకుండా కొన్ని ప్రాథ‌మిక చిట్కాల‌ను అనుస‌రిస్తే విజయం సాధించవ‌చ్చు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజ‌య‌మంత‌మైన చాలామంది పెట్టుబ‌డిదారులు అనుస‌రించే గోల్డెన్‌ సూత్రాలే ఇవే..

1. త్వ‌ర‌గా ప్రారంభించండి: ఎంత త్వ‌ర‌గా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే.. అంత మంచింది. పెట్టుబ‌డులకు ఎంత ఎక్కువ స‌మ‌యం ఇస్తే.. కాంపౌండింగ్ ప్ర‌భావంతో అంత ఎక్కువ‌గా వృద్ధి చెందుతాయి. అలాగే న‌ష్ట‌భ‌యం కూడా త‌గ్గుతుంది. పెట్టుబ‌డులకు ఇదే స‌రైన స‌మ‌యం అని మ‌నం చెప్ప‌లేం. వ‌య‌సుతో సంబంధం లేకుండా సంపాద‌న ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ వెంట‌నే మ‌దుపు మొద‌లు పెట్ట‌డం మంచిది. చిన్న మొత్తంతో ప్రారంభించినా దీర్ఘ‌కాలంలో సంప‌ద సృష్టికి ఈ చిన్న పెట్టుబ‌డులే ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. 

2. స్థిరంగా పెట్టుబడి పెట్టండి: సంప‌ద సృష్టికి తేలిక దారులు ఉండ‌వు. కాబ‌ట్టి ఆక‌ర్షిణీయమైన ప‌థ‌కాల‌ను చూసి మోస‌పోవ‌ద్దు. ఆర్థిక వృద్ధికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్థిర‌మైన పెట్టుబ‌డులే మార్గం. అప్పుడప్పుడు లేదా సంవ‌త్స‌రానికి ఒక‌సారి పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్ల మీ ల‌క్ష్యాన్ని చేరుకోలేరు. ప్ర‌తి నెలా లేదా త్రైమాసికంగానైనా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబ‌డుల కోసం కేటాయించాలి. ఒక ప‌రిశోధ‌న ప్ర‌కారం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క‌నీసం 7 నుంచి 10 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డులు చేస్తే,  ప‌త‌న‌మ‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. చిన్న మొత్తంతో ప్రారంభించినా సంపాద‌న పెరిగే కొద్దీ పెట్టుబ‌డులను పెంచుతూ పోతే ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకోగ‌లుగుతాం.

3. వైవిధ్యభరితంగా: పెట్టుబ‌డులకు సంబంధించిన ప్రాథ‌మిక నియ‌మాల్లో ఒక‌టి - ‘మీ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టవద్దు’. గుడ్లున్నింటినీ ఒకే బుట్ట‌లో పెడితే రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే మీ డ‌బ్బు మొత్తాన్ని ఒకే ఆస్తిలో లేదా ఒకే పథకంలో పెడితే.. మీ పెట్టుబ‌డులు స‌రిగ్గా ప‌నిచేసినంత కాలం ప‌ర్వాలేదు. కానీ యూ ట‌ర్న్ తీసుకుని తిరోగ‌మ‌నం వైపు ప్ర‌యాణిస్తే మీరు క‌ష్ట‌ప‌డి సంపాదించిన మొత్తం కోల్పోవ‌ల‌సి వ‌స్తుంది.

అందువ‌ల్ల రిస్క్‌ తగ్గించుకోవాలనుకుంటే, బలమైన పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవాలి. పెట్టుబడుల‌పై అనుకూలమైన రాబడిని పొందాలంటే.. పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉండటం చాలా అవసరం. మ్యూచువల్ ఫండ్లు, బంగారం, షేర్లు, బాండ్లు.. ఇలా వివిధ రకాల పెట్టుబడులను ఎంపిక చేసుకోవాలి. వైవిధ్యీకరణ వ‌ల్ల మ‌నం చేసిన పెట్టుబ‌డుల్లో ఒక‌టి లేదా రెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వ‌క‌పోయినా, మిగిలిన‌వి ఆశాజ‌న‌కంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబ‌ట్టి న‌ష్టాల్లో జారిపోకుండా కాపాడుకోవ‌చ్చు. 

4. అధిక రాబ‌డి కోసం ప‌రుగులు పెట్టొద్దు: పెట్టుబ‌డులు అనేవి రాబ‌డి కోస‌మే అయిన‌ప్ప‌టికీ స్వ‌ల్ప‌కాలంలో ఎక్కువ రాబ‌డి పొందాల‌నే ఉద్దేశంతో మాత్రం పెట్టుబ‌డులు పెట్ట‌కూడ‌దు. స్వ‌ల్ప కాలంలో న‌ష్ట‌భ‌యం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ఇది అన్ని సార్లూ మిమ్మ‌ల్ని గెలిపించ‌క‌పోవ‌చ్చు. తెలివైన పెట్టుబ‌డిదారులుగా త‌క్కువ రిస్క్‌తో నిర్దిష్ట స‌మ‌యంలో స్థిర రాబ‌డుల‌ను అందించే ప‌థకాల‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలానికి కొంత రిస్క్ ఉన్న పథకాలు ఎంచుకున్నట్టయితే, నష్టాల నుంచి కోలుకునే సమయం ఉంటుంది. 

5. పెట్టుబ‌డులను క్ర‌మం త‌ప్ప‌కుండా ట్రాక్ చేయడం: ఒక‌సారి పెట్టుబ‌డులు చేసి.. మ‌న ప‌ని మ‌నం చేసేశాం అనుకోవ‌డం స‌రికాదు. స‌మయానుకూలంగా వాటిని ట్రాక్ చేయడం కూడా అవ‌స‌రం. మీ పెట్టుబ‌డులు అన్నింటినీ జాబితా చేసి స‌మ‌యానుసారంగా వాటిని రివ్యూ చేస్తుండాలి. దీనికోసం స్ప్రెడ్ షీట్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. కొన్ని రకాల పెట్టుబుడులు కాలం గడుస్తున్నా ఎలాంటి రాబ‌డినివ్వ‌క స్థిరంగా కొనసాగుతుంటాయి. అలాంటి పెట్టుబ‌డుల‌ను ఎంత‌కాలం కొన‌సాగించినా లాభం ఉండ‌దు. అలాంటివి మీ ఫోర్ట్‌ఫోలియోలో ఉంటే వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం మంచిది. సమయంతో పాటు వ్య‌క్తిగ‌త‌ అవ‌స‌రాల‌లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. దానికి త‌గిన‌ట్లుగానే పెట్టుబ‌డులు ఉండాలి. 

చివ‌రగా: మీరు ఏ వ‌య‌సులో ఉన్నారు? జీవితంలో ఏ ద‌శ‌లో ఉన్నార‌నేది ముఖ్యం కాదు. ఆర్థిక భ‌విష్య‌త్తు కోసం పెట్టుబ‌డులను ఎప్పుడైనా ప్రారంభించ‌వ‌చ్చు. పైన తెలిపిన టిప్స్‌ను అనుస‌రించి తెలివిగా పెట్టుబ‌డులు చేయ‌డ‌మే ముఖ్యం. పెట్టుబ‌డుల‌తో పాటు జీవిత‌, ఆరోగ్య బీమాల‌పై కూడా దృష్టిపెట్టండి. స‌రైన బీమా లేక‌పోతే డ‌బ్బు ఎంత తెలివిగా మ‌దుపు చేసినా లాభం ఉండ‌క‌పోవ‌చ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని